Begin typing your search above and press return to search.

ఆ మంత్రుల‌ను ఉరితీయాలంటున్న నాగం!

By:  Tupaki Desk   |   23 Aug 2018 10:29 AM GMT
ఆ మంత్రుల‌ను ఉరితీయాలంటున్న నాగం!
X
తెలంగాణ రాజకీయాల్లో సీనియ‌ర్ నేత‌గా గుర్తింపు పొందిన మాజీ మంత్రి - సీనియ‌ర్ నేత నాగం జనార్దన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన త‌ర్వాత దూకుడు పెంచారు. త‌న చేరిక‌కు సీనియ‌ర్లు అడ్డు ప‌డినప్ప‌టికీ...పార్టీలో అడుగుపెట్టిన నాగం అనంత‌రం త‌న ఉనికి చాటుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌లు కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు - సంచ‌ల‌న విమ‌ర్శ‌లకు దిగుతున్నారు. తాజాగా నాగర కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తప్పుడు ప్రణాళికలతో ప్రాజెక్టుల వ్యయం పెంచుతూ రూ.కోట్లు పక్కదారి పట్టించినందుకు తెలంగాణ సర్కార్‌ ను గిన్నీస్‌ రికార్డుకు ఎక్కించాలని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం కంటే ప్రచారానికే అధిక ఖర్చు చేసిన ఘనత కేసీఆర్‌ దన్నారు. ప్రాజెక్టులతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతికి పాల్పడే మంత్రులను ఉరితీయాలని నాగం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించాక ఇప్పుడు అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ రూపొందిస్తున్న స్కీముల‌న్నీ స్కాములమ‌యంగా మారాయ‌ని నాగం జ‌నార్ద‌న్ రెడ్డి దుయ్య‌బ‌ట్టారు. తాగునీటి కోసం కేటాయించిన రూ.7 వేల కోట్లలో రూ.ఐదున్నర కోట్లు అధికార పార్టీ నాయకుల జేబుల్లోకే వెళ్లాయని ఆరోపించారు. మిషన్‌ భగీరథ ద్వారా ఆగస్టు 15 అర్ధరాత్రి నుంచి తాగు నీరందిస్తామన్న కేసీఆర్‌ నేడు మాట తప్పారని విమర్శించారు. భగీరథ నీళ్లపై బుద్ధిన్నోడు ఎవరైనా ఇన్నిసార్లు మాట తప్పుతారా అని ప్రశ్నించారు.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ చేయకుండా పనులు ఎలా ముందుకు సాగుతాయన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా రెండు టన్నెల్స్‌ ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం ఒకటే ఏర్పాటు చేయడంలో మతలబేంటని ప్రశ్నించారు. ఆరున్నర లక్షల ఎకరాలకు నీరెక్కడ అందిస్తున్నారో చెప్పాలని నాగం డిమాండ్‌ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఒండ్రుమట్టిలో రూ.కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రాజెక్టుల రూపకల్పనలో తాను ప్రముఖ పాత్ర పోషించానని - విమర్శించే అర్హత కూడా తనకే ఉంటుందని అన్నారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌పిస్తున్న ముంద‌స్తు జ‌పంపై నాగం జ‌నార్ద‌న్ రెడ్డి త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. చేసిన దోపిడీ బయట పడుతుందనే ముందస్తు ఎన్నికలు నిర్వహించి కప్పిపుచ్చుకోవాలని యత్నిస్తున్నారని ఆరోపించారు. కానీ ఆయ‌న అవినీతిని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బ‌య‌ట‌పెడుతామ‌ని ప్ర‌క‌టించారు. టీఆర్ ఎస్ ప‌రిపాల‌న‌లోని అవినీతిని ప్ర‌జ‌లు గ‌మ‌నించార‌ని అంతా గ‌మ‌నించార‌ని, ఎన్నిక‌లు రాగానే ఆ పార్టీకి వ్య‌తిరేకంగా ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నార‌ని వ్యాఖ్యానించారు.