Begin typing your search above and press return to search.

నాగం ఫైర్‌; ''మెంటలెక్కిన ప్రభుత్వం అంటే ఇదే''

By:  Tupaki Desk   |   10 April 2015 5:53 AM GMT
నాగం ఫైర్‌; మెంటలెక్కిన ప్రభుత్వం అంటే ఇదే
X
ఫైర్‌ బ్రాండ్‌ నేతగా పేరొందిన నాగం జనార్ధనరెడ్డి కాస్త సైలెంట్‌ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని విధంగా పరాజయం పాలైన ఆయన.. ఓటమి తర్వాత కాస్త కామ్‌గానే ఉన్నారు. తిరిగే కాలు.. తిట్టే నోరు కుదురుగా ఉండదన్నట్లుగా.. తన పదునైన మాటలతో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే నాగం జనార్ధనరెడ్డి ఈ మధ్య కామ్‌గా ఉండలేకపోతున్నారు.

తాజాగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ అధికారపక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మెంటలెక్కిన ప్రభుత్వం అంటే ఇదేనంటూ ఘాటుగా విమర్శించిన ఆయన.. తాను అలా మాట్లాడటానికి దారి తీసిన పరిస్థితులను ప్రస్తావిస్తున్నారు. ఉస్మానియాలో 24 అంతస్తుల ట్విన్‌ టవర్లుకడతానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెబుతున్నారని.. కానీ ఆ ఆసుపత్రి భవనం హెరిటేజ్‌ బిల్డింగ్‌ అని గుర్తు చేశారు.

ఏ కట్టటం కూల్చి భవనం కడతావు? అంటూ సూటిగా ప్రశ్నించారు. ''ఆ కట్టే ట్విన్‌ టవర్లేవో చెస్ట్‌ ఆసుపత్రిలో కట్టచ్చుగా?'' అంటూ ప్రశ్నించారు. అనాలోచిన నిర్ణయాలకు తెలంగాణ సెక్రటేరియట్‌లోని సీ బ్లాక్‌ అడ్డాగా మారిందని.. మెంటలెక్కిన సర్కారంటూ ఇదేనని నాగం విరుచుకుపడ్డారు.

''హైదరాబాద్‌లో కాలుష్యం పెరిగింది. ఈ పరిస్థితుల్లో చెస్ట్‌ ఆసుపత్రి అవసరం నగరానికి ఉంది. నగరంలో చెస్ట్‌ ఆసుపత్రి వద్దనే మూర్ఖుడు సీ బ్లాక్‌లో తప్పించించి ఎక్కడైనా ఉంటారా?'' అని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటివరకూ ఏ నేతా తెలంగాణ ముఖ్యమంత్రిపై ఈ స్థాయిలో విరుచుకుపడలేదని చెబుతున్నారు. నాగం కానీ తనదైన శైలిలో చెలరేగిపోవాలే కానీ.. కేసీఆర్‌ అండ్‌ కోకు ఇబ్బందులే అన్న భావన వ్యక్తమవుతోంది.