Begin typing your search above and press return to search.
కాదు కాదంటూనే...కాంగ్రెస్ లోకి నాగం..!
By: Tupaki Desk | 10 Jan 2018 7:11 AM GMTఅప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చినప్పటికీ...వచ్చినప్పుడల్లా తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై హాట్ హాట్ కామెంట్లు చేసే బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి గురించి ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. టీడీపీలో ఉన్న సమయంలో తెలంగాణ టీడీపీ నాయకుడిగా గుర్తింపు పొందగా...బీజేపీలో చేరిన తర్వాత ఆ ప్రాధాన్యం దక్కలేదనే టాక్ ఎప్పటినుంచో ఉంది. దీంతో గత కొద్దికాలంగా నాగం నారాజ్ అయ్యారని...టీడీపీ నుండి బీజేపీలో చేరిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్టు ప్రచారం జరిగింది. తాజాగా ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా తెరమీదకు వచ్చేసింది!
తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు లేదని ప్రచారం జరుగుతుండడంతో ఆయన కూడా రాజకీయ భవిష్యత్తును చూసుకుంటున్నారని.. నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం సీటును ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకు కాంగ్రెస్ వైపు నుంచి వినిపిస్తున్న టాక్ కూడా ఒక కారణం! రెండ్రోజుల కిందట జర్నలిస్టులతో చిట్ చాట్ లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నాగం జనార్దన్ రెడ్డి సైతం తమ పార్టీలోకి రానున్నారని అన్నారు. దీంతో ఈ వార్తలకు బలం చేరింది. దీంతో నాగం జనార్దన్ రెడ్డి సంక్రాంతి పండుగ తర్వాత కాంగ్రెసులో చేరుతారని అంటున్నారు.
ఇందుకు నాగం వైపు నుంచి కూడా తగు లెక్కలు ఉన్నాయంటున్నారు. బీజేపీలో ఉండి టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పై తగు రీతిలో స్పందించలేకపోతున్నట్లు బలంగా నమ్ముతున్న నాగం...అందుకే పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల తన సన్నిహితులతో సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ విషయం చర్చించినట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత ఆయన పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది. కాగా, కొద్దికాలం క్రితం ఇదే ప్రచారం చోటుచేసుకోగా...నాగం ఖండించారు. కాంగ్రెస్ పార్టీలోకి తాను వెళుతున్నట్టు దుష్ప్రచారం జరుగుతోందని తెలిపారు. ఒకవేళ తాను పార్టీ మారాలనుకుంటే తనను ఆపే వారే లేరని అన్నారు. తాను నిబద్ధత కలిగిన వ్యక్తినని పేర్కొన్న నాగం, వచ్చే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. విపక్షాల్లో సరైన నాయకుడు కనుక ఉంటే టీఆర్ ఎస్ అడ్రసు గల్లంతవడం ఖాయమని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో మహబూబ్‌నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నాగం ఓటమి పాలయిన సంగతి తెలిసిందే!