Begin typing your search above and press return to search.

పండ‌గ త‌ర్వాతే..పార్టీ మార్పు క్లారిటీ: నాగం

By:  Tupaki Desk   |   11 Jan 2018 4:12 PM GMT
పండ‌గ త‌ర్వాతే..పార్టీ మార్పు క్లారిటీ: నాగం
X
తెలంగాణ బీజేపీలో అనుకున్న ఆద‌ర‌ణ ద‌క్క‌క‌పోవ‌డం...త‌న రాజ‌కీయ ల‌క్ష్యంపై అస్ప‌ష్ట‌త నెల‌కొన్న నేప‌థ్యంలో... మాజీ మంత్రి సీనియ‌ర్ నేత నాగం జ‌నార్ద‌న్ రెడ్డిపై ఇటీవ‌లి కాలంలో పుకార్లు షికార్లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. టీడీపీలో ఉన్న స‌మ‌యంలో తెలంగాణ టీడీపీ నాయ‌కుడిగా గుర్తింపు పొందగా...బీజేపీలో చేరిన త‌ర్వాత ఆ ప్రాధాన్యం ద‌క్క‌లేదనే అందుకే పార్టీ మారాల‌ని డిసైడ్ అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే ఆయ‌న గోడ దూక‌డం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ గూటికి చేరుతారని పుకార్లు ప్ర‌చారంలో ఉన్న నేప‌థ్యంలో..తాజాగా నాగం క్లారిటీ ఇచ్చారు.

ప్ర‌త్యేకంగా విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసిన నాగం జ‌నార్ద‌న్ రెడ్డి మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారంపై స్ప‌ష్ట‌త ఇచ్చారు. `బీజేపీలో నెల‌కొన్న ప‌రిణామాల ప‌ట్ల‌ ప‌లువురు కార్య‌క‌ర్త‌లు అసంతృప్తితో ఉన్నారు. పార్టీ ఎదుగుదల కన్పించకపోవడంతో నన్ను అభిమానించే ప్రజలు - కార్యకర్తలు నిరుత్సాహప‌డుతున్నారు. ఈ సమయంలో నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.రాబోయే ఎన్నికలు నాకు చివరి ఎన్నికలు. ప్రజలు - కార్యకర్తల అభిప్రాయం మేరకు నేను పార్టీ మారడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటా! ప్రస్తుతం బీజేపీలోనే కొనసాగుతున్నాను. అయితే పార్టీ మార్పు విషయంపై ఉగాది తరువాత నా నిర్ణయం వెల్లడిస్తాను` అని వెల్ల‌డించారు.

కాగా, గ‌త ఎన్నిక‌ల్లో మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన నాగం ఓట‌మి పాల‌యిన సంగ‌తి తెలిసిందే! బీజేపీ బ‌లోపేతం అవ‌డంపై నీలినీడ‌లు క‌మ్ముకున్న నేప‌థ్యం ఒక‌వైపు, బీజేపీలో ఉండి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై త‌గు రీతిలో స్పందించ‌లేని ప‌రిస్థితి మ‌రోవైపు ఉన్న నేప‌థ్యంలో నాగం త‌న‌ రాజకీయ భవిష్యత్తుకు కాంగ్రెస్‌స‌రైన వేదిక‌గా భావిస్తున్నార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల త‌న స‌న్నిహితుల‌తో స‌మావేశం ఏర్పాటు చేసుకొని ఈ విష‌యం చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. సంక్రాంతి త‌ర్వాత ఆయ‌న పార్టీ మార‌నున్న‌ట్లు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ నియోజకవర్గం సీటును ఇవ్వడానికి కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి.

ఇదిలాఉండ‌గా...ఇటీవ‌ల జ‌ర్న‌లిస్టుల‌తో చిట్‌చాట్‌లో పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నాగం జ‌నార్ద‌న్ రెడ్డి సైతం త‌మ పార్టీలోకి రానున్నార‌ని అన్నారు. దీంతో ఈ వార్త‌ల‌కు బ‌లం చేరింది. దీంతో నాగం జనార్దన్ రెడ్డి సంక్రాంతి పండుగ తర్వాత కాంగ్రెసులో చేరుతారని అంటున్నారు.