Begin typing your search above and press return to search.

బెయిల్ పై స్వాతి విడుద‌ల‌..ఆమె ఎలా ఉందంటే..?

By:  Tupaki Desk   |   28 July 2018 4:42 AM GMT
బెయిల్ పై స్వాతి విడుద‌ల‌..ఆమె ఎలా ఉందంటే..?
X
చ‌క్క‌గా చూసుకునే భ‌ర్త‌.. ముత్యాల్లాంటి ఇద్ద‌రు పిల్లలు. ఆర్థిక ఇబ్బందులంటూ తెలియ‌ని కుటుంబ ప‌రిస్థితులు. అంద‌మైన కుటుంబం. అంత‌కు మించిన అండ‌కు కొద‌వ‌లేని బంధుమిత్రులు. ఒక‌రికి ఇంత‌కంటే ఏం కావాలి? కానీ.. నాగ‌ర్ క‌ర్నూలు స్వాతికి మాత్రం ఇంత‌కు మించి అన్న భావ‌న క‌లిగింది. ఉన్న‌దాంట్లో సంతృప్తి చెంద‌ని ఆమెకు.. ఒక వ్య‌క్తి ప‌రిచ‌యం కావ‌టం.. అత‌డి ఆక‌ర్ష‌ణ‌లో ప‌డ‌టం.. వివాహేత‌ర సంబంధంలోకి వెళ్లిపోవ‌టం జ‌రిగిపోయాయి.

ఇవాల్టి రోజున ఇలాంటివి చాలానే చూస్తున్నాం క‌దా? అనుకోవ‌చ్చు. కానీ.. స్వాతి విష‌యంలో అంత‌కు మించి అన్నట్లుగా జ‌రిగింది. త‌న‌ను బాగా చూసుకునే భ‌ర్త కంటే కూడా.. తాను ఎక్సైట్ కు గుర‌య్యే ప్రియుడి మోజులో ప‌డి.. దారుణ‌మైన ప్లాన్ వేసి భ‌ర్త‌ను చంపేయ‌ట‌మే కాదు.. అత‌డి స్థానంలో త‌న ప్రియుడ్ని తీసుకొచ్చేంందుకు ముఖాన్ని కాల్చే ప్లాన్ చేయ‌టం.. ఆ త‌ర్వాత ఆసుప‌త్రిలో అడ్డంగా దొరికిపోవ‌టం.. ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలోనూ సంచ‌ల‌నంగా మార‌టం తెలిసిందే.

ఆ క్ర‌మంలో ఎనిమిది నెల‌ల క్రితం పోలీసుల అదుపులోకి వెళ్లిన ఆమె.. జైలుపాల‌య్యారు. ఆమె చేసిన ప‌నికి అత్త‌మామ‌లే కాదు.. త‌ల్లిదండ్రులు సైతం చీ కొట్ట‌ట‌మే కాదు.. ఆమె చ‌నిపోయిందంటూ పిండ ప్ర‌దానం చేసేశారు. ఆమె చేసిన దారుణమైన ప్లాన్ కు అయినోళ్లు నుంచి ముఖ ప‌రిచ‌యం ఉన్న వారి వ‌ర‌కూ ఎవ‌రూ ఆమెను ప‌ట్టించుకోలేదు. ఎనిమిది నెల‌ల కాలంలో ఆమెను ప‌రామ‌ర్శించేందుకు ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా ఆమెను క‌ల‌వ‌ని ప‌రిస్థితి. ఒక‌ర‌కంగా చూస్తే.. ఈ ప్ర‌పంచంలో ఆమెను అభిమానించ‌టం త‌ర్వాత ఆద‌రించే వారే లేని ప‌రిస్థితి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

కిందామీదా ప‌డి జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆమెను తీసుకెళ్ల‌టానికి ఎవ‌రూ రాలేదు. కానీ.. ఆమెతో మాట్లాడేందుకు మాత్రం పెద్ద ఎత్తున మీడియా త‌ర‌లి వ‌చ్చింది. ఎంత‌లా అంటే.. ఆమె త‌న చెప్పుల్ని వ‌దిలేసి మ‌రీ ప‌రుగ‌న వెళ్లిపోయేంత‌గా. ఇంత‌కాలం జైల్లో ఆమె చేసిన పనికి రూ.2700 మొత్తాన్ని చేతికి ఇచ్చారు.

బ‌య‌ట‌కు వ‌చ్చే ముందు త‌న‌కు ఇన్నాళ్లు ర‌క్ష‌ణ క‌ల్పించిన జైలు బ్యారెక్ కు దండం పెట్టి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లుగా జైలు సిబ్బంది చెబుతున్నారు. మీడియాతో మాట్లాడేందుకు నిరాక‌రించిన ఆమె.. ముఖానికి స్కార్ఫ్ క‌ట్టుకున్నారు. మాట్లాడాల‌న్న మీడియా వారి ప్ర‌శ్న‌ల‌కు రెండు చేతులు జోడించి.. దండం పెట్టి ఏడుస్తూ జైలుశాఖ ఏర్పాటు చేసిన ఎస్కార్ట్ వాహ‌నంలోకి వెళ్లి కూర్చున్నారు.

దీనికి ముందు బెయిల్ మీద విడుద‌లైన స్వాతిని ఎక్క‌డ‌కు పంపాల‌న్న అంశంపై అధికారులు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డ్డారు. చివ‌ర‌కు జైలును సంద‌ర్శించిన లీగ‌ల్ సెల్ అథారిటీ కార్య‌ద‌ర్శి శ్రీ‌విద్య సూచ‌న‌తో స్వాతిని స్టేట్ హోంకు త‌ర‌లించాల‌ని నిర్ణ‌యించారు. బెయిల్ ఇచ్చి విడుద‌ల చేసే స‌మ‌యంలో ఆమెకు జైలు అధికారులు.. న్యాయ‌వాదులు కౌన్సెలింగ్ చేశారు. ఈ సంద‌ర్భంగా స్వాతి విప‌రీతంగా ఏడ్చింద‌న్నారు.

తాను ఎంత శిక్ష అనుభ‌వించాలో అంత అనుభ‌వించాన‌ని.. త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించి.. ఉపాధి క‌ల్పిస్తే తానేంటో నిరూపించుకుంటాన‌ని ఆమె చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు.ఆశ్ర‌యం క‌ల్పించిన త‌ర్వాత పిల్ల‌ల్ని త‌న ద‌గ్గ‌ర‌కు చేర్చాల‌ని ఆమె అడిగిన‌ట్లుగా లాయ‌ర్లుచెబుతున్నారు. క్ష‌ణిక సుఖాల కోసం.. బంగారం లాంటి జీవితాన్ని నాశ‌నం చేసుకున్న స్వాతి ఎనిమిది నెల‌ల వ్య‌వ‌ధిలో మారిన తీరు అంద‌రూ చ‌ర్చించుకునేలా చేసింది.