Begin typing your search above and press return to search.

సాగర్ ను 30 మందితో ముట్టడించేస్తారట!

By:  Tupaki Desk   |   29 March 2021 1:30 PM GMT
సాగర్ ను 30 మందితో ముట్టడించేస్తారట!
X
ఎన్నిక ఏదైనా.. ఫలితం ఎలా ఉన్నా.. ప్రచారం అదిరిపోయేలా ఉండాలి. అధికారపక్షానికి వణుకు తెప్పించేలా.. ఓటర్లు ఏదో జరిగేట్లుగా ఉందనిపించేలా.. గుర్రం ఎగరా వచ్చన్న భావన కలిగేలా చేయాలి. అలాంటి ఎన్నికల ఎత్తుగడలో బీజేపీకి మించినోళ్లు ఎవరూ ఉండరే చెప్పాలి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు.. కీలక కేంద్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు హాజరు కావటం.. ఎవరికి చేతనైనంతగా వారు ప్రచారం చేయటం.. అందుకు తగ్గట్లే ఫలితాలు రావటం తెలిసిందే.

తాజాగా ఇదే సూత్రాన్ని ఇప్పుడు జరుగుతున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ పాటించాలని భావిస్తోంది. వాస్తవానికి నల్గొండ జిల్లాలో బీజేపీ బలం అంతంతమాత్రమే. అయితే.. బలం లేని చోట బలాన్ని తెచ్చుకునేందుకు ఉప ఎన్నికల్ని ఇంధనంగా వాడుతున్న కమలనాథులు.. తాజాగా జరిగే ఉప ఎన్నికను తమ పట్టు పెరిగేలా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం భారీ ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేశారని చెప్పాలి.

సాగర్ అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్న బీజేపీ అధినాయకత్వం.. అభ్యర్థి ఎవరైనా ప్రచారం మాత్రం అదిరిపోవాలన్న పట్టుదలతో ఉన్నారు.ఈ ఉప ఎన్నిక ప్రచారం కోసం రాష్ట్రానికి చెందిన 30 మందితో స్టార్ క్యాంపెయిన్ల జాబితాను బీజేపీ సిద్ధం చేసింది. వీరికి అదనంగా అవసరానికి తగ్గట్లు.. ఇతర రాష్ట్రాల నుంచి నేతల్ని తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్నారు.

ఇక..సాగర్ ఉప ఎన్నికలో 30 మంది ప్రముఖులతో ప్రచార జాబితాను సిద్ధం చేశారు. వారిలో బండి సంజయ్.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. లక్ష్మణ్.. విజయశాంతితోపాటు ఒక ఎంపీ.. ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఇతర సీనియర్ నేతలు.. మాజీ మంత్రులు.. మాజీ ఎంపీలు.. ఎమ్మెల్యేలు కూడా ప్రచారంలో పాల్గొనాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. మరి.. ఈ భారీ ప్రచారం ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.