Begin typing your search above and press return to search.

సాగర్ లో గెలిస్తే 2023 ఎన్నికలు ఆయన సారథ్యంలోనే... బంపర్ ఆఫర్ !

By:  Tupaki Desk   |   31 March 2021 1:30 PM GMT
సాగర్ లో గెలిస్తే 2023 ఎన్నికలు ఆయన సారథ్యంలోనే... బంపర్ ఆఫర్ !
X
తెలంగాణలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో హిట్ పెంచుతుంటే , ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ లో మరో చర్చ కూడా మొదలైంది. సాగర్ ఉప ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితంవస్తే , రాష్ట్ర పార్టీలో భారీ మార్పులుంటాయని, ఈ విషయమై పార్టీ అధిష్టానం వద్ద ఇటీవల కీలక చర్చ జరిగిందని తెలుస్తోంది. గాంధీభవన్‌ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కె.జానారెడ్డి గెలిస్తే, ఆయన్నే తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా నియమించాలనే ఆలోచనలో అధిష్టానం ఉంది. అలాగే 2023 లో జరగబోయే ఎన్నికలు కూడా ఆయన సారథ్యంలోనే వెళ్తారని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

ఇటీవల 10 జన్ ‌పథ్‌ లో తెలంగాణ కాంగ్రెస్‌ గురించి కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష వ్యవహారం తలనొప్పిగా మారింది. ఏకాభిప్రాయం వచ్చే అవకాశాలు అసలే కనిపించడం లేదు. జానారెడ్డి అయితే పార్టీలో చాలా సీనియర్‌. పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో సీఎల్పీ నేతగా పనిచేశారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే సీఎల్పీ నాయకుడిని చేయాలి. కానీ, ఆ పదవిలో దళిత నాయకుడు భట్టి విక్రమార్క ఉన్నారు. దళితుడిని ఆ పదవి నుంచి తొలగించి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం పార్టీకి నష్టం, అలాగని ఎమ్మెల్యేగా జానారెడ్డి గెలిచిన తర్వాత కూడా ఆయనకు ఏ పదవి ఇవ్వకుండా పీసీసీ హోదాలో మరో నేతను కూర్చోబెట్టడం ఆయన స్థాయికి తగింది కాదు.

పార్టీలో ఏ స్థాయి నేతలనైనా సమన్వయం చేసుకునే సామర్థ్యం జానాకు ఉంది. పీసీసీ అధ్యక్ష పదవి ఆశించిన కోమటిరెడ్డి, రేవంత్, జీవన్ ‌రెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని కాదనలేరు. వారికి ఇంకో రూపంలో కీలక బాధ్యతలు అప్పగించవచ్చు. అప్పుడు అధిష్టానం పని కూడా సులువవుతుంది అని ఆయన రాహుల్‌ అండ్‌ టీమ్‌కు వివరించినట్టు చర్చ జరుగుతోంది. అంతా విన్న 10 జన్‌ పథ్‌ ముఖ్య నేతలు ఈ విషయంలో స్పష్టత ఇవ్వనప్పటికీ, ముందు నాగార్జునసాగర్‌లో గెలిచి రావాలని చెప్పినట్టు సమాచారం. వాస్తవానికి, గత రెండేళ్లుగా టీపీసీసీ అధ్యక్షుడి మార్పు వ్యవహారం అదుగో, ఇదుగో అంటూ నానుతూ వస్తోంది. ఈ పదవి కోసం పోటీ పడే నేతల జాబితా భారీగా ఉండడం, షార్ట్‌ లిస్ట్‌ చేసిన తర్వాత కూడా ఏకాభిప్రాయం రాకపోవడంతో అధిష్టానానికి ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. అయితే, గత రెండు నెలల క్రితం టీపీసీసీ అధ్యక్ష వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందని, ఆ పదవికి సీనియర్‌ కాంగ్రెస్‌ నేత టి.జీవన్‌రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసిందనే లీకులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో అలర్ట్‌ అయిన జానా, మరికొందరు నేతలు అధిష్టానంతో సంప్రదింపులు జరిపి టీపీసీసీ అధ్యక్ష ప్రకటన నిలిపి వేయించారు. టీపీసీసీ అధ్యక్ష వ్యవహారాన్ని సాగర్‌ ఉప ఎన్నికల వరకు వాయిదా వేస్తున్నట్టు కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. సాగర్‌లో గెలిస్తే రాష్ట్ర పార్టీని హస్తగతం చేసుకోవాలనే వ్యూహంతోనే అయన అడుగులు ముందుకు వేస్తున్నట్టు గాంధీభవన్‌ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.