Begin typing your search above and press return to search.

‘నాగార్జున సాగ‌ర్’ సిత్రాలుః భార్య‌లు కోటీశ్వ‌రులు.. భ‌ర్త‌లు గరీబులు!

By:  Tupaki Desk   |   1 April 2021 7:48 AM GMT
‘నాగార్జున సాగ‌ర్’ సిత్రాలుః భార్య‌లు కోటీశ్వ‌రులు.. భ‌ర్త‌లు గరీబులు!
X
రాజ‌కీయ నాయ‌కులు నిబంధ‌న‌ల‌ను ఎలా ఉప‌యోగించుకుంటారో తెలిపే సంఘ‌ట‌న ఇది. తెలంగాణ‌లోని నాగార్జున సాగ‌ర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఇందుకు సంబంధించి నామినేష‌న్ల ప‌ర్వం ముగిసింది. అయితే.. ఈ సంద‌ర్భంగా అభ్య‌ర్థులు ప్ర‌క‌టించిన అఫిడవిట్ల‌పై సోష‌ల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జ‌రుగుతోంది.

ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి సీనియ‌ర్ నేత జానారెడ్డి బ‌రిలో నిలిచారు. టీఆర్ఎస్ నుంచి దివంగ‌త నోముల న‌ర్సింహయ్య కుమారుడు భ‌గ‌త్‌, బీజేపీ అభ్య‌ర్థి ర‌వికుమార్ త‌దిత‌రులు నామినేష‌న్ వేసి, ఎన్నిక‌ల సంఘానికి అఫిడ‌విట్లు స‌మ‌ర్పించారు.

ముందుగా జానారెడ్డి అఫిడ‌విట్ ను ప‌రిశీలిస్తే.. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌ద్ద కేవ‌లం 3.45 ల‌క్ష‌లు మాత్ర‌మే ఉన్నాయ‌ట‌. స్థిరాస్తి 2.73 కోట్లు ఉంద‌ట‌. ఇక‌, ఆయ‌న భార్య‌పేరుమీదున్న ఆస్తులు మాత్రం ఎన్నో రెట్లు ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. జానారెడ్డి భార్య సుమ‌తి పేరిట రూ.18.6 కోట్ల విలువైన చ‌రాస్తులు ఉన్నాయ‌ట‌. స్థిరాస్తులు రూ.9.88 కోట్లు ఉన్న‌ట్టు వెల్ల‌డించ‌డం విశేషం. అంతేకాదు.. జానారెడ్డి త‌న‌కు సొంత కారు కూడా లేద‌ని పేర్కొన్నారు.

ఇక‌, బీజేపీ అభ్య‌ర్థి ర‌వికుమార్ అఫిడ‌విట్ కూడా ఇదే విధంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న పేరు మీద బ్యాంకులో రూ.90 ల‌క్ష‌లు ఉండ‌గా.. ఆయ‌న భార్య పేరు మీద మాత్రం ఏకంగా రూ.5 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ప్ర‌క‌టించారు. టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూడా త‌న భార్య పేరు మీద రూ.2.2 కోట్లు ఆస్తులు ఉన్న‌ట్టు ఎన్నిక‌ల అఫిడ‌విట్లో పేర్కొన్నారు.

వీరు ఈ విధంగా ఆస్తులు ప్ర‌క‌టించ‌డంపై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. భార్య‌లు కోటీశ్వ‌రులు అయ్యారు.. భ‌ర్త‌లు మాత్రం గ‌రీబులుగా ఉన్నారా? ఇదెక్క‌డి విచిత్ర‌మో అని అంటున్నారు. మ‌రికొంద‌రు.. రాజ‌కీయ నాయ‌కుల భార్య‌లు మాత్ర‌మే కోటీశ్వ‌రులుగా ఉంటారెందుకో? అని సందేహం వ్య‌క్తంచేశారు.