Begin typing your search above and press return to search.

‘సాగర్’ బైపోల్: టీఆర్ఎస్ ను భయపెడుతున్న ట్రాక్టర్, రోడ్డురోలర్

By:  Tupaki Desk   |   12 April 2021 9:02 AM GMT
‘సాగర్’ బైపోల్: టీఆర్ఎస్ ను భయపెడుతున్న ట్రాక్టర్, రోడ్డురోలర్
X
టీఆర్ఎస్ ను గత ఎన్నికల్లో కొన్ని గుర్తులు చావుదెబ్బ తీశాయి. గెలవాల్సిన ఎమ్మెల్యే సీట్లను కూడా కోల్పోయేలా చేశాయి. కొన్ని చోట్ల చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా కొన్ని ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థులు గట్టెక్కారు. ఇప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వేళ కూడా టీఆర్ఎస్ కు అదే భయం వెంటాడుతోంది. రెండు గుర్తులు సాగర్ లో టీఆర్ఎస్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కూడా అధికార టిఆర్ఎస్ కు ఇప్పుడు అదే భయం పట్టుకుంది. టీఆర్ఎస్ పార్టీ గుర్తు ‘కారు’ను పోలిన రెండు గుర్తులు కలవరపెడుతున్నాయి. అచ్చం కారులా ఉన్న గుర్తులు ఎక్కడ అభ్యర్థికి చేటు తెస్తాయోనన్న భయం వెంటాడుతోంది. టిఆర్ఎస్ గుర్తు ‘కారు’ను పోలిన ‘ట్రాక్టర్’, ‘రోడ్ రోలర్’, ‘చపాతీ మేకర్’ గుర్తులను ఎన్నికల సంఘం నాగార్జున సాగర్ లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది.

ఇప్పటికే ఇలాంటి గుర్తులతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని సీట్లు టీఆర్ఎస్ కోల్పోయింది. తాజాగా 2020 డిసెంబరులో జరిగిన డబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికను కోల్పోయామని టిఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఈ సారూప్య గుర్తుల కారణంగా టిఆర్ఎస్ ఓటర్లు కారు అనుకొని స్వతంత్రులకు ఓటు వేశారని టీఆర్ఎస్ నేతలు ఈసీకి సాక్ష్యాలతో ఫిర్యాదు చేశారు.

దుబ్బాక్లో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు.. టిఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై కేవలం 1,118 ఓట్ల తేడాతో గెలుపొందారు. చాలా మంది స్వతంత్ర అభ్యర్థులు దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక స్వతంత్ర అభ్యర్థి బండారు నాగరాజుకు 3,570 ఓట్లు వచ్చాయి, వీరికి టిఆర్ఎస్ కారు సింబల్ మాదిరిగానే కనిపించే చపాతీ మేకర్ సింబల్ కేటాయించబడింది. టిఆర్ఎస్ ఓటర్లు గందరగోళం కారణంగా నాగరాజుకు ఓటు వేశారని, అందుకే ఆయనకు 3,570 ఓట్లు వచ్చాయని, మిగతా స్వతంత్రులందరికీ ఒకే అంకెలో ఓట్లు వచ్చాయని టిఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.

నాగరాజుకు టిఆర్ఎస్ ఓట్లు వచ్చాయనడానికి ఇది ఒక్కటే రుజువు అని టిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో కూడా, టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజుర్ నగర్ నుండి తక్కువ మెజారిటీతో గెలిచారని టిఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఎందుకంటే అక్కడ స్వతంత్ర అభ్యర్థికి కారు చిహ్నానికి సమానమైన రోడ్ రోలర్ చిహ్నం కేటాయించబడింది. దానికి ఓట్లు భారీగా పడడంతో టీఆర్ఎస్ ఓడి ఉత్తమ్ గెలిచాడు. ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులకు ఇదే నాగార్జున సాగర్ లో సమస్య అయ్యింది. నాగార్జునసాగర్ లోని ఇండిపెండెంట్లకు ఈసారి కూడా రోడ్డు రోలర్, ట్రాక్టర్, చపాతీ మేకర్ సింబల్స్ ఈసీ కేటాయించింది. దీంతో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది.