Begin typing your search above and press return to search.

బీజేపీది దొడ్డిదారి అంటున్న సినీన‌టి

By:  Tupaki Desk   |   28 April 2017 6:40 AM GMT
బీజేపీది దొడ్డిదారి అంటున్న సినీన‌టి
X
త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో నెల‌కొంటున్న అనేక ట్విస్ట్‌ ల‌తో త‌మ‌కేమీ సంబంధం లేద‌ని చెప్తూ త‌ప్పించుకునేందుకు బీజేపీ చూస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌ధాన పార్టీల‌న్నీ క‌మ‌లం పార్టీపైనే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. తాజాగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ ఇదే రీతిలో బీజేపీపై ఆరోప‌ణ‌లు గుప్పించింది. మహిళా కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి నగ్మా మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై మండిప‌డ్డారు. త‌మిళనాడు ప్ర‌భుత్వం స‌హా కేంద్ర ప్ర‌భుత్వం రాజ‌కీయాల‌పై పెట్టిన శ్ర‌ద్ధ రైతుల‌పై పెట్ట‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

విప‌రీత‌మైన క‌రువు బారిన ప‌డిన త‌మిళనాడు రైతులు త‌మ స‌మ‌స్య‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోతే న్యాయమైన డిమాండ్ల కోసం ఢిల్లీలో పోరాడారని గుర్తుచేశారు. అయిన‌ప్ప‌టికీ వారి గోడు పట్టించుకోవడానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ముందుకు రాలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతుల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం నెట్టకూడదని, అదే సమయంలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతుల డిమాండ్లు నెరవేర్చడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని న‌గ్మా డిమాండ్ చేశారు. అడ్డదారిలో మద్యం దుకాణాలు తెరవడానికి ప్రయత్నించకూడదని - న్యాయస్థానం ఉత్తర్వులను రాష్ట్రప్రభుత్వం గౌరవించాలని ఆమె కోరారు. రాష్ట్రంలో నివాస ప్రాంతాల మధ్య మద్యం దుకాణాలు తెరుస్తున్నందుకు నిరసనగా మహిళలు పోరాడుతున్నారని తెలిపారు.

తమిళనాడు రాజ‌కీయాల‌పై బీజేపీకి ఎందుకు అంత ప్ర‌త్యేక ప్రేమ అని న‌గ్మా ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో బీజేపీ ఒక శాతం కూడా మద్దతు లేదని ఎద్దేవా చేసిన న‌గ్మా అయిన‌ప్ప‌టికీ ఎలాగైనా రాష్ట్రంలో కాలుమోపడానికి బీజేపీ చూస్తోందని మండిప‌డ్డారు. ఇందుకోసం అధికార‌ అన్నాడీఎంకేలో చీలిక తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. దొడ్డిదారిలో తమిళనాడులో ప్రవేశించేందుకు యత్నిస్తోందని, ఎట్టిపరిస్థితుల్లోనూ తమిళనాడులో బీజేపీ కాలు మోపలేదని ధీమా వ్య‌క్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/