Begin typing your search above and press return to search.

18 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా.. విసిగి వేసారిన నగ్మా సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   30 May 2022 11:19 AM GMT
18 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా.. విసిగి వేసారిన నగ్మా సంచలన నిర్ణయం
X
రాజ్యసభ సీట్ల కేటాయింపు కాంగ్రెస్ లో చిచ్చుపెట్టింది. ఆ పార్టీ అధిష్టానంపై కాంగ్రెస్ సీనియర్నేత, సినీ నటి నగ్మ ఫైర్ అయ్యారు. తనకు రాజ్యసభ సీటు విషయంలో అన్యాయం జరిగిందంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. నేనుపార్టీలో చేరినప్పుడు 18 ఏళ్ల క్రితం సోనియాగాంధీ రాజ్యసభ అవకాశం కల్పిస్తానని చెప్పారని.. ఇప్పటివరకూ ఆ అవకాశమే రాలేదా? అంటూ నగ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వచ్చే నెల 10న జరిగే రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఆదివారం 10 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. ఇక అసమ్మతి గళమెత్తిన గులాం నబీ ఆజాద్ లాంటి వారికి ఈసారి రాజ్యసభ ఇవ్వకుండా షాక్ ఇచ్చింది. ఇక సీటు దక్కని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభ సీటు ఆశించి భంగపడ్డ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ట్విట్టర్ వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.

ఇక తాజాగా కాంగ్రెస్ ముంబై యూనిట్ వైస్ ప్రెసిడెంట్, సినీ నటి నగ్మ సైతం తనకు రాజ్యసభకు అవకాశం కల్పించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ ఖేరా ట్వీట్ కు నగ్మ స్పందిస్తూ ‘నా 18 ఏళ్ల తపస్సు కూడా ఇమ్రాన్ భాయ్ ముందు తక్కువైంది’ అంటూ పార్టీ అధిష్టానంపై విమర్శలు గుప్పించింది. 2003-04లో నేను కాంగ్రెస్ లో చేరినప్పుడు స్వయంగా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీనే నన్ను రాజ్యసభకు పంపుతానని మాటిచ్చారు. అప్పటి నుంచి ఈ 18 ఏళ్లలో వారు నాకు ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేదు అని నగ్మా వాపోయారు.ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఇమ్రాన్ ను ఎంపిక చేయడంపై నగ్మా మండిపడ్డారు. ఆ పదవికి నేను తక్కువ అర్హురాలినా? అంటూ కాంగ్రెస్ ను నగ్మా ప్రశ్నించారు.

దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలతో రాజ్యసభలో కాంగ్రెస్ బలం కాస్త పెరుగనుంది. ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్ బలం 29గా ఉంది. కొత్తగా జరిగే ఎన్నికల్లో రాజస్థాన్ లో 3, చత్తీస్ ఘడ్ 2, తమిళనాడు, ఝార్ఖండ్, మహారాష్ట్రల్లో ఒక్కొక్కటి చొప్పున కాంగ్రెస్ గెలువనుంది. హర్యానా, మధ్యప్రదేశ్, కర్ణాటకలోనూ ఒక్కోస్థానాన్ని ఖాతాలో వేసుకోనుంది. దీంతో పెద్దల సభలో కాంగ్రెస్ 39కు పెరిగే అవకాశం ఉంది.

అయితే రాజ్యసభ సభ్యుల జాబితాను ఆదివారం కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేయడంతో టికెట్ దక్కని వారు ఇలా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పై మండిపడుతున్నారు. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నగ్మా కూడా తనకు జరిగిన మోసంపై వాపోయారు.