Begin typing your search above and press return to search.

అభినందన్ ఓటీపీ.. నాగపూర్ పోలీసుల స్కెచ్

By:  Tupaki Desk   |   4 March 2019 3:23 AM GMT
అభినందన్ ఓటీపీ.. నాగపూర్ పోలీసుల స్కెచ్
X
అభినందన్ వర్ధమాన్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేరు వైరల్. భారత వైమానిక దళ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ కు బందీగా మారినా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం, ధైర్యంతో దేశం కోసం పోరాడిన వైనం దేశవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. శత్రు చెరలో బందీగా ఉండి పాక్ ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఆయన భారత దేశ రహస్యాలను చెప్పకుండా ధైర్యసాహాసాలను ప్రదర్శించడంపై దేశం యావత్తు ప్రశంసలతో ముంచెత్తింది.

పాకిస్తాన్ ఆర్మీ అభినందన్ ను విచారిస్తున్న వీడియోలను రిలీజ్ చేసింది. అభినందన్ మిషన్ గురించి వివరాలు రాబట్టడానికి ఎంతగానో ప్రయత్నించింది. కానీ అభినందన్ మాత్రం ‘అవన్నీ నేను మీకు చెప్పకూడదు’ అంటూ సమాధానం దాటవేశారు. అలాగే తన వ్యక్తిగత వివరాలు కూడా పాకిస్తాన్ ఆర్మీకి చెప్పలేదు. పాకిస్తాన్ ఆర్మీ చేతిలో బంధీగా ఉన్నా భయపడకుండా.. ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా దేశభక్తిని చాటాడు. ఆ తర్వాత అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్.. అభినందన్ ను భారత్ కు అప్పగించింది.

అయితే ఇప్పుడు అభినందన్ సాహాసాలను స్ఫూర్తిగా తీసుకున్న నాగపూర్ పోలీసులు ‘ఓటీపీ’లతో జరిగే మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఆయన్నే అస్త్రంగా మలుచుకున్నారు. బ్యాంకుల పేరుతో నకిలీ ఫోన్ కాల్స్ చేసే దుండగులకు ఓటీపీ అడిగినప్పుడు అభినందన్ పేరు చెప్పాలని సూచిస్తున్నారు. ఓటీపీలను అడిగి డబ్బు మాయం చేసే వారికి అభినందన్ పేరు చెప్పి సమాధానం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు నాగపూర్ పోలీసులు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. పోలీసులు ‘అభినందన్’ పేరుతో మోసాలను అరికట్టడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.