Begin typing your search above and press return to search.

సంచలన విషయాల్ని బయటపెట్టిన నాగరాజు రిమాండ్ రిపోర్టు

By:  Tupaki Desk   |   9 May 2022 6:30 AM GMT
సంచలన విషయాల్ని బయటపెట్టిన నాగరాజు రిమాండ్ రిపోర్టు
X
తమ మతం కాని వ్యక్తిని తమ చెల్లెలు పెళ్లి చేసుకుందన్న కారణంతో నడిరోడ్డు మీద చెల్లెలు భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన వైనం పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సరూర్ నగర్ పరువు హత్య కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలు వెలుగు చూశాయి. తాము చెప్పిన వారిని కాకుండా.. తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవటాన్ని ఆశ్రిన్ సుల్తానా సోదరుడు రగిలిపోయినట్లుగా పేర్కొన్నారు.

నడిరోడ్డు మీద దారుణంగా హత్య చేసిన సయ్యద్ మోబిన్ అహ్మద్ పథకం ప్రకారమే నాగరాజును హత్య చేసినట్లుగా గుర్తించి.. అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అసలు హత్యకు కారణం ఏమిటి? నిందితుల పథకం ఏమై ఉంటుందన్న విషయం రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా వెల్లడైంది. వికారాబాద్ జిల్లా మర్పల్లికి చెందిన పాతికేళ్ల నాగరాజు.. అశ్రిన్ సుల్తానాలు ఇద్దరు స్కూల్ వయసు నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన పాతబస్తీలోని ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు.

హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆశ్రిన్ సుల్తానా సోదరుడు మోబిన్ అహ్మద్ ఇంటికి పెద్ద కొడుకు. తండ్రికి కిడ్నీ వ్యాధితో బాధ పడుతుండటం.. డయాలసిస్ చేయించేందుకు వీలుగా ఉంటుందని ఐడీపీఎల్ కాలనీకి చేరారు. రెండేళ్ల క్రితం తండ్రి మరణంతో కుటుంబ భారం మోబిన్ మీద పడింది. కుటుంబ పోషణలో భాగంగా పండ్లు అమ్మేవాడు.

రెండో చెల్లెల్ని లింగంపల్లికి చెందిన మసూద్ అహ్మద్ కు ఇచ్చి పెళ్లి చేశారు. మూడో చెల్లెలు ఆశ్రిన్ సుల్తానాకు పెళ్లి సంబంధాలు చూడసాగాడు. భార్య మరణించి ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తితో ఆమెకు పెళ్లి చేసేందుకు సిద్ధం కావటంతో ఆశ్రిన్ సుల్తానా ఎదురు తిరిగింది. అయితే.. ఆమెను కొట్టి దారికి తేవాలని ప్రయత్నించటంతో గొడవలు పెరిగాయి.

దీంతో.. సుల్తానా భయపడి.. తాను ఇంట్లో ఉండే తనకు పెళ్లి చేస్తారన్న భయంతో జనవరి 30న ఇల్లు వదిలి నాగరాజు వద్దకు వెళ్లింది. ఫిబ్రవరి ఒకటిన వారు పెళ్లి చేసుకున్నారు. అనంతరం వారు రహస్య జీవితాన్ని గడిపేవారు. బాలానగర్ పోలీస్ స్టేషన్ లో ఇరుకుటుంబాల వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.. అనంతరం నాగరాజు.. ఆశ్రిన్ లు వికారాబాద్ జిల్లా ఎస్పీని కలిసి రక్షణ కల్పించాలని కోరారు. నాగరాజు రెండు సార్లు మోబిన్ అహ్మద్ తో మాట్లాడి.. మతం మారేందుకు సైతం సిద్దమేనని చెప్పాడు.

పెళ్లి తర్వాత ఆశ్రిన్ తన సోదరి.. పిన్నితోనూ ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది. ఆశ్రిన్ అక్క భర్త ద్వారా మోబిన్ అహ్మద్ ఆచూకీని తెలుసుకున్నాడు. వారి ఫోన్ నెంబర్లు సేకరించి.. స్నేహితుల సహకారంతో నాగరాజు మొబైల్ లో మాల్ వేర్ ఇన్ స్టాల్ చేశాడు. ఆ తర్వాత నుంచి లొకేషన్ ఎక్కడ ఉన్నది తెలుసుకునేవాడు. రంజాన్ కారణంగా ఉపవాస దీక్షతో ఉండటంతో మర్డర్ ప్లాన్ వాయిదా వేశాడు. రంజాన్ మరుసటి రోజున తన దారుణ ప్లాన్ ను అమలు చేసి.. నడి రోడ్డు మీద చంపేసినట్లుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.