Begin typing your search above and press return to search.

వైసీపీ చేసిన పనితో కాపులకు హ్యాపీ... ?

By:  Tupaki Desk   |   3 Feb 2022 10:36 AM GMT
వైసీపీ చేసిన పనితో కాపులకు హ్యాపీ... ?
X
ఏపీలో కాపులు నిర్ణయాత్మకమైన శక్తిగా ఉన్నారు. వారు తలచుకుంటే ఏపీలో రాజకీయాలు తారుమారు అవుతాయి. మరో వైపు కాపులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తున్నారు. తమకు కూడా న్యాయమైన వాటా కావాలని వారు కోరుతున్నారు. దాని కోసం ఈసారి సీరియస్ గానే వారు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి అవసరమైన వేదికను నిర్మించే పనిలో కాపు నేతలు బిజీగా ఉన్నారు.

మరో వైపు కాపుల మద్దతు కోసం టీడీపీ కూడా గట్టిగానే ట్రై చేస్తోంది. కాపులను మచ్చిక చేసుకుంటే అధికారం తధ్యమన్నది ఆ పార్టీ భావనగా ఉంది. ఇదిలా ఉంటే కాపుల విషయంలో ఎంతో చేశామని, వారికి రాజకీయంగా అవకాశాలు పెంచామని వైసీపీ చెప్పుకుంటోంది. ఇపుడు మారిన రాజకీయ సామాజిక పరిస్థితుల్లో కాపులను ఇంకా దగ్గర తీయాలని చూస్తోంది.

ఈ నేపధ్యంలో కాపుల మీద గత టీడీపీ ప్రభుత్వం పెట్టిన కేసులను జగన్ సర్కార్ ఒక్క కలం పోటుతో రద్దు చేసింది. ఈ మేరకు జీవోను విడుదల చేసింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార బిశ్వజిత్ ఈ జీవోలను విడుదల చేశారు. ఒక విధంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న కాపు నేతలకు, కార్యకర్తలకు ఇది అతి పెద్ద ఊరటను ఇచ్చే పరిణామంగా చూడాలి. కాపుల విషయంలో ప్రభుత్వం తన అనుకూల ధోరణి ఇది అని చెప్పుకోవడానికే ఇలా చేసింది అని అంటున్నారు.

కాపుల మీద పెట్టిన కేసులలో కొన్నింటిని జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే 2020లోనే కొట్టేశారు. కాపులు తమ డిమాండ్ల సాధన కోసం తునిలో సభని నిర్వహించినపుడు రైలుని తగులబెట్టారు. ఆ సంఘటనకు సంబంధించి గత ప్రభుత్వం కేసులను ఐపీసీలోని 109, 143, 147, 148, 149, 353, 440, 427, 435 వంటి వాటి ద్వారా నమోదు చేసింది. వాటిని వైసీపీ నాడు రద్దు చేసింది. ఇక జగన్ పవర్ లోకి వచ్చాక వీటిని మెల్లగా రద్దు చేసుకుంటూ పోయారు.

ఇపుడు ఏకంగా మొత్తం కేసులను ఎత్తేయడానికి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇపుడు చూస్తే 2016 నుంచి 2019 మధ్య కాపులు చేసిన అనేక ఆందోళనలకు సంబంధించి గత సర్కార్ పెట్టిన కేసులను వైసీపీ సర్కార్ ఒక్క దెబ్బకు ఎత్తేసింది. ఈ విధంగా చూసుకుంటే 2019 మార్చి వరకు 161 కేసులు నమోదయినట్లుగా పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

ఈ కేసులు అన్నీ కూడా గోదావరి జిల్లాలలోని ఎల్ పోలవరం, కాట్రేనికోన, రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, పీ గన్నవరం, రాజోలు, నగరం, మలికిపురం, భిక్కవోలు, గుంటూరు జిల్లా లాలాపేట పోలీస్ స్టేషన్లల్లో ఆయా కేసులు నమోదయ్యాయని హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార బిశ్వజిత్ తెలిపారు. వాటిని ప్రభుత్వం ఉపసంహరించుకుంటోందని కూడా చెప్పారు.

మొత్తం మీద చూస్తే జగన్ ప్రభుత్వం తాము కాపులకు అనుకూలమన్న ధోరణిలో ఉన్నట్లు తెలియచేస్తోంది. ఈ కేసులను ఎత్తేయమని గతంలో కాపు నేతలు డిమాండ్ చేస్శారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం వీటిని పక్కన పెట్టింది. ఇక జగన్ సర్కార్ కేవలం తునిలో రైలు దహనం కేసుల మీద మాత్రమే రద్దు చేశారు, మిగిలినవి అలాగే ఉన్నాయి. ఈ అసంతృప్తి కాపులలో ఉంది. ఇపుడు సడెన్ గా ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకోవడం వెనక రాజకీయ సామాజిక అంశాలు ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి దీని మీద కాపు నేతలు ఎలా రియాక్ట్ అవుతారో.