Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడిపై ఆరేళ్ల బహిష్కరణ వేటు

By:  Tupaki Desk   |   19 Feb 2018 4:15 AM GMT
కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడిపై ఆరేళ్ల బహిష్కరణ వేటు
X
ఓ రెస్టారెంటులో వీరంగమాడి ఒక వ్యక్తిని దారుణంగా కొట్టిన ఎమ్మెల్యే కుమారుడిని కాంగ్రెస్ పార్టీ ఆరేళ్ల పాటు బహిష్కరించింది. పోలీసులు కూడా దీనిపై కేసు నమోదు చేసి వ్యవహారాన్ని సీరియస్‌ గా తీసుకోవడంతో ఆ ఎమ్మెల్యే కుమారుడు పరారీలో ఉన్నాడు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఎన్నికల వేళ ఆ పార్టీకి పెద్ద దెబ్బే అని చెప్పాలి.

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హ్యారిస్ కుమారుడు - బెంగళూరు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మహమ్మద్ నలపాడ్ ఓ రెస్టారెంట్‌ లో చెలరేగిపోయాడు. పదిమంది స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌ కు వెళ్లిన ఆయన నానా హంగామా చేశాడు. విద్వత్ అనే వ్యక్తిని చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన విద్వత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నలపాడ్ - అతడి స్నేహితులపై కేసు నమోదు చేశారు. దీంతో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ.. నలపాడ్‌ ను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించింది.

తన కుమారుడిని పార్టీ నుంచి బహిష్కరించడంపై ఎమ్మెల్యే హ్యారిస్ మాట్లాడుతూ ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. విషయం తెలిసి బాధిత కుటుంబాన్ని తాను పరామర్శించినట్టు చెప్పారు. తన కుమారుడు ఎక్కడ ఉన్నాడో తెలియదని - అతడి ఫోన్ స్విచ్చాఫ్‌ లో ఉందని పేర్కొన్నారు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఎమ్మెల్యే కుమారుడి వీరంగంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఈ కేసులో నిందితులు ఎవరైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.