Begin typing your search above and press return to search.

న‌ల్ల‌గొండ బ‌రిలో వార‌సులు..!

By:  Tupaki Desk   |   7 Jan 2022 5:06 AM GMT
న‌ల్ల‌గొండ బ‌రిలో వార‌సులు..!
X
వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఉమ్మడి న‌ల్ల‌గొండ జిల్లా రాజ‌కీయ రూపురేఖ‌లు మార‌నున్నాయా? పాత త‌రం ప‌క్క‌కు పోయి యువ ర‌క్తానికి చోటు ద‌క్క‌నుందా? అన్ని పార్టీల నుంచి యువ వార‌స‌త్వానికే టికెట్లు ద‌క్క‌నున్నాయా? అనే ప్ర‌శ్న‌లకు రాజ‌కీయ విశ్లేష‌కులు అవున‌నే స‌మాధానం వినిపిస్తున్నారు. క్షేత్ర స్థాయి ప‌రిస్థితులు కూడా ఈ అనుమానాల‌కే బ‌లం చేకూరుస్తున్నాయి.

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాలు ప్ర‌ముఖుల‌కు కంచుకోట ఒక‌ప్పుడు. ఒక్కో ముఖ్య నేత ఐదారు సార్లు వారి నియోజ‌క‌వ‌ర్గాల‌ను గెలుపు గుర్రాలుగా మార్చుకున్నారు. కొన్ని సార్లు ఓడినా నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలి కార్య‌క‌ర్త‌ల‌కు దూర‌మ‌వ‌లేదు. గెలుపోట‌ముల‌తో సంబంధం లేకుండా పార్టీ శ్రేణుల‌ను అంటిపెట్టుకునే ఉన్నారు. కానీ ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో త‌మ వార‌సత్వానికి బాధ్య‌త‌లు అప్ప‌గించి తాము విశ్రాంతి తీసుకోవాల‌ని ప‌లువురు సీనియ‌ర్లు భావిస్తున్నారు.

జానారెడ్డి, గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, మోత్కుప‌ల్లి న‌ర్సింలు, రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి, ఉమా మాధ‌వ‌రెడ్డి త‌దిత‌ర నేత‌లు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని భావిస్తున్నారు. వ‌య‌సు రీత్యా కూడా విశ్రాంతి తీసుకోవాల‌ని భావిస్తున్నారు. త‌మ వార‌స‌త్వాన్ని ప్రోత్స‌హించాల‌ని యోచిస్తున్నారు. దానికి ఇప్ప‌టి నుంచే కార్యాచ‌ర‌ణ సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ అధిష్ఠానాల నుంచి టికెట్ల హామీ పొందేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇందులో ముఖ్యంగా.. ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి త‌న‌యుడు అమిత్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ త‌ర‌పున న‌ల్ల‌గొండ పార్ల‌మెంటు స్థానం నుంచి బ‌రిలో దిగాల‌ని భావిస్తున్నారు. అందులో భాగంగా ఇప్ప‌టి నుంచే నియోజ‌క‌వ‌ర్గంలో సేవా కార్య‌క్ర‌మాల్లో మునిగిపోయారు. జానారెడ్డి కుమారుడు ర‌ఘువీర్ రెడ్డి మిర్యాల‌గూడ అసెంబ్లీ స్థానంపై క‌న్నేశారు. ఇప్ప‌టి రేవంత్ రెడ్డితో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలిసింది. జానారెడ్డి మ‌రో కుమారుడు కూడా సాగ‌ర్ నుంచి పోటీకి ఆస‌క్తి చూపుతున్నార‌ట‌.

మిర్యాల‌గూడ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే భాస్క‌ర రావు త‌న‌యుడు సిద్దార్థ్ కూడా పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ట‌. సూర్యాపేట నుంచి కాంగ్రెస్ త‌ర‌పున ప‌టేల్ ర‌మేష్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి త‌న‌యుడు స‌ర్వోత్తం రెడ్డి తీవ్రంగా పోటీప‌డుతున్నారు. దామోద‌ర్ రెడ్డి త‌న రాజ‌కీయ చాతుర్యంతో త‌న కుమారుడికే టికెట్ ద‌క్కేలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇక భువ‌న‌గిరి నుంచి టీఆర్ఎస్ త‌ర‌పున ఉమా మాధ‌వ‌రెడ్డి త‌న‌యుడు సందీప్ రెడ్డి పోటీకి ఆస‌క్తి చూపుతున్నారు. ఇప్ప‌టికే జ‌డ్పీ చైర్మ‌న్‌గా ఉన్న సందీప్ ఈసారి పైళ్ల శేఖ‌ర్ రెడ్డికి కాకుండా త‌న‌కు టికెట్ వ‌చ్చేలా కేటీఆర్‌తో మంత‌నాలు జ‌రుపుతున్నారట‌. ఈ వార‌సుల గొడ‌వ‌లో ఎవ‌రి పుట్టి మునుగుతుందో.. ఎవ‌రిని అదృష్ట దేవ‌త ప‌ల‌క‌రిస్తుందో వేచి చూడాలి.