Begin typing your search above and press return to search.

ఓదేలు అనుచరుల సూసైడ్ అటెంప్ట్‌..

By:  Tupaki Desk   |   12 Sep 2018 10:34 AM GMT
ఓదేలు అనుచరుల సూసైడ్ అటెంప్ట్‌..
X
తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల హ‌డావుడి తారాస్థాయికి చేరిన సంగ‌తి తెలిసిందే. ఓ వైపు గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ సొంతంగా బ‌రిలో దిగుతుండ‌గా...మ‌రోవైపు విప‌క్షాల‌న్నీ కూట‌మి క‌డుతున్నాయి. ఇక అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన కేసీఆర్ దూకుడు పెంచిన సంగ‌తి తెలిసిందే. అయితే, టీఆర్ ఎస్‌ లో నివురుగ‌ప్పిన నిప్పులాగా ఉన్న అసంతృప్తి తారాస్థాయికి చేరింది. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి స‌న్నిహితుడుగా పేరొందిన పెద్ద‌ప‌ల్లి ఎంపీ బాల్క సుమ‌న్‌ కు వ్య‌తిరేకంగా పార్టీ నేత‌లు ఆందోళ‌న చేశారు ఏకంగా ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది.

టీఆర్ ఎస్ పార్టీ అభ్య‌ర్థిగా చెన్నూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలును కాద‌ని ఎంపీ బాల్క సుమ‌న్‌ కు టికెట్ కేటాయించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో సుమ‌న్ ప్ర‌చారానికి సిద్ధ‌మ‌య్యారు. మంచిర్యాల జిల్లా ఇందారం దగ్గర ఎంపీ బాల్క సుమన్ ను అడ్డుకునేందుకు గ్రామస్తులు యత్నించారు. సుమన్ ప్రచారాన్ని అడ్డుకున్న ఓదెలు వర్గానికి చెందిన వారు... ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రావొద్దంటూ నిరసనకు దిగారు. ఈ యువకులను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆందోళనలో ఓ యువకుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పక్కనే ఉన్న మరో ఇద్దరికి మంటలు అంటుకుని గాయాలపాలయ్యారు. గాయాలైన వారిలో సీఐ - ఓ ఎంపీటీసీ ఉన్నారు. వెంటనే వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దీంతో ఇందారంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

2010 నుంచి కేసీఆర్‌ వెంట ఉంటున్న ఓదేలు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన 105 మంది అభ్యర్థుల్లో చెన్నూరు నియోజకవర్గాన్ని ఎంపీ బాల్కసుమన్‌ కు కేటాయించారు. దీంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన నల్లాల ఓదేలు అసమ్మతి జెండా ఎగురవేశారు. సుమన్‌ కు టికెట్‌ కేటాయించడాన్ని ఆయన వర్గం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తీవ్ర మనస్థాపానికి గురైన ఓదేలు తనకేమైన జరిగితే కేసీఆర్‌దే బాధ్యత అని స్వీయ నిర్భందానికి పాల్పడ్డారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వ‌ర్గీయులు ఆత్మ‌హ‌త్య‌య‌త్నం చేశారు. సాక్షాత్తు కేసీఆర్ కుటుంబ సన్నిహితుడనే పేరున్న వ్య‌క్తికి వ్య‌తిరేకంగా ఏకంగా ఆత్మ‌హ‌త్య‌య‌త్నం జ‌రుగుతుండ‌టం సంచ‌ల‌నంగా మారింది.