Begin typing your search above and press return to search.

నల్లమలలో యురేనియం తవ్వకాలతో..హైదరాబాదీయులకు ముప్పు?

By:  Tupaki Desk   |   3 Sept 2019 12:41 PM IST
నల్లమలలో యురేనియం తవ్వకాలతో..హైదరాబాదీయులకు ముప్పు?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో యురేనియం తవ్వకాల మీద వార్తలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఎక్కడో మారుమూల అడవుల్లో జరిగే ఈ తవ్వకాలతో జరిగే నష్టం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. యురేనియం కోసం నల్లమల అడవుల్లో తవ్వకాలు జరిపితే.. కోట్లాదిమంది ఉన్న హైదరాబాదీయులకు ముప్పు తప్పదని చెబుతున్నారు. నల్లమల అడవులకు.. హైదరాబాద్ కు లింకేమిటన్నది చూస్తే.. పెద్ద లింకే ఉందని చెబుతున్నారు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో పని చేసిన రిటైర్డ్ సీనియర్ సైంటిస్ట్ కె. బాబురావు.

నల్లమలలో జరిపే యురేనియం తవ్వకాలతో కృష్ణా జలాలు విషతుల్యమవుతాయని.. ఆ నీటిని తాగితే మూత్ర పిండాలకు ముప్పేనని.. దీని కారణంగా ఊపిరితిత్తుల కేన్సర్ లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తటం ఖాయమంటున్నారు. ప్రకృతి ఉండాల్సిన రీతిలో ఉంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్న ఆయన.. నల్లమలలో యురేనియం కోసం తవ్వకాలు షురూ చేస్తే.. ప్రజలకు ప్రాణవాయువును అందించే అడవులు నాశనం కావటం ఖాయమంటున్నారు.

నల్లమలలో అడవులు నాశనమైతే.. వాతావరణంలో అసమతుల్యత ఏర్పడతుందని.. అదే జరిగితే వర్షాలు సకాలంలో పడవని.. ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెబుతుననారు. భూమిలోని యురేనియంను వెలికి తీసి.. దాన్ని శుద్ది చేసే క్రమంలో రసాయన వ్యర్థాలన్నీ కృష్ణానదిలో కలుస్తాయని.. అదే జరిగితే నదీ జలాలు కలుషితమవుతాయని చెబుతున్నారు. అదే జరిగితే.. హైదరాబాద్ లో నివసించే ప్రజలు నిత్యం తాగే కృష్ణానది నీరులో యురేనియం కలిసి ఉంటుందని.. అది వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే డేంజర్ ఉంటుందంటున్నారు. అందుకే.. నల్లమలలో యురేనియం తవ్వకాలు సదూరాన ఉన్న హైదరాబాదీయులు వ్యతిరేకించాలంటున్నారు. హైదరాబాదీయులు.. వింటున్నారా?