Begin typing your search above and press return to search.

పీలేరులో టీడీపీ పాగా ఖాయం.. మాజీ సీఎం త‌మ్ముడికి అనుకూల ప‌వ‌నాలు

By:  Tupaki Desk   |   26 Jun 2022 2:30 AM GMT
పీలేరులో టీడీపీ పాగా ఖాయం.. మాజీ సీఎం త‌మ్ముడికి అనుకూల ప‌వ‌నాలు
X
ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ వ్యూహాలు.. ఎలా ఉన్నా.. ప్ర‌జా నాడి మాత్రం మారుతోంద‌నే టాక్ వినిపిస్తోంది. ఇక్క‌డ నుంచి వైసీపీ వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుంది. 2014, 2019 ఎన్నిక‌ల్లో చింత‌ల రామ‌చంద్రారెడ్డి వైసీపీ త‌ర‌ఫున ఇక్క‌డ నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు.

అయితే.. 2014లో చంద్ర‌బాబు అధికారంలో ఉన్నార‌నే కార‌ణంగా నిధులు ఇవ్వ‌లేద‌ని.. అభివృద్ధిపై చెప్పుకొచ్చారు. అయితే.. గ‌డ‌చిన మూడేళ్లుగా వైసీపీ స‌ర్కారే ఉంది. అయిన‌ప్ప‌టికీ.. ఇక్క‌డ ఎలాంటి రాయి పేర్చ‌లేదు.. ఎలాంటి అభివృద్ధి లేదు. దీంతో ప్ర‌జ‌లు ఆయ‌న‌ను నిల‌దీస్తున్నారు.

తాజాగా జ‌రుగుతున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వంలో చింత‌ల‌కు ప్ర‌జ‌ల నుంచి చింత‌లే ఎదుర‌వుతున్నాయి. ఎక్క‌డా ప‌నులు కావ‌డం లేదని.. నిజ‌మైన ల‌బ్ధిదారుల‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని.. చెప్పుకొస్తున్నారు. దీనిని బ‌ట్టి.. ఆయ‌న విష‌యం వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నాయ‌కులు అంటున్నారు. 2014లో 15 వేల‌కు పైగా ఓట్ల‌మెజారిటీ సాధించిన చింత‌ల‌.. 2019 ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. కేవ‌లం 7 వేల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ రెండు ఎన్నిక‌ల్లోనూ.. చింత‌ల‌పై.. మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్‌రెడ్డి సోద‌రుడు.. న‌ల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పోటీ చేశారు.

రెండు ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయినా.. మెజారిటీ ప‌రంగా చూసుకుంటే.. పెరిగింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టిప‌రిస్థితిలో విజ‌యం ద‌క్కించుకోవాల‌ని భావిస్తున్న కిశోర్ .. ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటున్నారు. పార్టీలోనూ.. ప్ర‌జ‌ల్లోనూ ఆయ‌న యాక్టివ్‌గానే ఉంటున్నారు. జిల్లాలో వైసీపీ మంత్రుల దూకుడును ఆయ‌న అడుగ‌డుగునా అడ్డుకుంటున్నారు. పార్టీలో నేత‌ల‌కు కూడా ఆయ‌న అండ‌గా ఉంటున్నారు. 2019లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయినా.. పార్టీని బ‌లోపేతం చేసేందుకు నిత్యం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇటీవ‌ల చంద్ర‌బాబు పిలుపు మేర‌కు ధ‌ర‌ల‌పై ఉద్య‌మించారు.

అదేవిధంగా పార్టీ కార్య‌ల‌యంపై దాడి జ‌రిగిన‌ప్పుడు.. చంద్ర‌బాబు ఇంటిపై దాడి జ‌రిగిన‌ప్పుడు కూడా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉద్య‌మించారు. స‌మ‌స్య‌లు ఎక్క‌డ ఉంటే.. అక్క‌డ ప్ర‌త్య‌క్ష మ‌వుతున్నారు. నేనున్నానంటూ.. పార్టీ నేత‌ల‌కు భ‌రోసా నింపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీంతో కిశోర్ కుమార్ గ్రాఫ్ పెరుగుతోంద‌ని.. టీడీపీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ న‌డుస్తోంది. ఇక‌, ఇప్పుడు.. మాజీ సీఎం కిర‌ణ్ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ్ముడికి అండ‌గా ఉండేలా.. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇటీవ‌ల ఆయ‌న సొంత ప‌నిపై ఇక్క‌డ‌కు వ‌చ్చిన కిర‌ణ్‌కుమార్‌.. రాజ‌కీయంగా ఇక్క‌డ ఉన్న ప‌రిస్థితి తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలో సోద‌రుడి రాజ‌కీయాల‌ను కూడా ఆయ‌న ఆరా తీసిన‌ట్టు తెలిసింది. ఎట్టి ప‌రిస్థితిలోనూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కిశోర్ గెలుపు ఖాయ‌మ‌ని.. రాసిపెట్టుకోవ‌చ్చ‌ని.. టీడీపీ నాయ‌కులు చెబుతున్న విష‌యాల‌ను కిర‌ణ్‌కు ఆయ‌న స‌న్నిహితులు చెప్పిన‌ట్టు స‌మాచారం. మ‌రి ఏం జ‌ర‌గుతుందో చూడాలి.