Begin typing your search above and press return to search.

న‌ల్లారికి సొంత త‌మ్ముడి నుంచే షాక్ త‌ప్ప‌దా?

By:  Tupaki Desk   |   10 April 2017 12:14 PM GMT
న‌ల్లారికి సొంత త‌మ్ముడి నుంచే షాక్ త‌ప్ప‌దా?
X
ఉమ్మ‌డి రాష్ట్రానికి చివ‌రి సీఎంగా రికార్డుల‌కెక్కిన న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి... యాక్టివ్ పాలిటిక్స్ నుంచి త‌ప్పుకుని చాలా కాల‌మే అవుతోంది. ఇంకా మంచి వ‌య‌సులోనే ఉన్న న‌ల్లారి మ‌రోమారు రాజ‌కీయ తెరంగేట్రం చేస్తార‌ని, త్వ‌ర‌లోనే ఆయ‌న ఏదో ఒక పార్టీలో చేరి కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని కొన్నాళ్లుగా రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. న‌ల్లారి కూడా ఈ విష‌యంపై స్వ‌యంగా మాట్లాడారు. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ క్రియాశీల రాజ‌కీయాల్లోకి వస్తాన‌ని త‌న అనుచ‌రుల‌కు చెప్పారు. ఈ క్ర‌మంలో వైసీపీలోకి గానీ లేదంటే కాంగ్రెస్ పార్టీలోకి గాని ఆయ‌న ఎంట్రీ ఇస్తార‌ని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా... న‌ల్లారి నుంచి ఆ కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌క ముందే న‌ల్లారి ఫ్యామిలీకి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన న‌ల్లారి సొంతంగా జై స‌మైక్యాంధ్ర పేరిట సొంత కుంప‌టి పెట్టుకున్నారు. అప్ప‌టిదాకా అన్న‌తో పాటు ప‌య‌నం సాగించిన న‌ల్లాకి కిశోర్ కుమార్ రెడ్డి కూడా... ఆ పార్టీలోకి చేరిపోయారు. త‌న అన్న ప్రాతినిధ్యం వ‌హించిన త‌మ సొంత నియోజ‌క‌వ‌ర్గం పీలేరు నుంచి 2014 ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. అయితే ఊహించ‌ని ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ అభ్య‌ర్థి చేతిలో ఓట‌మి పాల‌య్యారు. నాటి నుంచి త‌న అన్న కిర‌ణ్ లాగే కిశోర్ కూడా క్రియాశీల రాజ‌కీయాల‌కు దూరంగా జ‌రిగారు. అప్పుడ‌ప్పుడు కిర‌ణ్ పేరు వినిపిస్తున్నా... కిశోర్ పేరు మాత్రం ఎక్క‌డ కూడా విన‌ప‌డటం లేదు.

ఈ క్ర‌మంలో కిశోర్‌కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర వార్త ప్ర‌చారంలోకి వ‌చ్చేసింది. త్వ‌ర‌లోనే ఆయ‌న టీడీపీలో చేర‌బోతున్నార‌ని, ఈ మేర‌కు ఇప్ప‌టికే కార్య‌రంగం మొత్తం సిద్ధ‌మైపోయింద‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజంపేట టికెట్‌తో పాటు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌విని కిశోర్ కోర‌గా... టీడీపీ అధిష్ఠానం నుంచి కూడా సానుకూల సంకేతాలు వ‌చ్చాయ‌ట‌. ఇటీవ‌లే కిర‌ణ్ త‌ల్లి చ‌నిపోయారు. ఈ క్ర‌మంలో న‌ల్లారి కుటుంబాన్ని ప‌రామర్శించేందుకు చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత‌లు అమ‌ర్‌నాథ్ రెడ్డి, గ‌ల్లా అరుణ‌లు వారి ఇంటికి వెళ్లిన సంద‌ర్భంగా ఈ అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

అన్న‌కు తెలియ‌కుండానే కిశోర్ ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని చ‌క్క‌బెట్టుకున్నార‌ని వినికిడి. త‌న సోద‌రుడు టీడీపీలోకి వెళ్లడం కిర‌ణ్‌కు ఏ కోశానా ఇష్టం లేదట‌. అయితే ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల్లో త‌మ్ముడిని నిలువ‌రించే శ‌క్తి త‌న‌కు లేద‌ని గ్ర‌హించిన కిర‌ణ్‌... ఈ వ్య‌వ‌హారాన్ని సైలెంట్ గా చూస్తూ ఉండ‌టం మిన‌హా ఏమీ చేయ‌లేక‌పోయార‌ట‌. అన్నీ సిద్ధ‌మైన నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే కిశోర్ టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/