Begin typing your search above and press return to search.

న‌ల్లారి కిశోర్‌......వాటే లాజిక్‌!!

By:  Tupaki Desk   |   2 March 2021 8:30 AM GMT
న‌ల్లారి కిశోర్‌......వాటే లాజిక్‌!!
X
తిరుప‌తిలోని రేణిగుంట విమానాశ్ర‌యంలో నిన్న జ‌రిగిన చంద్ర‌బాబు నిర్బంధ ఘ‌ట‌న అంద‌రికీ తెలిసిం దే. చిత్తూరు , తిరుప‌తి నేత‌ల‌తో భేటీ అయి.. మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌కు సంబంధించి దిశానిర్దేశం చేయాల‌ని భావించిన చంద్ర‌బాబు.. తిరుప‌తి ప‌ర్య‌ట‌న పెట్టుకున్నారు. అయితే.. లేనిపోని సాకుల‌తో ఆయ‌న ప‌ర్య‌ట‌న ను పోలీసులు అడ్డుకున్నారు. ఏకంగా విమానాశ్ర‌యంలోనే చంద్ర‌బాబును దాదాపు 9 గంట‌ల పాటు నిర్బంధించారు. క‌నీసం క‌లెక్ట‌ర్‌, ఎస్పీల‌తో మాట్లాడేందుకు కూడా ఆయ‌న‌ను అనుమ‌తించ‌లేదు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న‌తో క‌లిసి మాట్లాడేందుకు.. చంద్ర‌బాబు నిర్బంధాన్ని అడ్డుకునేందుకు వ‌చ్చిన టీడీపీ శ్రేణుల‌ను కూడా పోలీసులు అడ్డుకున్నారు.

ఎక్క‌డిక‌క్క‌డ టీడీపీ శ్రేణుల‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో క‌నీసం.. చిన్న చీమ కూడా ఎయిర్ పోర్టులోకి వెళ్ల‌లేక పోయింది. మ‌రీ ముఖ్యంగా తిరుప‌తి నుంచి హైద‌రాబాద్‌కు వెళ్లేందుకు వ‌చ్చిన సాధార‌ణ ప్ర‌యాణికుల‌ను కూడా పోలీసులు భూత‌ద్దం పెట్టి మ‌రీ సెర్చ్ చేశారు. ఒక‌టికి వంద సార్లు ప‌రిశీలించి.. టీడీపీ నేత‌లు కాద‌ని నిర్ధారించుకున్నాకే వారిని లోప‌లికి అనుమ‌తించారు. మ‌రి పోలీసులు ఇంత‌గా నిఘా పెట్టినా.. ఒకే ఒక్క నాయ‌కుడు మాత్రం చంద్ర‌బాబును విమానాశ్ర‌యంలో ఆసాంతం ప‌రిశీలించారు. బాబు ప‌ట్ల పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరును ఆయ‌న ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించారు. అంతేకాదు.. చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి.. ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు జ‌రిగిన ఎడిసోడ్‌ను ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించి.. లోప‌ల జ‌రుగుతున్న ఘ‌ట‌న‌ల‌ను ఇటు మీడియాకు, అటు టీడీపీ నేత‌ల‌కు చేర‌వేశారు.

ఆయ‌నే మాజీ ముఖ్యమంత్రి న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి సోద‌రుడు, న‌ల్లారి కిశోర్ కుమార్‌రెడ్డి. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పీలేరు అభ్య‌ర్థిగా పోటీ చేశారు. తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న‌లో ఆయ‌న ఆసాంతం చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ వెళ్లే విమానానికి టికెట్‌ తీసుకుని... 8 గంటలకే విమానాశ్రయానికి చేరుకున్నారు. దీంతో ఆయన్ను పోలీసులు అడ్డుకోలేదు. 9.30కు చంద్రబాబు విమానంలో తిరుపతి వచ్చారు. ఆయనను కలుసుకోవడానికి కిశోర్‌ను పోలీసులు అనుమతించలేదు.

ఈలోగా 11 గంటలకు న‌ల్లారి కిశోర్‌ ఎక్కవలసిన విమానం వెళ్లిపోయింది. అయితే, ఆయన అప్పటికే సాయంత్రం 3 గంటల విమానానికి మరో టికెట్‌ కొన్నారు. చంద్రబాబు దిగ్బంధం కొనసాగుతుండగానే ఆ విమానం కూడా వెళ్లిపోయింది. దీంతో కిశోర్‌ రాత్రి 7 గంటల విమానానికి మరో టికెట్టు సిద్ధం చేసుకోవడంతో పోలీసులు కిశోర్‌ను ఎయిర్‌పోర్టు నుంచి బయటకు తీసుకురాలేకపోయారు. చంద్రబాబును నేరుగా కలవనివ్వకపోయినా... ఎప్పటి కప్పుడు ఫోన్‌లో సంభాషిస్తూ ఉన్నారు. తర్వాత 7.15కు చంద్రబాబు వెళ్లిన విమానంలోనే కిశోర్‌ కూడా హైదరాబాద్‌కు వెళ్లారు. మొత్తంగా చూస్తే.. చంద్ర‌బాబును అత్యంత స‌మీపంలో ప‌రిశీలిస్తూ.. లోప‌ల ఏం జ‌రుగుతోందో తెలుసుకుని.. టీడీపీని స‌మాయ‌త్తం చేయ‌డం గ‌మ‌నార్హం.