Begin typing your search above and press return to search.

నల్గొండ బైపోల్ పుకార్లకిక చెక్!

By:  Tupaki Desk   |   30 Oct 2017 3:30 PM GMT
నల్గొండ బైపోల్ పుకార్లకిక చెక్!
X
ఆలూ లేదు.. చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ఈ నడుమ తెలంగాణ రాజకీయాలకు సంబంధించి.. ఓ కేటగారీ పుకార్లు చాలా చురుగ్గా షికారు చేశాయి. నంద్యాల ఉప ఎన్నిక పూర్తయిన దగ్గరినుంచి.. ఇవి మొదలయ్యాయి. అదే నంద్యాల మాదిరిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక విజయాన్ని చూడాలని అనుకుంటున్నారని, ఆ కిక్ ను ఆస్వాదించాలని అనుకుంటున్నారని, అందువల్లన కాంగ్రెస్ తరఫున గెలిచి తమ పార్టీలోకి వచ్చిన నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్తారని.. మళ్లీ గెలిచి తమ సత్తా నిరూపించుకుంటారని అనేక పుకార్లు వచ్చాయి. గుత్తాతో ఇంటర్వ్యూలు, ఆయనతో తలపడాలని అనుకుంటున్న కాంగ్రెస్ వారితో ఇంటర్వ్యూలు కూడా అనేకం వచ్చాయి.

అలాంటి పసలేని ఆమాంబాపతు పుకార్లన్నిటికీ ఇక ఫుల్ స్టాప్ పెట్టేయొచ్చు. ఎందుకంటే.. కేసీఆర్ ఎవరినో రాజీనామా చేయించక్కర్లేదు. తనకు నిజంగా ప్రజాదరణే గనుక ఉంటే దానిని నిరూపించుకోవడానికి కొడంగల్ ఎన్నికలోనే గెలవడానికి ఫోకస్ పెట్టొచ్చు.

రేవంత్ రాజీనామాతో కొడంగల్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కాబోతున్నది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర వ్యవధి ఉన్న నేపథ్యంలో ఇప్పుడే ఆయన సమర్పించిన రాజీనామా స్పీకర్ ఆమోదం పొందితే గనుక.. ప్రభుత్వం నుంచి లేఖ రాగానే.. కొడంగల్ స్థానం ఖాళీ అయినట్లు ఎన్నికల కమిషన్ నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత ఆరునెలల లోగా ఎన్నికలు జరగాలి. అంటే కొడంగల్ లో ఖచ్చితంగా ఉప ఎన్నిక వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ కు -తన ప్రజాదరణ గతంలో కంటె పెరిగిందని నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశం అని పలువురు భావిస్తున్నారు.

కేసీఆర్ ముచ్చట తీర్చడం కోసం గుత్తా రాజీనామా అగ్ర దినపత్రికల్లో కూడా కథనాలు రావడంతో అంతా నిజమే కాబోలు అనుకున్నారు. పైగా గుత్తాతో ఇంటర్వ్యూలు - అధిష్టానం నిర్ణయించినట్లు చేస్తా.. వంటి.. నర్మగర్భపు ప్రకటనలు ఇవన్నీ.. రకరకాలుగా సాగాయి. రాజీనామా మాత్రం జరగలేదు. అనుకోకుండా రేవంత్ రెడ్డి రూపంలో అలాంటి అవకాశం కలిసి వచ్చింది. నిజానికి రేవంత్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోయినా పెద్దగా ఆయనకు ఇబ్బంది ఉండేది కాదు. ఇతరుల మీద ఇప్పటిదాకా చర్య తీసుకోని నేపథ్యంలో.. ఆయన గురించి కూడా ఎవరూ పట్టించుకునే వారు కాదు. కానీ.. ఉప ఎన్నికలో గెలిచి.. కేసీఆర్ హవా రాష్ట్రంలో ఏమాత్రం లేదని, ప్రజలు కేసీఆర్ వ్యతిరేకతతో వేగిపోతున్నారని, సరైన అభ్యర్థులు బరిలోకి దిగినట్లయితే.. కేసీఆర్ పప్పులు ఉడకవని చెప్పడమే.. లక్ష్యంగా రేవంత్ ఉప ఎన్నికలు అనివార్యంగా వచ్చేలా.. రాజీనామా చేసినట్లుగా తెలుస్తున్నది.