Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో టీడీపీకి మ‌రో బిగ్ షాక్ తప్ప‌దా?

By:  Tupaki Desk   |   23 Jan 2018 7:57 AM GMT
తెలంగాణ‌లో టీడీపీకి మ‌రో బిగ్ షాక్ తప్ప‌దా?
X
తెలంగాణ‌లో తెలుగు దేశం పార్టీ ప్రాభవం నానాటికీ త‌గ్గిపోతోంది. మొన్న‌టికి మొన్న పార్టీలో తొలి త‌రం నేత‌గా ఉన్న ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌ - మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌న‌మన్న విశ్లేష‌ణ‌లు ఉన్న మాట తెలిసిందే. అయితే మోత్కుప‌ల్లి మాట‌ల‌ను నిజం చేస్తూ ఆ పార్టీకి చెందిన ఓ సీనియ‌ర్ నేత ఇప్పుడు పార్టీని వీడి బ‌య‌ట‌కు వెళ్లేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నార‌ట‌. అంతేకాదండోయ్‌... పార్టీ అధినేత‌గా ఉన్న ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న ఈ నేత సైకిల్ దిగేసి... ఇత‌ర పార్టీలోకి వెళ్లేందుకు చంద్ర‌బాబే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌న్న వార్త‌లు కూడా ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నంగా మారిపోయాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇదే జ‌రిగితే... ఇక తెలంగాణ‌లో టీడీపీ దుకాణం బంద్ అయిన‌ట్టేన‌న్న వాద‌న‌కు మ‌రింత బ‌లం వ‌చ్చేసిన‌ట్లేన‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక అస‌లు విష‌యంలోకి వెళితే... ఖ‌మ్మం లోక్ స‌భ స్థానం నుంచి గ‌తంలో టీడీపీ ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హించిన సీనియ‌ర్ నేత‌ - ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త నామా నాగేశ్వ‌ర‌రావు... ఇప్పుడు టీడీపీకి హ్యాండిచ్చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నార‌ట‌. ఈ మేర‌కు మొన్న‌ - నిన్న కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతో నామా చర్చ‌లు జ‌రిపార‌ట‌. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే... నేడో - రేపో ఆయ‌న కాంగ్రెస్ గూటికి చేర‌డం ఖాయ‌మేన‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

టీడీపీతో నామాకు ఉన్న అనుబంధాన్ని ఓ సారి ప‌రిశీలిస్తే.... ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగానే కాకుండా కేంద్రంలో న‌రేంద్ర మోదీ కేబినెట్‌ లో మంత్రిగా ఉన్న వైఎస్ చౌద‌రి - మ‌రో రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేశ్‌ ల‌తో పాటుగా నామా నాగేశ్వ‌ర‌రావు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు అత్యంత సన్నిహితుడిగానే లెక్క‌. పార్టీలో ఎవ‌రెన్ని చెప్పినా... ఈ ముగ్గురి మాట‌ను చంద్ర‌బాబు ప‌క్క‌న‌పెట్టే స‌మ‌స్యే లేద‌న్న వాద‌న కూడా ఉన్న విష‌యం తెలిసిందే. మొన్న‌టిదాకా పార్టీలోనే ఉండి ఖ‌మ్మంలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా క‌మ్మ సామాజిక‌వ‌ర్గంలో మంచి పేరు ఉన్న నేత‌గా కొన‌సాగి ఇటీవ‌లే పార్టీని వీడి టీఆర్ ఎస్‌ లో చేరిన తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుతో నామాకు ఆది నుంచి విభేదాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు నేత‌లు ఖమ్మం జిల్లాకే చెందినా... వీరిద్ద‌రి మ‌ధ్య ఎడ‌తెగ‌ని వివాదాలే న‌డిచాయి. ఒకరి గెలుపును అడ్డుకునేందుకు మ‌రొకరు కృషి చేశార‌న్న ఆరోప‌ణ‌లు కూడా లేక‌పోలేదు. ఈ క్ర‌మంలో గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన తుమ్మ‌ల ఓట‌మికి నామానే కార‌ణ‌మ‌న్న వాద‌న కూడా వినిపించింది. ఈ క్ర‌మంలో నామాను చంద్ర‌బాబు నియంత్రించ‌లేద‌న్న అంశాన్ని సాకుగా చూపిన తుమ్మ‌ల పార్టీని వీడి టీఆర్ ఎస్‌ లో చేరిపోయారు. ఆ త‌ర్వాత కేసీఆర్ కేబినెట్‌ లో కీల‌క శాఖ‌ల మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

అంటే పార్టీలో మ‌చ్చ‌లేని నేత‌గా ఉన్న తుమ్మ‌ల‌ను ఓడించినా కూడా నామాను చంద్ర‌బాబు ప‌ల్లెత్తు మాట అనలేద‌న్న మాట‌. ఈ ఒక్క విష‌యమే... నామాకు చంద్ర‌బాబు ఎంత‌గా ప్రాధాన్యం ఇస్తారో చెప్పేయొచ్చు. అంతేకాకుండా చాలా కాలం నుంచి పార్టీ అత్యున్న‌త విభాగంగా ఉన్న పొలిట్ బ్యూరోలో నామా స‌భ్యుడిగా కూడా ఉన్నారు. అలాంటి నేత ఇప్పుడు పార్టీ మార‌తార‌నే వార్త‌లు నిజంగానే సంచ‌ల‌నంగా మారిపోయాయి. టీడీపీ నేత‌లు క్యూ క‌ట్టి మ‌రీ టీఆర్ ఎస్‌ లో చేరుతుంటే... తుమ్మ‌ల టీఆర్ ఎస్‌ లో ఉన్న కార‌ణ‌మే నామాను కాంగ్రెస్ బాట న‌డిపిస్తోంద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యం ఏమిటంటే... నామా పార్టీ మార్పున‌కు స్వ‌యంగా చంద్ర‌బాబే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని కూడా ఇప్పుడు వ‌దంతులు వినిపిస్తున్నాయి. తెలంగాణ‌లో పార్టీకి భ‌విష్య‌త్తు లేని కార‌ణంగానే త‌న‌కు అత్యంత స‌న్నిహితుడిగా ఉన్న నామా కాంగ్రెస్‌ లో చేరిపోయేందుకు చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. చూద్దాం.. మ‌రి ఏం జ‌రుగుతుందో?