Begin typing your search above and press return to search.

పార్ల‌మెంటులో వారిద్ద‌రికి ఛాన్స్ ఇచ్చిన కేసీఆర్‌!

By:  Tupaki Desk   |   14 Jun 2019 5:52 AM GMT
పార్ల‌మెంటులో వారిద్ద‌రికి ఛాన్స్ ఇచ్చిన కేసీఆర్‌!
X
అస‌లు క‌న్నా కొస‌రే ముద్ద‌న్న సామెత‌కు త‌గ్గ‌ట్లే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణ‌యాలు కొన్ని ఉంటాయి. ఎక్క‌డి దాకానో ఎందుకు తాజాగా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌య‌మే దీనికి నిద‌ర్శ‌నం. ప్ర‌త్యేక తెలంగాణ పేరుతో అప్పుడెప్పుడో మొద‌లెట్టిన‌ప్పుడు ఆయ‌న వెంట న‌డిచిన నేతల్ని వేళ్ల మీద లెక్కించొచ్చు.
ఉద్య‌మ‌నేత‌గా ఎదురుదెబ్బ‌లు తిన్న‌ప్పుడు ఆయ‌న వెంట ఉన్నోళ్లు త‌క్కువే. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో త‌న వెంట ఉన్న అస‌లుసిస‌లు గులాబీ నేత‌ల‌కు తెలంగాణ రాష్ట్రంలో ప‌ద‌వులు ఇవ్వ‌ని కేసీఆర్‌.. బంగారు తెలంగాణ కోసం వేర్వేరు పార్టీల నుంచి వ‌చ్చిన నేత‌ల‌కు పెద్ద పీట వేయ‌టం ఆస‌క్తిక‌ర అంశంగా చెప్పాలి.

తెలంగాణ‌వాదంతో పైకి వ‌చ్చిన పార్టీలో.. అదే వాదాన్ని న‌మ్ముకున్న నేత‌ల‌కు ప‌ద‌వుల‌కు దూరంగా.. ప‌వ‌ర్ వ‌చ్చిన త‌ర్వాత వ్యూహాత్మ‌కంగా పార్టీలో చేరిన వారికి కేసీఆర్ పెద్ద పీట వేయ‌టాన్ని గులాబీ నేత‌లు లోలోన అసంతృప్తికి గురి కావ‌టంతో పాటు.. అధినేత తీరును త‌ప్పు ప‌డుతుంటారు. దీనికి త‌గ్గ‌ట్లే కేసీఆర్ నిర్ణ‌యాలు ఉండ‌టం విశేషం.

తాజాగా టీఆర్ఎస్ లోక్ స‌భ‌.. రాజ్య‌స‌భ ప‌క్ష నేత‌ల్ని కేసీఆర్ ఎంపిక చేశారు. ఈ రెండు స్థానాల కోసం ఆయ‌న అస‌లుసిస‌లు టీఆర్ఎస్ నేత‌ల‌కు అప్ప‌గించ‌కుండా.. టైం చూసుకొని పార్టీలోకి వ‌చ్చిన వారికి పెద్ద‌పీట వేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఎప్ప‌టిలానే బీటీ బ్యాచ్ కే కేసీఆర్ ఛాన్స్ ఇచ్చార‌న్న మాట ప‌లువురి నోటి నుంచి వినిపిస్తోంది. లోక్ స‌భ టీఆర్ ఎస్ ప‌క్ష నేత‌గా నామా నాగేశ్వ‌ర‌రావు.. రాజ్య‌స‌భ ప‌క్ష నేత‌గా కేకేను నియ‌మించారు.

ఈ ఇద్ద‌రిలో కేకే కాస్త ఫ‌ర్లేదు. కొంత‌కాలంగా పార్టీలో ఉన్న వారే. నామా ఎంపికే ఆశ్చ‌ర్యంగా మారింది. మొన్న‌టి లోక్ స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీలోకి వ‌చ్చి గెలిచిన ఆయ‌న‌కు.. ఏకంగా పార్టీ లోక్ స‌భా ప‌క్ష నేత అవ‌కాశాన్ని ఇవ్వ‌టాన్ని టీఆర్ఎస్ నేత‌లు ఒక ప‌ట్టాన జీర్ణించుకోలేక‌పోతున్నారు. అందుకే అన్న‌ది అస‌లు కంటే కొస‌రే ముద్ద‌ని.