Begin typing your search above and press return to search.

నందు డైరీలో 50 మంది ఎమ్మెల్యేల పేర్లు!

By:  Tupaki Desk   |   29 Oct 2022 9:30 AM GMT
నందు డైరీలో 50 మంది ఎమ్మెల్యేల పేర్లు!
X
తెలంగాణలో కొద్ది రోజుల క్రితం నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగాయన్న వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డికి పోలీసులు భద్రతను పెంచారు. మరోవైపు నిందితులను తమకు అప్పగించాలని పోలీసులు తెలంగాణ హైకోర్టును కోరిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు రిమాండ్‌ రిపోర్టులో తెలంగాణ పోలీసులు సంచలన విషయాలు పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అస్తిరపర్చేందుకే ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని రిమాండ్‌ రిపోర్టులో తెలిపారు.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు కొనుగోలుకు బేరసారాలు అక్టోబర్‌ 26న సాయంత్రం బేరసారాలు జరిగాయి. అయితే ఈ విషయంపై ఉదయం 11.30 గంటలకు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

ముగ్గురు వ్యక్తులు తనకు రూ. 100 కోట్లు ఇస్తామన్నారని.. ప్రభుత్వాన్ని, టీఆర్‌ఎస్‌ను అస్థిరపర్చాలని కోరారని.. ఇది అనైతిక చర్య కాబట్టి చట్టపరమైన చర్య తీసుకోవాలని తమకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. రోహిత్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగానే ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించారు.

ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా నాలుగు రహస్య కెమెరాలు, రెండు వాయిస్‌ రికార్డర్లు వాడినట్లు కోర్టుకు తెలిపారు. పైలట్‌ రోహిత్‌ రెడ్డికి చెందిన ఫాంహౌస్‌లో మీటింగ్‌ జరిగే హాల్‌లో నాలుగు రహస్య కెమెరాలు ఏర్పాటు పెట్టామని వివరించారు. అంతేకాకుండా రోహిత్‌ రెడ్డి జేబులో రెండు వాయిస్‌ రికార్డర్లను పెట్టామని పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే హాల్‌లో ఉన్న రహస్య కెమెరాలను.. నిందితులు వచ్చాక.. సంభాషణలు మొదలయ్యాక మధ్యాహ్నం 3.05 గంటలకు ఆన్‌ చేశామని తెలిపారు. కాగా 3.10 గంటలకు నిందితులతో కలిసి రోహిత్‌ రెడ్డి ఫాంహౌస్‌కు వచ్చారని వివరించారు. ఆ తర్వాత సాయంత్రం 4.10 గంటలకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావు వచ్చారని రిమాండ్‌ రిపోర్టులో తెలిపారు.

మూడున్నర గంటలపాటు నిందితులతో నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చర్చించారని పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడానికి ముందుగానే రోహిత్‌ రెడ్డికి ఒక సిగ్నల్‌ ఇవ్వాలని చెప్పామన్నారు. సమావేశం పూర్తి కాగానే కొబ్బరి నీళ్లు తీసుకురా అని పనిమనిషికి చెప్పాలని కోరామన్నారు. ఈ సిగ్నల్‌ ఇవ్వగానే తాము లోపలికి వస్తామని రోహిత్‌రెడ్డికి చెప్పినట్లు తెలిపారు. ఇక కొబ్బరి నీళ్లు తీసుకురావాలని రోహిత్‌ చెప్పగానే లోపలికి వెళ్లినట్లు పోలీసులు తమ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

కాగా తాము అరెస్టు చేసిన ముగ్గురు నిందితులు కూడా ఎలాంటి విషయాలు వెల్లడించలేదని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత వారి ఫోను, రహస్య కెమెరాలు, వాయిస్‌ రికార్డర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 50 కోట్లు ఇస్తామని వాయిస్‌ రికార్డర్లలో స్పష్టంగా నమోదైందని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. కర్ణాటక, ఢిల్లీతోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా చేశామని రామచంద్రభారతి చెప్పిన విషయం కూడా అందులో ఉంది.

అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ముఖ్య విషయం మాట్లాడాలని సునీల్‌ బన్సల్‌ కు రామచంద్ర భారతి సందేశం కూడా పంపారని తెలిపారు. దీనికి సంబంధించి ఎస్‌ఎంఎస్‌ స్క్రీన్‌ షాట్స్‌ కూడా ఉన్నాయన్నారు.

మొత్తం 25 మంది నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సంతోష్‌ బీజేపీ పేరుతో ఉన్న ఫోన్‌ నెంబర్‌కు రామచంద్రభారతి వాట్సాప్‌ మెసేజ్‌ పంపారని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

కాగా కారులో ఉన్న నందు డైరీని కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో వివరించారు. ఆ డైరీలో 50 మంది టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయని చెప్పారు. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు రోహిత్‌ రెడ్డికి సహకరించేందుకు మాత్రమే ఫాంహౌస్‌కు వచ్చారని వెల్లడించారు. ఈ మేరకు అన్ని వివరాలను రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.