Begin typing your search above and press return to search.

నయిం బ్యాచ్ ఫస్ట్ లిస్ట్ బయటకు వచ్చేసింది

By:  Tupaki Desk   |   19 Oct 2016 4:52 AM GMT
నయిం బ్యాచ్ ఫస్ట్ లిస్ట్ బయటకు వచ్చేసింది
X
కరుడుగట్టిన.. రాక్షసుడు లాంటి పదాలేవీ నయింకు అస్సలు సెట్ అవ్వవు. అంతకు మించిన పేరే అతనికి పెట్టాల్సి ఉంటుంది. ఎన్ కౌంటర్ కు ముందు కాస్త ముదురు క్రిమినల్ అని మాత్రమేనని అందరూ భావించిన నయిం నేర ప్రవృతి గురించి.. అతడి నేరాల విస్తృతి గురించిన వివరాలు అతడి ఎన్ కౌంటర్ అయ్యాక తెలుస్తుంటే నోట మాట రాని పరిస్థితి. రాజకీయ నాయకులు.. పోలీసు అధికారులు.. వ్యాపారులు ఇలా వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఎప్పుడు ఎవరి అవసరం ఉంటే.. వారితో తనకు అవసరమైన పనులు చేయించుకోగల సమర్థత నయిం సొంతమన్న విషయం తేలిపోయింది.

నయింతో సన్నిహిత సంబంధాలున్న వారి విషయంపై నయిం కేసును డీల్ చేస్తున్న సిట్ బృందం దృష్టి సారించింది. వారాల పాటు ఈ అంశంపై ఫోకస్ చేసి.. పక్కా సాక్ష్యాలు.. ఆధారాల్ని సేకరించి నయింకు సహకరించిన వారి లిస్ట్ ను సిద్ధం చేశారు. నయింకు బినామీలుగా వ్యవహరిస్తూ.. అతడు సంపాదించిన ఆస్తుల్ని.. భూముల్ని తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైనాన్ని గుర్తించిన సిట్ బృందం వారిని విచారించి.. ఒక జాబితాను సిద్ధం చేసింది. బెదిరింపులతో.. బలవంతపు వసూళ్లతో సంపాదించిన ఆస్తుల్ని గుర్తించిన పోలీసులు.. ఈ క్రమంలో బాధితుల్ని పెద్ద ఎత్తున కలుసుకొని.. వారిచ్చిన వివరాల్ని సేకరించింది. నయింతో అంటకాగిన వారి వివరాల్ని సేకరించి తాజాగా విడుదల చేసింది.

ఈ జాబితాలో తెలంగాణ అధికారపక్ష నేతలు పలువురు ఉండటం గమనార్హం. అన్నింటికి మించి తెలంగాణ శాసనసమండలిలో డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరిస్తున్న నేతి విద్యాసాగర్ తో సహా పలువురి హస్తం ఉందన్న విషయాన్ని గుర్తించారు. తమకు సన్నిహితులు.. తమ ఇంట్లో పని చేసే వారి పేరు మీద నయిం అక్రమ ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేయించిన వైనాన్ని గుర్తించారు. నేతి విద్యాసాగర్ ఉదంతాన్నే తీసుకుంటే.. ఆయన సమీప బంధువు.. గంగస్వామి రవీందర్ రెడ్డి పేరు మీద బొమ్మాయిపల్లిలో 10 ఎకరాల్ని రిజిస్ట్రేషన్ చేయించారు. అంతేనా.. నేతి వారింట్లో పదిహేనేళ్లుగా వంట మనిషిగా పని చేసే నాగయ్య పేరు మీద బొమ్మాయిపల్లిలోనే మరో 10 ఎకరాల్ని రిజిస్ట్రేషన్ చేయించిన విషయాన్ని సిట్ గుర్తించింది.

తన పేరు మీద ఉన్న 10 ఎకరాల భూమి గురించి సిట్ అధికారులు నాగయ్యను ప్రశ్నించినప్పుడు అతడు చెప్పిన మాటల్ని వింటే విస్మయం చెందక మానదు. అతడి మాటల్లోనే చూస్తే.. ‘‘2008లో ఒక రోజు విద్యాసాగర్ రావు వరుసకు కొడుకైన రవీందర్రెడ్డి భువనగిరి తీసుకెళ్లాడు. నాకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకొని బొమ్మాయిపల్లిలో నా పేరు మీద 10 ఎకరాల భూమి రిజిష్టర్ చేసినట్లు చెప్పాడు. సమయం వచ్చినప్పుడు ఆ భూమిని తమ పేరు మీద మార్చుకుంటామని చెప్పాడు. దీంతో.. భూమి ఎవరిది.. ఎక్కడున్నది అడగలేదు. మా సార్ సంతకం పెట్టమంటే పెట్టేశా’’ అంటూ తన వాంగ్మూలంలో సాక్ష్యం ఇచ్చేశాడు.

సిట్ అధికారులు తయారు చేసిన పలువురు ప్రముఖుల బినామీలు ఇంచుమించుగా ఇలాంటి మాటల్నేచెప్పటం గమనార్హం. ఇక.. నయింకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించి.. దందాల్లో అతడు సంపాదించిన ఆస్తులు, తమకు దగ్గరి వాళ్లు.. సన్నిహితులు.. పని చేసే వాళ్ల పేరిట రిజిష్టర్ అయిన ఆస్తుల లెక్క చూస్తే.. నయిం నేర సామ్రాజ్యం ఎంత విస్తృతమైందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. విలువైన భూములు రిజిష్టర్ అయిన వారిలో ఎవరికీ తమ పేరు మీద రిజిష్టర్ అయిన భూములు ఎక్కడు ఉంటాయి? ఎలా ఉంటాయన్న విషయం కనీసం తెలీకపోవటం గమనార్హం. నయింతో సన్నిహితంగా వ్యవహరించిన ప్రముఖులకు సంబంధించి సిట్ విడుదల చేసిన జాబితా చూస్తే..

1. నేతి విద్యాసాగర్ రావు (మండలి డిప్యూటీ ఛైర్మన్) (బినామీలు గంగస్వామి రవీందర్ రెడ్డి.. నాగయ్య)

2. సాయి మనోహర్ (డీఎస్పీ) (బినామీలు వరంగల్ కు చెందిన కొత్తూరు వెంకట్రామయ్య - భువనగిరికి చెందిన తీగల శోభన్ రావు)

3. వెంకటయ్య (కల్వకుర్తి సీఐ) (భువనగిరికి చెందిన మల్లికార్జున్)

4. మద్దిపాటి శ్రీనివాస్ (ఏఎస్పీ) (భువనగిరికి చెందిన నాగేంద్రప్రసాద్)

5. బూర రాజగోపాల్ (ఖమ్మం ఎస్సై) (సొంత బావమరిది నర్సింహస్వామి)

6. మస్తాన్ వలీ (ట్రాఫిక్ సీఐ) (మస్తాన్ వలీ మామ యూసుఫ్ ఖాన్)

7. చింతల వెంకటేశ్వరరెడ్డి (టీఆర్ ఎస్ నేత) (బిల్డర్ అయిన మధుకర్ రెడ్డి)

8. మలినేని శ్రీనివాసరావు (పోలీసు అధికారి) (వెలగపూడి శివరాం ప్రసాద్)

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/