Begin typing your search above and press return to search.

'ఆంధ్రజ్యోతి` ఎండీ రాధాకృష్ణ కు చుక్కెదురు!

By:  Tupaki Desk   |   5 Dec 2017 9:38 AM GMT
ఆంధ్రజ్యోతి` ఎండీ రాధాకృష్ణ కు చుక్కెదురు!
X

'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ కు నాంప‌ల్లి కోర్టులో చుక్కెదురైంది. రాధాకృష్ణ కు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. హైకోర్టులో రాధాకృష్ణ దాఖ‌లు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ రోజు నాంపల్లి కోర్టులో జరగనున్న తదుపరి విచారణకు వ్యక్తిగతంగా త‌ప్ప‌నిస‌రిగా హాజరై తీరాల్సిందేనని ఆదేశించింది. రాధాకృష్ణ వరుసగా కోర్టుకు గైర్హాజరు అవుతుండటంతో నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఆయ‌న పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్‌ ను జారీ చేశారు. అంతేకాకుండా, ఈ కేసులోని మిగ‌తా వ్య‌క్తులు కూడా గైర్హాజరు అవుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా తదుప‌రి విచార‌ణ‌కు హాజరై ఒక్కొక్కరూ రూ. 10 వేల పూచీకత్తును చెల్లించాలని ఆదేశించారు.

ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పై ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాల‌పై వైసీపీ నేత‌లు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. త‌మ నాయ‌కుడిపై అస‌త్య క‌థ‌నాల‌ను ప‌దే ప‌దే ప్ర‌చురిస్తున్నార‌ని వారు ప‌లుమార్లు ఆరోపించారు. ఈ నేప‌థ్యంలోనే, గతంలో వైఎస్ జగన్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్రధాని మోదీని కలిసినప్పుడు 'ఆంధ్రజ్యోతి`లో ఓ క‌థ‌నం వెలువడింది. అది తప్పుడు కథనం అని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్టా రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా, త‌మ పార్టీ అధ్య‌క్షుడి ప‌రువుకు భంగం క‌లిగించేలా త‌ప్పుడు క‌థ‌నాలు రాసినందుకు 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ - ఎడిటర్ కె.శ్రీనివాస్ సహా మరికొందరిపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఆ కేసు విచారణ దశలో ఉంది. అయితే, ఈ కేసు విచారణలో తనకు వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు ఇవ్వాల‌ని, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కోర్టుకు రాలేకపోతున్నామంటూ రాధాకృష్ణ క్వాష్ పిటిషన్ దాఖ‌లు చేశారు. దీనిపై సోమ‌వారం విచార‌ణ జ‌రిపిన నాంప‌ల్లి కోర్టు ఆ పిటిష‌న్ ను తోసి పుచ్చింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో కోర్టుకు రాలేకపోతున్నామంటూ చెప్పడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. డిసెంబర్ 5న జరగనున్న తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరై తీరాల్సిందేనని ఎండీ రాధాకృష్ణ - ఎడిటర్‌ కె.శ్రీనివాస్ - పబ్లిషర్‌ శేషగిరిరావు - మరో నలుగురు ఉద్యోగులను ఆదేశించింది.