Begin typing your search above and press return to search.

‘అన్న’ గారి పార్టీలో ఆయన వారసులకు చోటేది.?

By:  Tupaki Desk   |   29 Jun 2018 5:53 AM GMT
‘అన్న’ గారి పార్టీలో ఆయన వారసులకు చోటేది.?
X
‘అన్న’ గారి పార్టీ ఇదీ.. దశాబ్ధాల కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడుతూ.. తెలుగు దేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చారు నందమూరి తారకరామరావు. ఢిల్లీ పెద్దల కనుసైగలతో గల్లీలో పాలిస్తున్న కాంగ్రెస్ నేతలకు చుక్కలు చూపించారు. అన్నగారి రాజకీయ అరంగేట్రంతో ఆయన నమ్మి కేసీఆర్ - మోత్కుపల్లి వంటి వారెందరో స్ఫూర్తి పొంది తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రులు - ఎమ్మెల్యేలుగా రాణించారు. ఎన్నో సంక్షేమ పథకాలతో ‘రామ’రాజ్యాన్ని తీసుకొచ్చారు ఎన్టీఆర్. కానీ అల్లుడి గిల్లుడికి తెరమరుగైపోయారు. తెలుగు దేశం పార్టీని హైజాక్ చేసిన చంద్రబాబును ఎదురించలేక చాలా మంది తెలుగుదేశం పార్టీలోనే సర్ధుకుపోయారు. అన్నగారి ఆశయాల కోసం పార్టీని వీడకుండా అలానే ఉంటూ వచ్చారు.

కానీ ఇప్పుడు టీడీపీలో ఆ ఊపు లేదు. తెలుగు దేశం పార్టీ వచ్చేసారి గెలుస్తుందన్న గ్యారెంటీ లేదు. చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం సడలుతోంది. లోకేష్ బాబును తెరపైకి తెచ్చినా ఆయనలో అపరిపక్వత టీడీపీ నాయకుల్లో కలవరానికి గురిచేస్తోంది. చంద్రబాబులో పస తగ్గడం.. ఆయన కొడుకులోని నాయకత్వ శూన్యతను చూసి టీడీపీ కార్యకర్తలు - నాయకుల్లో అంతర్మథనం మొదలవుతోంది. టీడీపీకి జవసత్వాలు అందించేందుకు మళ్లీ ఎన్టీఆర్ వారసులు రావాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

2009 ఎన్నికలు.. అప్పటికే 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ని ఎలాగైనా గద్దెనెక్కించాలని.. టీడీపీ దుస్థితిని చూసి జూనియర్ ఎన్టీఆర్ - హరికృష్ణలు టీడీపీ తరఫున ప్రచారం చేశారు. కానీ ఎక్కడ జూనియర్ తమకు పోటీ వస్తాడేమోనని చంద్రబాబు అండ్ కో ఎన్నో ప్రయత్నాలు చేసి వారిని హైదరాబాద్ కే పరిమితం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాలకు దూరంగా జరిగేలా కుట్రలు పన్నారనే ప్రచారం అప్పట్లో జరిగింది.

ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల వైపు ఆసక్తి చూపలేదు. ఇంటా బయటా విమర్శలు రావడంతో మనసు మార్చుకొని తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు జూనియర్ కు అప్పగిస్తామని చంద్రబాబు నిర్ణయించినా ఎన్టీఆర్ తిరస్కరించారు. బలం ఉన్న ఏపీలో కాదని తెలంగాణలో ఎందుకు అంటూ హరికృష్ణ కూడా వద్దన్నారు. దీంతో నందమూరి ఫ్యామిలీ టీడీపీకి దూరమైంది. ఈ పరిణామాలు టీడీపీ కార్యకర్తలు - నాయకుల్లో నిరుత్సాహానికి కారణమయ్యాయి.

నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీలో నందమూరి వారసులకు చోటు లేకపోవడంపై కొందరు ఎన్టీఆర్ అభిమానులు రగిలిపోతున్నారు. చంద్రబాబు చాకచక్యంగా బాలయ్యతో వియ్యం అందుకొని ఆయనకో ఎమ్మెల్యే సీటు ఇచ్చి టీడీపీ మొత్తాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకున్నాడని.. ఇప్పుడు బాబు వల్ల టీడీపీ మరోసారి కనుమరుగైపోయే పరిస్థితి ఉందని బాధపడుతున్నారు. టీడీపీకి పూర్వవైభవం రావాలంటే టీడీపీని నందమూరి ఫ్యామిలీ చేజిక్కించుకోవాలని.. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టాలనే వాదనలు ఇప్పుడు టీడీపీ కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు-లోకేష్ బాబులు ఉండగా అది అసాధ్యమని తెలుసు.. కానీ వచ్చే ఎన్నికల్లో టీడీపీ పుట్టి మునిగాక కానీ ఈ వాస్తవం ఈ బాబులకు అర్థం కాదని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.