Begin typing your search above and press return to search.

ఈ త‌ప్పులో కాలేయ‌టాలేంటి సుహాసినిజీ!

By:  Tupaki Desk   |   10 Jan 2019 5:24 AM GMT
ఈ త‌ప్పులో కాలేయ‌టాలేంటి సుహాసినిజీ!
X
ప్ర‌ముఖుల కుటుంబం నుంచి వ‌చ్చార‌న్నంత‌నే వారిపై అభిమానం.. వారిని నెత్తిన పెట్టుకోవ‌టం లాంటివి మామూలే. అయితే.. ఇటీవ‌ల కాలంలో వ‌చ్చిన మార్పుతో అలాంటి ప‌ప్పులు ఉడ‌క‌వ‌న్న విష‌యం ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు స్ప‌ష్టం చేశాయి. ఎంత నంద‌మూరి ఫ్యామిలీ అయితే మాత్రం..మ‌రెంత ఎన్టీఆర్ మ‌న‌మ‌రాలు అయితే మాత్రం.. ఏదో ఒక స్థానంలో వ్యూహ‌త్మ‌కంగా పోటీకి నిల‌బెడితే.. అదే ప‌నిగా ఓట్లు వేసేస్తారా ఏంటి? అన్న రీతిలో కుక‌ట్ ప‌ల్లి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఓట‌ర్లు త‌మ చేత‌ల‌తో చెప్పేశారు.

అయితే.. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇలా ఉండ‌టానికి కార‌ణం నందమూరి సుహాసిని కూడా కార‌ణ‌మ‌న్న మాట ప‌లువురి నోట వినిపించ‌క మాన‌దు. నంద‌మూరి ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ప‌ది మంది మ‌న‌సుల్ని దోచుకునేలా.. ప్ర‌జ‌ల్లో తాత‌కు త‌గ్గ మ‌న‌మ‌రాలిగా ముద్ర వేయ‌టంలో సుహాసిని ఫెయిల్ కావ‌ట‌మే ఆమె ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణంగా చెప్ప‌టం క‌నిపిస్తుంది.

ఎన్టీఆర్ మ‌న‌మ‌రాలిగా త‌న‌కున్న ఇమేజ్ ను మ‌రింత పెంచుకోవాల్సిన ఆమె.. అందుకు భిన్నంగా త‌న మాట‌ల‌తో చెడ‌గొట్టుకున్నార‌న్న అప‌వాదు ఉంది. మాట్లాడ‌టం కూడా రాదా? అన్న క్వ‌శ్చ‌న్ తోపాటు.. క‌నీసం మాట్లాడ‌టం కూడా రాని ఆమెను తీసుకొచ్చి పోటీకి దించేస్తే ఓట్లు వేస్తారా? అన్న చ‌ర్చ జోరుగా సాగింది. నిజానికి సుహాసిని మాట‌లే ఆమెకు మైన‌స్ అయ్యాయ‌ని.. దానికితోడు ఏపీ సీఎం చంద్ర‌బాబు ఓవ‌రాక్ష‌న్ ప్ర‌చారం ఆమె ఫ‌లితాన్ని ప్ర‌భావితం చేసిన‌ట్లుగా చెప్పేవారెంద‌రో.

మిగిలిన విష‌యాలు ఎలా ఉన్నా.. ఆక‌ట్టుకునేలా సుహాసిని మాట్లాడి ఉంటే ఫ‌లితం వేరుగా ఉండేద‌ని.. ఆమె మీద వ‌చ్చిన నెగిటివ్ చాలావ‌ర‌కూ ఉండేది కాద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తూ ఉంటుంది. ఆమె మాట‌లే ఆమెకు మైన‌స్ గా మారాయి. అదెలానంటే.. ఆమె మాట్లాడిన ప్ర‌సంగాల‌కు సంబంధించిన క్లిప్పుల‌ను ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం తెలివిగా వైర‌ల్ చేసి.. క‌నీసం మాట్లాడ‌టం కూడా రాని ఆమెను తీసుకొచ్చి బ‌రిలో దింపార‌న్న విమ‌ర్శ‌ను తెర మీద‌కు తెచ్చారు. దీనికి ధీటుగా స‌మాధానం ఇవ్వ‌క‌పోవ‌టం కూడా నందమూరి సుహాసిని ఓట‌మికి కార‌ణంగా చెప్పే వారు లేక‌పోలేదు.

ఓట‌మి నుంచి గెలుపు పాఠాల దిశ‌గా ప్ర‌యాణాన్ని స్టార్ట్ చేయ‌టం ప‌లువురిలో క‌నిపిస్తూ ఉంటుంది. ఈ విష‌యంలో నంద‌మూరి సుహాసిని ఇంకా వెనుక‌బ‌డిన‌ట్లే. తాజాగా ఎన్టీఆర్ బ‌యోపిక్ క‌థానాయ‌కుడు మూవీ రిలీజ్ నేప‌థ్యంలో.. ఆ సినిమాను చూసిన ఆమె మీడియాతో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా త‌న తాత గురించి త‌న‌కు పెద్ద‌గా తెలియ‌ద‌ని.. కానీ.. సినిమాతో ఆయ‌న గురించి చాలా తెలుసుకున్న‌ట్లు చెప్పిన తీరుపై విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. కోట్లాదిమందికి ఆరాధ్య‌దైవంగా ఉండే తాత గురించి సొంత మ‌న‌మ‌రాలికి తెలియ‌క‌పోవ‌టం ఏమిటి? త‌ండ్రి.. పెద్ద‌నాన్న‌లు.. బాబాయ్ లు..

మేన‌త్త‌లు.. ఇలా ఎంతోమంది కుటుంబ స‌భ్యులు ఒక‌ప‌క్క‌.. మ‌రోవైపు ఎన్టీఆర్‌ కు సంబంధించిన ఎన్నో పుస్త‌కాలు అందుబాటులో ఉన్న వేళ‌.. ఒక సినిమాను చూసి తాత గురించి తెలుసుకున్నాన్న మాట ఏ మాత్రం న‌ప్ప‌లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మిగిలిన సంగ‌తులు ఎలా ఉన్నా.. ముందు మాట్లాడ‌టం మీద నంద‌మూరి సుహాసిని దృష్టి పెడితే మంచిందంటున్నారు. వింటున్నారా మేడ‌మ్‌!