Begin typing your search above and press return to search.

నమో నందమూరీ...?

By:  Tupaki Desk   |   22 March 2022 3:30 AM GMT
నమో నందమూరీ...?
X
ఆయన తెలుగు జాతికి అన్న గారు. ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అటు సినీ రంగాన, ఇటు రాజకీయ రంగాన ఆయనే రారాజు. ఆయన రెండు రంగాలను తనదైన శైలిలో శాసించారు. తెలుగు జనులు కూడా ఆయనకు నీరాజనాలు అర్పించారు. అలాంటి నందమూరి ఈ లోకాన్ని వీడి అచ్చంగా 26 ఏళ్ళు అయింది.

ఇక ఆయన ఈ భువిలోకి వచ్చి మే 28 నాటికి 99 ఏళ్ళు పూర్తి అవుతాయి. అంటే శత వసంతాలకు ఈ ఏడాది శుభారంభం చుడుతుందన్న మాట. ఇక నందమూరి చుట్టూ ఏపీ రాజకీయం కూడా ఇక మీదట రంజుగా సాగనుంది.

ఎన్టీయార్ అతి పెద్ద విగ్రహాన్ని గుడివాడలోని నిమ్మకూరు గ్రామలో సీఎం జగన్ ఆయన శత జయంతి వేడుకల సందర్భంగా ప్రారంభిస్తారు అని అంటున్నారు. అలాగే విజయవాడ కొత్త జిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టనున్నారు. అదే విధంగా ఎన్టీయార్ నామస్మరణలో వైసీపీ తరించాలని చూస్తోంది.

తమకు ఎన్టీయార్ అంటే ఎంతో అభిమానం అని చాటి చెప్పుకోవడానికి తపన పడుతోంది. మరి ఎన్టీయార్ పెట్టిన పార్టీ, ఆయనతోనే అంతా అనుకునే టీడీపీ చూస్తూ ఊరుకుంటుందా. అందుకే ఎన్టీయార్ విగ్రహాలను ఊరూ వాడా మరిన్ని కొత్తగా ఏర్పాటు చేయించడానికి ఆ పార్టీ రంగం సిద్ధం చేస్తోంది.

ఈ మేరకు పెద్ద ఎత్తున ఎన్టీయార్ విగ్రహాల తయారీకి కూడా ఆర్డర్లు వెళ్ళాయని అంటున్నారు. ఎన్టీయార్ విగ్రహాలను ప్రతిష్టించే బృహత్తర కార్యక్రమాన్ని ఆయన మనవడు అంటే కూతురు కొడుకు నారా లోకేష్ చేపట్టనున్నారు. ఆ విధంగా అన్నగారికి సిసలైన మనవడిని అని ఇంట చెప్పుకోవడంతో పాటు బయట వైసీపీ కి కూడా పొలిటికల్ గా కౌంటర్ ఇవ్వడానికి లోకేష్ సిద్ధపడుతున్నారు అని అంటున్నారు.

దాంతో ఏపీలో ఇక అంతా నమో నందమూరి అని ఊళ్ళకు బయలుదేరుతారన్న మాట. నిజానికి తెలుగు జాతి గర్వించే నేతగా ఎన్టీయార్ కి పార్టీలు, రాజకీయం లేదు. కానీ ఆయన్ని తమ వాడుగా చెప్పుకుంటే అది రాజకీయంగా లాభమని వైసీపీ కూడా పోటీకి దిగడంతోనే ఇపుడు వ్యవహారం రసకందాయంలో పడింది. మొత్తానికి ఏపీ రాజకీయాలు ముందు ముందు ఎన్టీయార్ చుట్టూ తిరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు అనే చెప్పాలి.