Begin typing your search above and press return to search.

స్వీట్ న్యూస్‌: ఆధార్‌ పై భ‌యం అక్క‌ర్లేదు

By:  Tupaki Desk   |   14 Oct 2017 12:34 PM GMT
స్వీట్ న్యూస్‌: ఆధార్‌ పై భ‌యం అక్క‌ర్లేదు
X
దేశంలో మ‌నిషికి టైంకి ఆహారం ఉన్నా లేక‌పోయినా, ఒంటిపై క‌ట్టుకునేందుకు నాలుగు గ‌జాల గుడ్డ ఉన్నా లేక‌పోయినా.. మాత్రం ఆధార్ కార్డు మాత్రం ఉండి తీరాల్సిందే. పుట్టుక నుంచి చావు వ‌ర‌కు మ‌ధ్య‌లో జ‌రిగే ఏ లావాదేవీకైనా ఆఖ‌రికి శ్మ‌శానంలో శ‌వాన్ని పూడ్చాల‌న్నా - కాల్చాల‌న్నా డెత్ స‌ర్టిఫికెట్ ఇవ్వాల‌న్నా ఆధారం.. ఆధారే!! అంత‌టా అన్నిటా.. ఆధార్ ఆధార్ ఆధార్‌. ప్ర‌భుత్వాల‌న్నీ ఇప్పుడు ఆధార్ జ‌పం చేస్తున్నాయి. అయితే, ఆధార్ ద్వారా వ్య‌క్తిగ‌త వివ‌రాలు వెల్ల‌డి అవుతాయ‌ని - ఇది ప్రాధ‌మిక హ‌క్కుల్లోని గోప్య‌త‌ను పాటించే హ‌క్కుకు విఘాత మ‌ని కొంద‌రు వాదించారు.

కోర్టుల‌కు కూడా వెళ్లారు. దీనిపై కోర్టుల్లో పెద్ద ఎత్తున వాద ప్ర‌తివాదాలు కూడా జ‌రిగాయి. ఆఖ‌రికి ఆధార్ గోప్య‌త హ‌క్కును హ‌రిస్తోంద‌ని సుప్రీం కోర్టు పేర్కొంది. అయినా కూడా ప్ర‌భుత్వాలు ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. అన్ని ప‌థ‌కాల‌కూ ఆధార్ ఉండి తీరాల్సిందేన‌ని స్ప‌ష్టం చేస్తున్నాయి. కానీ, దేశ‌వ్యాప్తంగా మాత్రం ప్ర‌జ‌లు త‌మ వ్య‌క్తి గ‌త వివ‌రాలు పుట్టిన తేదీ - తండ్రి - విద్యార్హ‌త‌లు - ఇంటి వివ‌రాలు వంటివి వెల్ల‌డించ‌డం వ‌ల్ల ఇబ్బందులు వ‌స్తాయ‌ని భ‌య‌ప‌డుతున్నారు.

ఈ నేప‌థ్యంలో.. ఆధార్ నెంబరు - వ్యక్తిగత వివరాల గోప్యత గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆధార్ రూపకర్త నందన్ నిలేకని చెప్పారు. ఈ వివరాలను ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచుతుందని అన్నారు. ఐఎంఎఫ్ - ప్రపంచ బ్యాంకు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వివరాలను తెలిపారు. గోప్యతను పాటించడంలో భారత్ అత్యుత్తమంగా ఉందని స‌ర్టిఫికెట్ ఇచ్చారు. అంతేకానీ, ఆధార్ వ‌ద్ద‌ని మాత్రం ఆయ‌న చెప్ప‌లేదు. సో.. ఆధార్ ఆధారంగానే ఈయ‌న ఈ వ్యాఖ్య‌లు చేసి ఉంటార‌ని నెటిజ‌న్లు స‌టైర్లు కుమ్మేశారు. అయితే, నీలేక‌ని వెల్ల‌డితో ఒకింత ఆందోళ‌న త‌గ్గింది.