Begin typing your search above and press return to search.

కృష్ణుడు అయినా రాముడైనా మీరే.. మాకెవరూ గుర్తుకు రారు

By:  Tupaki Desk   |   28 May 2022 5:30 AM GMT
కృష్ణుడు అయినా రాముడైనా మీరే.. మాకెవరూ గుర్తుకు రారు
X
విలక్షణ వ్యక్తిత్వం ఆయన సొంతం. ఆయనకు సంబంధించిన వివరాలు విన్నప్పుడు.. ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని జరిగాయా? అన్నభావన కలుగకుండా ఉండదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక సామాన్యుడు.. అసమాన్యుడిగా మారటమే కాదు.. కోట్లాది మంది ప్రజలకు ఆరాధ్య దైవంగా నిలవటం.. ఆయన్ను దైవాంశ సంభూతుడిగా కొలవటం ఆయనకు మాత్రమే సాధ్యమేమో. ఆయనే.. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి.. ఆయన పేరు నోటి నుంచి వచ్చే వేళలో ఏదో ఒక తెలీని వైబ్రేషన్ ఒంట్లో నుంచి వచ్చేస్తుంది. ఈ రోజు (శనివారం, మే 28) ఆయన వందో జయంతిలోకి అడుగు పెట్టనున్నారు. తొంభైతొమ్మిది సంవత్సరాలు నిండి వందో ఏట అడుగు పెడుతున్న వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు గుర్తుగా చేస్తున్న కార్యక్రమాల్ని చూస్తే.. తెలుగు ప్రజలు ఎప్పటికి మర్చిపోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే.. అది ఎన్టీవోడే అన్న భావన కలుగక మానదు.

ఆయన ఖ్యాతిని తన వరకే అట్టిపెట్టుకోకుండా తెలుగువారందరికి అపాదించారు. ఆ మాటకు వస్తే ఆయనకు ముందు తెలుగువారికి లభించిన గుర్తింపునకు.. ఆయన పుణ్యమా అని తెలుగు వారికి దక్కిన గుర్తింపునకు అస్సలు సంబంధమే ఉండదు. అంతర్జాతీయంగా తెలుగోడి సత్తాను చాటిన ఆయన.. మేం అరవోళ్లం కాదు.. తెలుగోళ్లమంటూ తల పైకెత్తుకునేలా చేసిన ఒకే ఒక్కడు.. యుగానికి ఒక్కడుగా అభివర్ణించే ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

వెండితెర వేల్పుగా.. రాముడైనా.. శ్రీకృష్ణుడైనా ఆయన్ను తప్పించి మరెవరిని పోల్చుకోలేని పరిస్థితి. తెలుగువారి మదిలో రాముడన్నంతనే గుర్తుకు వచ్చేది ఎన్టీవోడే. శ్రీకృష్ణుడు కూడా ఆయనలానే ఉండి ఉండొచ్చు. అంతలా తన నటనతో ప్రజల్ని కట్టివేసిన ఆయన.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి దశాబ్దాలు అవుతున్నా.. ఇప్పటి తరం వాళ్లకు కూడా ఆయన రాముడే.. ఆయనే కృష్ణుడు కావటం ఎన్టీవోడికి మాత్రమే చెల్లిందని చెప్పాలి.

సామాన్యుడిగా మొదలైన ఆయన జీవన ప్రయాణం.. కొద్దికాలానికే తిరుగులేని నటుడిగా గుర్తింపు పొందటం..ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టటం.. తనదైన మార్కుతో రాజకీయ రూపురేఖల్ని మార్చేయటమేకాదు.. తెలుగువారికి రాజకీయాల మీద ఆసక్తి కలిగేలా.. వారి జీవితాల్లో భాగమయ్యేలా చేసిన క్రెడిట్ ఎన్టీవోడికే దక్కుతుంది. రాజకీయం అంటే నలుగురు పెద్దోళ్లు గదిలో కూర్చొని మాట్లాడుకునేది కాదు. అందరూ కూర్చొని మాట్లాడుకోవాల్సిన అంశంగా ప్రజలకు అవగాహన కల్పించిన ఆయన్ను.. ఈ రోజున పార్టీలకు అతీతంగా గుర్తించి.. గౌరవించే పరిస్థితి.

పుట్టింది సాధారణ రైతుకుటుంబమే అయినప్పటికీ.. తన సొంత కష్టంతో ఎదిగిన ఆయన జీవితం అసాంతం ఒక స్ఫూర్తి పాఠం. తాను ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం ఒక ఎత్తు అయితే.. తనదైన ఆత్మాభిమానాన్ని సామాన్యులకు పరిచయం చేసి.. దానికి మించింది మరేదీ లేదన్న భావనను కోట్లాది మంది మెదళ్లకు పరిచయం చేసిన ఘనత ఆయనదే. ఇంత చేసి.. క్రమశిక్షణకు మారుపేరుగా.. ఎంతటి ఉన్నత స్థాయికి ఎదిగినా.. టైంను టైంగా చూసే ధోరణి ఆయనకు మాత్రమే సొంతమని చెప్పాలి. ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికి.. నోటి నుంచి మాటగా వచ్చిన టైంకు నిమిషం ముందు ఉండటం ఆయనకు మాత్రమే చెల్లుతుందని చెప్పాలి.

వందలాది చిత్రాల్లో నటించిన ఎన్టీవోడికి సాటి వచ్చే నటుడు ఎవరూ ఉండకపోవచ్చు. ఆయన చేసిన పాత్రలు మరో నటుడికి సాధ్యం కాదనే చెప్పాలి. ఎలాంటి పాత్ర అయినా అందులోకి ఒదిగిపోయే ఆయనలాంటి వారు భూమి మీదకు అరుదుగా మాత్రమే వస్తారు. ఆయన వచ్చి వెళ్లిపోయి చాలాకాలమే అయినప్పటికీ ఆయన వందో జయంతి కార్యక్రమాల్ని ఈ రోజు నుంచి యావత్ తెలుగునాట పార్టీలకు అతీతంగా జరుపుకోవటం చూసినప్పుడు.. ఇలాంటి క్రెడిట్ ఆయనకు మాత్రమే సొంతమన్న భావన కలుగక మానదు. అందుకే..తెలుగు వారికి ఇప్పటికి ఎప్పటికి రాముడైనా.. కృష్ణుడైనా ఆయన మాత్రమే. మరెవరికి ఆయన స్థానం సాధ్యం కాదంతే.