Begin typing your search above and press return to search.

ప్ర‌సంగ పాఠాలు నేర్చుకుంటున్న సుహాసిని!

By:  Tupaki Desk   |   22 Nov 2018 8:13 AM GMT
ప్ర‌సంగ పాఠాలు నేర్చుకుంటున్న సుహాసిని!
X
కూక‌ట్‌ ప‌ల్లిలో టీడీపీ అభ్య‌ర్థిగా నంద‌మూరి సుహాసిని అలియాస్ చుండ్రు సుహాసిని బ‌రిలో నిల‌వ‌డంతో ఆ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల దృష్టిని ఆక‌ర్షిస్తోంది. నంద‌మూరి ఇంటి ఆడ‌బిడ్డ‌గా టీడీపీ ఆమెను ప్రొజెక్ట్ చేస్తోంది. ఆమె విజ‌యానికి స‌ర్వ‌శ‌క్తులూ అడ్డాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు భావిస్తున్నారు.

సుహాసిని రాజ‌కీయాల‌కు కొత్త‌. గ‌తంలో ఎన్న‌డూ ఎన్నిక‌ల్లో ఆమె పోటీ చేయ‌లేదు. బ‌హిరంగ స‌భ‌ల్లో ప్ర‌సంగాలు, మీడియాతో మాట్లాడ‌టం ఆమెకు అల‌వాటు లేదు. కూక‌ట్‌ ప‌ల్లి అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలుగులో ఆమెకు ప‌ట్టున్న‌ట్లు అప్పుడు క‌నిపించ‌లేదు. ఏం మాట్లాడాలనే దానిపై కూడా సుహాసినికి స్ప‌ష్ట‌త ఉన్న‌ట్లు క‌నిపించ‌లేదు. దీంతో ప‌దే ప‌దే ఆమె ప‌క్క‌నున్న త‌మ‌వారి నుంచి ప్రాంప్టింగ్ కోసం ఎదురు చూశారు. ఒకే వాఖ్యంలో రెండు ప‌దాలను ప‌ల‌క‌డానికి మ‌ధ్య ఆమె తీసుకున్న టైమ్ గ్యాప్ చూసి చాలామంది న‌వ్వుకున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా చాలా జోకులు పేల్చారు కూడా.

ఈ నేప‌థ్యంలో ఆందోళ‌న చెందిన‌ తెలుగుదేశం పార్టీ నేత‌లు.. స్ప‌ష్టంగా మాట్లాడ‌టంపై నిపుణుల‌తో శిక్ష‌ణ‌నిప్పిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మీడియాతో మాట్లాడేట‌ప్పుడు ఎలాంటి ప‌దాలు ఉప‌యోగించాలి? ఏయే ప‌దాలు ఉప‌యోగించ‌కూడ‌దు? బ‌హిరంగ స‌భ‌ల్లో ప్ర‌సంగించేట‌ప్పుడు ఎలా ఉండాలి? వ‌ంటి విష‌యాల‌ను కూడా ఆమెకు వివ‌రిస్తున్న‌ట్లు స‌మాచారం.

అంతేకాదు. నిజానికి కూక‌ట్‌ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌లు - ప్ర‌జ‌ల అవ‌స‌రాల గురించి కూడా సుహాసినికి పెద్ద‌గా అవ‌గాహ‌న లేదు. పెద్ద‌గా ప‌రిచయాలు కూడా లేవు. దీంతో నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన అంశాల‌న్నింటినీ టీడీపీ నియ‌మించిన నిపుణులు ప్ర‌స్తుతం సుహాసినికి వివ‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. సుహాసిని గెలుపును ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తున్న చంద్ర‌బాబు.. ప‌లువురు నేత‌ల‌కు నేరుగా ఫోన్ చేసి ఆమెకు అన్ని విధాలా సాయం చేయాల‌ని ఆదేశించిన‌ట్లు కూడా తెలుస్తోంది.