Begin typing your search above and press return to search.

'కత్తర్ వాది' అంటే కుత్తాగా ప్రచారం.. టీఆర్ఎస్ రచ్చ అంతా అదే

By:  Tupaki Desk   |   10 Sep 2022 8:30 AM GMT
కత్తర్ వాది అంటే కుత్తాగా ప్రచారం.. టీఆర్ఎస్ రచ్చ అంతా అదే
X
ఆవేశం ఆలోచనను చంపేస్తుంది. ఈ చిన్న పాయింట్ ను మిస్ అయితే కష్టాలు తప్పవు. ఇతర రంగాలకు చెందిన వారైతే ఫర్లేదు. కానీ.. రాజకీయ నేతలు ఒక్కోసారి ఇలాంటి తప్పులకు మూల్యం భారీగా చెల్లించాల్సి వస్తుంది. శుక్రవారం హైదరాబాద్ లోని రచ్చకు ఇదో ముఖ్య కారణంగా చెప్పక తప్పదు. మహా నిమజ్జనానికి హైదరాబాద్ గణేశ్ ఉత్సవ సమితి అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మను ఆహ్వానించారు. ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.

ఇటీవల కాలంలో బీజేపీకి చెందిన ఏ అగ్రనేత వచ్చినా.. తప్పనిసరిగా దర్శించుకునే దర్శన స్థలంగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం ఒకటిగా మారిన సంగతి తెలిసిందే. అసోం సీఎం హిమంత కూడా అదే పని చేశారు.

పనిలో పనిగా అక్కడ హిందూ సంస్థలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని పొరపాటుగా అర్థం చేసుకొని ఆగమాగం చేస్తే.. సరైన రీతిలో క్రాస్ చెక్ చేయకుండా ఆ ద్వేషపూరిత వ్యాఖ్యల్ని ప్రచారం చేయటంతో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

ఇంతకూ సీఎం హిమంత ఏమన్నారన్నది చూస్తే.. ''దేశంలో ఉదారవాదం (ఉదార్ వాది).. అతివాదం (కత్తర్ వాది) ఉన్నాయి. తెలంగాణలో నిజాం.. రజాకార్ల కాలం నుంచే అతివాదం విపరీతంగా పెరిగింది. (తెలంగాణ మే కత్తర్ వాది బహుత్ బడ్ గయా హై) అతివాదం వల్లే తెలంగాణలో ఒకే కుటుంబం బాగుపడుతోంది. ఒకే కుటుంబానికి కాకుండా అన్ని కుటుంబాలకు మేలు కలగాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరుకున్నాను' అని వ్యాఖ్యానించారు. ఇక్కడ కత్తర్ వాది అనే పదాన్ని.. కుత్తా (కుక్క)గా అర్థం చేసుకున్న వారు.. కేసీఆర్ ను కుక్క అన్నారంటూ ప్రచారం జరిగింది.

ఇదిగో తోక అంటే.. అదిగో పులి అనే సోషల్ మీడియారోజుల కారణంగా.. కొద్దిసేపటికే అసోం సీఎం దారుణ వ్యాఖ్యలు చేశారన్న ప్రచారం సాగింది. ఈ మాటల్ని అర్థం చేసుకోవటంలో అపార్థానికి గురైన టీఆర్ఎస్ చోటా నాయకుడు నందకిశోర్ వ్యాస్ బిలాల్.. ఎంజే మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక మీద అసోం సీఎం ఉండగా.. పైకి వచ్చి మైకును బలంగా లాగేసి.. కేసీఆర్ కుటుంబంపై రాజకీయ విమర్శలు ఎందుకు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అసలు జరిగింది ఒకటి అయితే.. దాన్ని తప్పుగా అర్థం చేసుకోవటంతో నందకిశోర్ చెలరేగిపోయారు.

అయినా.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఘాటైన విమర్శలు చేశారనే అనుకుందాం. దానికి చెలరేగిపోయి.. సీఎం వేదిక మీదకు వచ్చి ప్రశ్నించటం ఏమిటి? ఒక ముఖ్యమంత్రి ఉన్న వేదిక వద్దకు.. ప్రత్యర్థి పార్టీకి చెందిన ఛోటానేత ఎలా రాగలిగారు? భద్రతా వర్గాలు ఏం చేస్తున్నట్లు? జెడ్ ప్లస్ సెక్యురిటీ ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దకు ఒక సాధారణ నేత నేరుగా వచ్చేసి.. పక్కన నిలబడి ప్రశ్నించే పరిస్థితి దేనికి నిదర్శనం? ఇంతటి భద్రతా పరమైన లోపాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? అన్నదిప్పుడు ప్రశ్నలుగా మారాయి. అదే సమయంలో తప్పుగా జరిగినప్రచారం ఇంత రచ్చకు కారణమైందని చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.