Begin typing your search above and press return to search.

ఎస్పీవై.. చివరకు ఆ పార్టీలో తేలారు!

By:  Tupaki Desk   |   20 March 2019 10:15 PM IST
ఎస్పీవై.. చివరకు ఆ పార్టీలో తేలారు!
X
అటు తిరిగి ఇటు తిరిగి జనసేనలో తేలారు ఎస్పీవై రెడ్డి. గత ఎన్నికల్లో నంద్యాల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన ఎస్పీవై రెడ్డి ఆ తర్వాత ఏమేం చేశారో అందరికీ తెలిసిన సంగతే. ఈయన ఎన్నికల ఫలితాలు వచ్చిన వెనువెంటనే తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు.ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం నేతగా చలామణి అయ్యారు.

అయితే ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు. అనర్హత వేటు పడాల్సి ఉన్నా.. ఇలాంటి వాళ్లంతా తమ ఫిరాయింపులకు ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ఇక అంతగా తెలుగుదేశం నేతగా చలామణి అయినా ఆ పార్టీలో చివరకు అయితే ఎస్పీవైకి దక్కింది ఏమీ లేదు.ఆయన కోరుకున్నట్టుగా నంద్యాల ఎంపీ టికెట్ దక్కలేదు.ఆ పై తన కూతురుకు లేదా అల్లుడుకు నంద్యాల ఎమ్మెల్యే టికెట్ ను కోరినా చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు!

ఆ పరిణామాల మధ్యన చంద్రబాబు మీద నమ్మకం ఉందంటూ కొంతకాలం ప్రకటించుకొంటూ వచ్చారు ఎస్పీవై. అయితే చివరకు చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇవ్వడంతో ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీపై అలిగారు. రెబల్ గా పోటీ ఖాయమని ప్రకటించారు.

తను నంద్యాల ఎంపీ సీటు నుంచి తన కుటుంబీకులు ఒకరు నంద్యాల ఎమ్మెల్యే సీటునుంచి ఇండిపెండెంట్స్ గా పోటీలో ఉంటామని ఎస్పీవై రెడ్డి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీపై అలా ప్రతీకారం అని ప్రకటించారు.మరి ఆ తర్వాత ఏమనుకున్నారో ఏమో కానీ..ఇప్పుడు జనసేన అంటున్నారు ఎస్పీవై .ఆ పార్టీలోకి ఎస్పీవైరెడ్డితో పాటు ఆయన కూతురు కూడా చేరిపోయారు. పవన్ ఆధ్వర్యంలో వీరు చేరిపోయారు. మరి ఒక పార్టీ తరఫున నెగ్గి, మరో పార్టీలోకి అనైతికంగా ఫిరాయించి, ఇప్పుడు మళ్లీ జనసేనలోకి చేరిన ఎస్పీవై రాజకీయం ఇక ఎలా సాగుతుందో!