Begin typing your search above and press return to search.

టీ తమ్ముళ్లను గవర్నర్ లైట్ తీసుకుంటున్నారట

By:  Tupaki Desk   |   13 Sep 2016 9:33 AM GMT
టీ తమ్ముళ్లను గవర్నర్ లైట్ తీసుకుంటున్నారట
X
రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్న నరసింహన్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరు అప్పుడప్పడు ఫైర్ అవుతుంటారు. తాజాగా ఆ పాత్రను తెలంగాణ తెలుగు తమ్ముళ్లు తీసుకున్నారు. గవర్నర్ నరసింహన్ వైఖరిపై చిర్రుబుర్రులు ఆడుతున్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు.. గవర్నర్ తో గంటకు పైనే భేటీ అయిన వెళ్లిన కొన్ని గంటల వ్యవధిలోనే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నరిసిరెడ్డి చేసిన ఆరోపణ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

గవర్నర్ నరసింహన్ తెలంగాణ తెలుగుదేశం పార్టీని అస్సలు పట్టించుకోవటం లేదని ఫైర్ అయ్యారు. కారణం తమకు తెలీదన్న నన్నూరి.. తాము గవర్నర్ అపాయింట్ మెంట్ అడిగితే ఇవ్వటం లేదని ఆయన ఆరోపించారు. గడిచిన పదిహేను రోజులుగా గవర్నర్ కార్యాలయంలో తమకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరుతున్నామని.. కానీ.. గవర్నర్ నుంచి స్పందన లేదన్నారు. వివిధ పార్టీలకు.. స్వచ్ఛంద సంస్థలకు అడిగిన వెంటనే అపాయింట్ మెంట్ ఇస్తున్న గవర్నర్.. తెలంగాణ టీడీపీకి మాత్రం ఎందుకు ఇవ్వటం లేదో తెలీదంటూ మండిపడ్డారు.

ప్రజల కోసం పోరాడుతున్న పార్టీలకు గవర్నర్ అవకాశం ఇవ్వాలని చెప్పిన నన్నూరి ఒక విషయం మర్చిపోయినట్లుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. టీటీడీపీ శాసనసబాపక్ష నేత రేవంత్ రెడ్డిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో.. టీ తమ్ముళ్లకు తాను అపాయింట్ మెంట్ ఇస్తే.. ఆయన వచ్చే అవకాశం ఉందని.. అందుకే ఇవ్వటం లేదన్న మాట వినిపిస్తోంది. ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డిని కలిసిన వేలెత్తి చూపించటం కన్నా.. టీ తమ్ముళ్లను తాత్కాలికంగా దూరం పెట్టాలని గవర్నర్ అనుకొని ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.