Begin typing your search above and press return to search.

తాగుబోతుల తెలంగాణగా మార్చారా?

By:  Tupaki Desk   |   15 July 2016 9:28 AM GMT
తాగుబోతుల తెలంగాణగా మార్చారా?
X
తెలంగాణ అధికారపక్షంపై విపక్షాలు విమర్శల జోరును పెంచుతున్నాయి. తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నరిసిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడిన ఆయన తాను చేసిన ప్రతి విమర్శకు ఒక ఉదాహరణను చెప్పటం విశేషంగా చెప్పాలి. త్యాగాల తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మార్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే చెల్లిందని ఆయన మండిపడ్డారు.

రోడ్డు ప్రమాదంలో మరణించిన చిన్నారి రమ్య ఇష్యూను మరచిపోయేలా చేయటానికే మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటనలు చేపట్టినట్లుగా ఆయన విమర్శించారు. అర్థరాత్రి ఆకస్మిక పర్యటనలు.. బార్ల మీద దాడులు.. మైనర్ల అరెస్ట్ లు లాంటివన్నీ ప్రచారం కోసమే తప్పించి మరొకటి కావని ఆరోపించారు. ప్రాంతాల వారీగా లక్ష్యాలు పెట్టి మరీ మందును అమ్మిస్తున్న తెలంగాణ సర్కారు ఈ రోజు రూల్స్ గురించి మాట్లాడటం ఏమిటంటూ ప్రశ్నించారు.

ఓవైపు అర్థరాత్రి వరకూ మద్యం అమ్మకాలకు అనుమతులు ఇస్తూనే.. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెడుతూ.. రెండు వైపులా ఆదాయాన్ని కొల్లగొడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆదాయానికి లక్ష్యాలు పెట్టి.. అవి సాధించిన అధికారులకు సన్మానించిన తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై కేసులు పెడుతోందని వ్యాఖ్యానించారు. నరిసిరెడ్డి చెప్పిన విషయాల్లో కొన్ని ఓకే కానీ.. విమర్శించటమే పనిగా పెట్టుకున్న ఆయన ఒకదానితో మరొకటి ముడేసి సంబంధం లేకుండా మాట్లాడటం సరికాదన్న మాట వినిపిస్తోంది. ఏమైనా రోజులు గడుస్తున్న కొద్దీ.. విమర్శలు చేసే అవకాశం అధికారపక్షం ఇస్తుందన్న మాటకు బలం పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుందని చెప్పాలి.