Begin typing your search above and press return to search.

బ్రాహ్మణి ఈ అడుగులు ఎక్కడి వరకు..? 2

By:  Tupaki Desk   |   21 Nov 2015 4:47 AM GMT
బ్రాహ్మణి ఈ అడుగులు ఎక్కడి వరకు..? 2
X
లోకేశ్ కు ఉన్న పరిమితుల్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించినట్లుగా చెబుతారు. ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించిన ఆయన.. తన మేనకోడలు కమ్ కోడలైన బ్రాహ్మణిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆమెను తాజాగా సేవా రంగంలోకి తీసుకొచ్చినట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పార్టీకి చెందిన నేతలు.. భర్త లోకేశ్ తోడ్పాటుతో పాటు.. తండ్రి బాలకృష్ణ ఎవరూ లేకుండా సొంతంగా తనకు తానుగా.. గ్రూప్ 1.. 2 విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇచ్చే అంశానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ కింద ప్రకటించటం తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కొద్దిపాటి మాటలు అందరిని ఆకట్టుకున్నాయి. విద్యాధికురాలిగా.. తన పరిధిని దాటకుండా.. వివాదాస్పదం కాకుండా.. హుందాగా వ్యవహరించే బ్రాహ్మణి మాటలు పలువుర్ని ఇట్టే ఆకట్టుకున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 1.. 2 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున తోడ్పాటును అందించటంతో పాటు.. వారికి శిక్షణ ఇవ్వటం. . బ్యాంకింగ్ ఉద్యోగాలకు కూడా తాము ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె ప్రకటించారు.

ప్రస్తుతానికి 60 మంది విద్యార్థులకు మాత్రమే కోచింగ్ ఇస్తున్నట్లు చెప్పిన బ్రాహ్మణి.. రానున్న రోజుల్లో ఈ సేవల్ని మరింత పెంచుతామన్న మాటను చెప్పారు. ఇక్కడ బ్రాహ్మణి మొదలు పెట్టిన సేవా కార్యక్రమం.. అంతిమంగా ప్రజాసేవ దిశగా అడుగులు పడతాయన్న వాదన వినిపిస్తోంది. పరిచయం అక్కర్లేని పేరు ప్రఖ్యాతులతో పాటు.. ఎన్టీఆర్ మనమరాలన్న ట్యాగ్ లైన్ ఉన్న బ్రాహ్మణి ఎంత చక్కగా మాట్లాడగలరన్న విషయం నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన తీరుతో చాలామందికి అర్థమైంది. మేనత్త పురంధేశ్వరి తరహాలో హుందాగా వ్యవహరించే బ్రాహ్మణి.. ఉన్నత విద్యను అమెరికాలో చేయటం తెలిసిందే.

ప్రజాకర్షణ పుష్కలంగా ఉన్న బ్రాహ్మణి కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలే కానీ.. ఆమెకు తిరుగు ఉందన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రాహ్మణికి సంబంధించిన అంచనాలు మరీ ఎక్కువగా అనిపించినా.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే అదెంత అవసరమన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఏది ఏమైనా.. సరే సమయంలో సరైన తీరులోబ్రాహ్మణి చేత సేవా కార్యక్రమాల్ని షురూ చేశారన్న మాట సర్వత్రా వినిపించటం గమనార్హం. రాజకీయాలకు సంబంధించినంత వరకూ కుమార్తెల్ని ప్రోత్సహించని ఎన్టీఆర్ తీరుకు పూర్తి భిన్నంగా..చంద్రబాబు కానీ బ్రాహ్మణిని ప్రోత్సహిస్తే.. అది తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు ఎంతో సాయం చేస్తుందన్న మాట వినిపిస్తుంది. బ్రాహ్మణి విషయంలో చంద్రబాబు ఏం చేస్తారన్నది కాలమే చెప్పాలి. ఏమైనా.. సేవా కార్యక్రమాలతో ప్రజలకు మరింత దగ్గర కానున్న బ్రాహ్మణికి ‘‘ఆల్ ద బెస్ట్’’ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.