Begin typing your search above and press return to search.

బ్రాహ్మ‌ణికి రాజ‌కీయ శిక్ష‌ణ ఎక్క‌డిస్తున్నారంటే...

By:  Tupaki Desk   |   6 April 2016 10:44 AM GMT
బ్రాహ్మ‌ణికి రాజ‌కీయ శిక్ష‌ణ ఎక్క‌డిస్తున్నారంటే...
X
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి రాజ‌కీయ తెరంగేట్రం ఖాయ‌మైంద‌నే వార్త‌లు వెలువ‌డుతున్న నేప‌థ్యంలో మ‌రింత ఆస‌క్తిక‌ర స‌మాచారం తెర‌మీద‌కు వ‌స్తోంది. ఆమెకు రాజ‌కీయ శిక్షణ ఇవ్వ‌డం కూడా మొద‌లైంద‌నేది తాజా వార్త సారాంశం.

రాబోయే ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఏపీ సీఎం చంద్రబాబు ఈ క్ర‌మంలో త‌న కుమారుడు నారా లోకేష్‌ ను పార్టీలో క్రియాశీలం చేశారు. అయితే ప్ర‌జాకర్ష‌ణ‌ - రాజ‌కీయ అవ‌గాహ‌న‌ - ఫాలోయింగ్ త‌దిత‌ర అంశాల్లో లోకేష్ వెనుక‌బ‌డ్డార‌నేది పలు సంద‌ర్భాల్లో నిజ‌మ‌ని తేలింది. ఈ నేప‌థ్యంలో పార్టీని క్రియాశీలంగా న‌డిపే నాయ‌కురాలిగా త‌న కోడ‌లు బ్రాహ్మ‌ణిని బాబు ఎంచుకున్నార‌ని స‌మాచారం. నంద‌మూరి కుటుంబ స‌భ్యురాలిగా - యువ‌ర‌త్న బాల‌కృష్ణ కుమార్తెగా ఆమెకు ఇప్ప‌టికే పార్టీలో, కుటుంబంలో గుర్తింపు ఉంది. స్టాన్‌ ఫర్డ్‌ లో ఎంబీఏ పూర్తి చేసి హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గా ఉన్న బ్రహ్మణి అటు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ కు ట్రస్టీగా కూడా ఉన్నారు.

బ్రాహ్మ‌ణి రాజ‌కీయ అరంగేట్రానికి సిద్ధ‌మైన నేపథ్యంలో ఆమెకు రాజకీయాలపై తర్ఫీదు ఇచ్చేందుకు నిపుణులను నియమించారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీకి చెందిన కొంతమంది ప్రముఖులు - సైకాలజిస్టులు ఇక్కడి బాబు ఫాంహౌస్‌ లో ప్రతి రోజూ శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. రాజకీయ ప్రసంగాలపై ఒక మాజీ విద్యార్థి సంఘం నాయకునితో సలహాలు ఇప్పిస్తున్నారని తెలిసింది. ఇదిలాఉండ‌గా బ్రాహ్మ‌ణి సైతం క్రియాశీలంగా తెర‌మీద‌కు వ‌స్తున్నారు. జెమిని చానల్‌ లో 'నేను సైతం' కార్యక్రమంలో బ్రహ్మణి ఇటీవల కనబడ్డారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈటివిలో ఆమె ఇంటర్వ్యూ ప్రసారమైంది. ఆ ప్రోగ్రామ్‌ లకు యుట్యూబ్‌ - ఫేస్‌ బుక్‌ - ఇతర ప్రసార మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం కల్పించారు. ఈ వరుస పరిణామాలు బ్రహ్మణి రాజకీయ అరంగేట్రానికి సంకేతాలని టీడీపీ వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.