Begin typing your search above and press return to search.

హిందూపురంలో బ్రాహ్మ‌ణి..నంద‌మూరి వంశానికి కితాబు

By:  Tupaki Desk   |   15 May 2017 5:47 PM GMT
హిందూపురంలో బ్రాహ్మ‌ణి..నంద‌మూరి వంశానికి కితాబు
X
ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు కోడ‌లు, నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌య నారా బ్రాహ్మణి హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. హెరిటేజ్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బ్రాహ్మ‌ణి అనంతపురం జిల్లా లేపాక్షిలోని హెరిటేజ్‌ సంస్థ రజతోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా బ్రాహ్మ‌ణి మీడియాతో మాట్లాడుతూ నంద‌మూరి వంశం గురించి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.

తెలుగుదేశం పార్టీకి, నంద‌మూరి వంశానికి హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క ప్రాధాన్య‌త ఉంద‌ని బ్రాహ్మ‌ణి తెలిపారు. తన తాత ఎన్టీఆర్, పెదనాన్న హరికృష్ణ, తండ్రి బాలకృష్ణలు ప్రాతినిథ్యం వహించిన హిందూపురం రావడం ఆనందంగా ఉందని వివ‌రించారు. వ్యాపారం, సంక్షేమం ల‌క్ష్యంగా హెరిటేజ్ ముందుకు సాగుతుంద‌ని చెప్పారు. 2022 నాటికి రూ.6వేల కోట్ల టర్నోవరే తమ లక్ష్యమని వెల్ల‌డించారు. హెరిటేజ్‌ సంస్థ రైతుల సంక్షేమం కోసం రైతు నిధి ఏర్పాటు చేసిందని పేర్కొంటూ ఈ నిధి ప్ర‌కారం ఎవరైనా రైతులు ప్రమాదవశాత్తు మృతి చెందితే సంక్షేమ నిధి నుంచి రూ.2లక్షలు అందిస్తామని బ్రాహ్మ‌ణి తెలిపారు. ఈ సంద‌ర్భంగా రైతులకు ప్రోత్సాహక బహుమతులను బ్రాహ్మణి అందించారు. దీంతోపాటుగా భర్తను కోల్పోయిన మహిళా రైతుల‌కు బ్రాహ్మణి రూ.2 లక్షల పరిహారం అందించారు. సంస్థ లాభాల బాటలో పయనించేందుకు కృషి చేస్తున్నారని సిబ్బందికి బ్రాహ్మణి కితాబిచ్చారు. అంద‌రితో క‌లిసి ముందుకు సాగాల‌ని హెరిజేట్ విధానమ‌ని బ్రాహ్మణి వివ‌రించారు.