Begin typing your search above and press return to search.

హెరిటేజ్‌పై రోజా వ్యాఖ్య‌లు.. బ్రాహ్మ‌ణి ఫైర్‌

By:  Tupaki Desk   |   6 July 2017 5:33 AM GMT
హెరిటేజ్‌పై రోజా వ్యాఖ్య‌లు.. బ్రాహ్మ‌ణి ఫైర్‌
X
రాజ‌కీయంగా స‌వాల‌చ్చ మాట‌లు అన్నా ఎప్పుడు రియాక్ట్ కావ‌టం త‌ర్వాత‌.. క‌నీసం ఆ ఊసు కూడా ఎత్త‌కుండా త‌న మానాన తాను వెళుతుంటారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కోడ‌లు.. మంత్రి లోకేశ్ స‌తీమ‌ణి బ్రాహ్మ‌ణి. హెరిటేజ్ ఫుడ్స్ కు ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆమె.. రాజ‌కీయ అంశాల మీద అస్స‌లు నోరు విప్ప‌రు. త‌న చుట్టూ రాజకీయ వాతావ‌ర‌ణం ఉన్న‌ప్ప‌టికీ ఆమె ఆ ఛాయ‌ల‌కు వెళ్ల‌కుండా.. రాజ‌కీయ అంశాలు త‌న ద‌గ్గ‌ర‌కు చేర‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంటారు.

అలాంటి ఆమె తాజాగా రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌పై పెద‌వి విప్పారు. త‌న భ‌ర్త‌ను.. మామ చంద్ర‌బాబును ఎంత‌టి రాజ‌కీయ విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు చేసినా స్పందించని బ్రాహ్మ‌ణి తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా వ్యాఖ్య‌ల‌పై రియాక్ట్ అయ్యారు. ఇటీవ‌ల హెరిటేజ్ ఫుడ్స్ వాహ‌నం (ఆ వాహ‌నంతో హెరిటేజ్ సంస్థ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని తేల్చారు)లో అక్ర‌మంగా ఎర్ర‌చంద‌నం త‌ర‌లిస్తుండ‌గా పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా రూ.5కోట్ల విలువైన ఎర్ర‌చంద‌నం దుంగ‌ల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఉదంతంపై ఆర్కే రోజా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. హెరిటేజ్ వాహ‌నంలో ఎర్ర‌చంద‌నం అక్ర‌మ త‌ర‌లింపుపై ఆరోప‌ణ‌లు చేశారు. ఓ ద‌శ‌లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఎర్ర చంద్రం అంటూ విమ‌ర్శ‌లు చేశారు. అయితే.. రాజ‌కీయ అంశాల్ని అస్స‌లు ప్ర‌స్తావించ‌ని బ్రాహ్మ‌ణి.. హెరిటేజ్ వాహ‌నంలో ఎర్ర‌చంద‌నం అంటూ చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వ‌టంతో పాటు.. కంపెనీని బ‌ద్నాం చేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చ‌రించారు. హెరిటేజ్ ఫుడ్స్ కు సంబంధించి ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేయ‌గా.. అందులో ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణాకు ఉప‌యోగించిన వాహ‌నంతో సంస్థ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేశారు. దీనిపై చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో అర్థం లేద‌ని.. ఆధారాలు లేకుండా విమ‌ర్శ‌లు చేస్తే కేసులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఎవ‌రైనా మాట్లాడేట‌ప్పుడు వాస్త‌వాల్ని ఒక‌సారి స‌రి చూసుకొని మాట్లాడాలే త‌ప్పించి.. సంస్థ ప్ర‌తిష్ట దెబ్బ తినేలా ఆరోప‌ణ‌లు చేస్తే మాత్రం చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. హెరిటేజ్ మీద రాజ‌కీయ వ్యాఖ్య‌ల్ని వ‌దిలే ప్ర‌స‌క్తే లేద‌న్న విష‌యాన్ని బ్రాహ్మ‌ణి త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మువుతోంది. మ‌రి.. హెరిటేజ్ మీద ఆరోప‌ణ‌లు చేసిన రోజా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.