Begin typing your search above and press return to search.

పాద‌యాత్ర సెంటిమెంట్ మ‌ళ్లీ హిట్టా ?

By:  Tupaki Desk   |   31 May 2022 11:30 PM GMT
పాద‌యాత్ర సెంటిమెంట్ మ‌ళ్లీ హిట్టా ?
X
టీడీపీ లీడ‌ర్ లోకేశ్ బాబు త్వ‌ర‌లో పాద‌యాత్ర చేప‌ట్టనున్నార‌న్న వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. గాంధీ జ‌యంతి నుంచి ఆయ‌న జనంలోకి వెళ్ల‌నున్నారు అని తెలుస్తోంది. పాద‌యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి..స‌మ‌స్య‌లు గుర్తించాల‌ని ఆయ‌న ప‌రిత‌పిస్తున్నారు. త‌ద్వారా పొలిటిక‌ల్ మైలేజ్ పొందేందుకు మార్గం సులువు అవుతుంద‌ని భావిస్తున్నారు.ఈ నేప‌థ్యంలో లోకేశ్ పాద‌యాత్ర ఏ మేర‌కు విజ‌య‌వంతం అవుతుంది.. అందుకు త‌గ్గ మంచి చెడులు ఏంట‌న్న‌వి చూద్దాం.

వాస్త‌వానికి రాష్ట్రంలో నెల‌కొన్న ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుగుణంగా మలుచుకోవాల‌న్నది టీడీపీ భావన. ఇందుకు త‌గ్గ కార్యాచ‌ర‌ణ అప్పుడే మొద‌ల‌యిపోయింది కూడా ! వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ బంప‌ర్ హిట్ కొట్టేందుకు ఉన్న ఏకైక అస్త్రం పాద‌యాత్ర. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉమ్మ‌డి రాష్ట్రంలో మూడు వేల కిలోమీట‌ర్ల‌కు పైగా పాద‌యాత్ర చేసి, నాటి ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకుని, వాటికి అనుగుణంగా త‌న పాల‌న‌ను అందించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశారు.


తర్వాత చంద్రబాబు పాదయాత్ర చేసి ఆ వయసులో అంద సుధీర్ఘ పాదయాత్ర చేసిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ప్రజలకు బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు రాహుల్ కూడా ఈ తర‌హా యాత్ర‌కే సిద్ధం అవుతున్నారు. కన్యాకుమారి నుంచి క‌శ్మీరు వ‌ర‌కూ చేప‌ట్టే యాత్ర లో రాహుల్ కూడా జ‌నాక‌ర్ష‌ణకే ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారు.

ఇక వైఎస్సార్ త‌రువాత ష‌ర్మిల పాద‌యాత్ర చేశారు. అన్న జైల్లో ఉండ‌గా ఆమె తిరుగులేని సాహ‌సంతో న‌డిచారు. మొద‌ట్లో ఆమెకు పెద్ద‌గా రెస్పాన్స్ రాక‌పోయినా క్ర‌మ‌క్ర‌మంగా జ‌నం రావ‌డం మొద‌లుపెట్టారు. ఆ విధంగా ఆమె స‌క్సెస్ అయ్యారు. షర్మిల త‌రువాత జగ‌న్ పాద‌యాత్ర చేప‌ట్టి జ‌నం క‌ష్టాలు తెలుసుకున్నారు.

యాత్ర‌లో భాగంగానే ప‌లు హామీలు ప్ర‌క‌టించి, ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకున్నారు. వీటిలో సాధ్యా సాధ్యాలు ఎంత అన్న‌ది ప‌ట్టించుకోకుండానే ఆయ‌న హామీలు ఇచ్చారు అన్న విమ‌ర్శ ఒక‌టి ఉంది. తాజాగా లోకేశ్ పాద‌యాత్ర‌తో టీడీపీకి కొత్త ఉత్సాహం రావ‌డం ఖాయం.

ఇప్ప‌టికే చాలా చోట్ల బాదుడే బాదుడు కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అయింది. అనూహ్య స్పంద‌న కొన్ని చోట్ల అందుకుంది. ఈ కార్య‌క్ర‌మం ఫ‌లితంగానే వైసీపీ మంత్రుల‌కు క్షేత్ర స్థాయిలో నిర‌స‌న‌లు ఎదుర‌వుతున్నాయి అన్న‌ది కూడా వాస్త‌వం. ఇప్పుడిదే జోష్ ను కంటిన్యూ చేస్తూ లోకేశ్ క‌నుక పాద‌యాత్ర చేప‌డితే టీడీపీ మైలేజీ పెర‌గ‌డం ఖాయ‌మంటూ ఆ పార్టీ అభిమానులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.