Begin typing your search above and press return to search.

బాబు బ‌స్సు యాత్ర‌.. ఫ‌లించేనా... సీనియ‌ర్ల త‌ర్జ‌న భ‌ర్జ‌న‌..!

By:  Tupaki Desk   |   6 Oct 2021 2:43 PM GMT
బాబు బ‌స్సు యాత్ర‌.. ఫ‌లించేనా... సీనియ‌ర్ల త‌ర్జ‌న భ‌ర్జ‌న‌..!
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబు త్వ‌ర‌లోనే ప్ర‌జాయాత్ర ప్రారంభించ‌నున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. 2012-13 మ‌ధ్య చంద్ర‌బాబు.. వ‌స్తు న్నా మీకోసం యాత్ర చేప‌ట్టారు. అప్ప‌టి ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన విధానాన్ని ఆయ‌న ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లారు. ఫ‌లితంగా త‌ర్వాత కాలంలో ఆయ‌న న‌వ్యాంధ్ర‌లో అధికారంలోకి వ‌చ్చేందుకు ఈ యాత్ర దోహ‌ద‌ప‌డింది. ఇటీవ‌లే ఈ యాత్ర‌కు తొమ్మిదేళ్లు నిండిన సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని హైద‌రాబాద్‌లో వేడుక‌లు కూడా చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు త్వ‌ర‌లోనే మ‌రో ప్ర‌జాయాత్ర‌కు సిద్ధంగా ఉండాల‌ని పార్టీ నేత‌ల‌కు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈయాత్ర‌ను ప్రారంభించ‌నున్న ట్టు తెలిపారు.

గ‌తంలో చేప‌ట్టిన వ‌స్తున్నా మీకోసం యాత్ర‌ను అనంత‌పురం జిల్లా హిందూపురం నుంచి ప్రారంభించిన‌ట్టుగానే ఈ ద‌ఫా కూడా అక్క‌డి నుంచే ప్రారంభించే అవ‌కాశం ఉంది. అయితే.. ఇప్పుడు పాద‌యాత్ర చేస్తారా? లేక మొత్తం బ‌స్సు యాత్ర చేప‌డ‌తార‌? అనేది సందేహం. దీనిపై క్లారిటీ ఇవ్వ‌లేదు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో చంద్ర‌బాబు బ‌స్సు యాత్ర‌కే ప్రాధాన్యం ఇస్తార‌నే చ‌ర్చ సాగుతోంది. వాస్త‌వానికి యాత్ర‌లు చేయ‌డం ద్వారా అధికారంలోకి రావ‌డం అనేది.. మ‌న రాష్ట్రాల్లో కొత్త‌కాదు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ కూడా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా.. పాద‌యాత్ర చేసి.. ప్ర‌జ‌ల‌ను క‌లుకున్నారు. అనంత‌రం అధిక మెజారిటీతో అధికారంలోకి వ‌చ్చారు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు యాత్ర‌కు రెడీ అవుతున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. బాబు చేప‌డుతున్న యాత్ర స‌క్సెస్ అవుతుందా? అనేది సీనియ‌ర్ నేత‌ల మ‌ధ్య సాగుతున్న చ‌ర్చ‌. దీనికి రెండు కార‌ణాలు ఉన్నాయి. గ‌తంలో వ‌స్తున్నా మీకోసం యాత్ర స‌క్సెస్ కావ‌డానికి ఉన్న కార‌ణాలు వేరని అంటున్నారు. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో సీనియ‌ర్ నాయ‌కుడిగా.. అనుభ‌వం ఉన్న మాజీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌జ‌లు ఆయ‌న‌కు జై కొట్టారు. అయితే.. ఇప్పుడు ఆయ‌న పాద‌యాత్ర చేసేందుకు ప్ర‌త్యేక కార‌ణాలు ఏమీ లేవ‌ని తెలుస్తోంది. కేవ‌లం జ‌గ‌న్‌ను సెంట్రిక్‌గా చేసుకుని.. మాత్ర‌మే ఆయ‌న ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలి.

అయితే.. జ‌నంలో జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త ఉందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఉన్నా.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గంలోను.. ఉన్న‌త‌స్థాయి వ‌ర్గాల్లోనే జ‌గ‌న్ పాల‌న‌పై వ్య‌తిరేక‌త ఉంది. వీరు ఎలాగూ.. ఓటు వేసేందుకు వ‌చ్చేది 40 శాత‌మే. మిగిలిన పేద వ‌ర్గాల్లో జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. రాష్ట్రం అప్పుల పాల‌వుతోంద‌ని చెబుతున్నా.. ఎవ‌రు మాత్రం త‌క్కువ చేశారు? అనే ప్ర‌శ్న వ‌స్తోంది. అంతేకాదు.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు పాల‌కులే తిన్నారు.. ఇప్పుడు మాకు పెడుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. అంటే.. జ‌గ‌న్ ఇస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌జ‌ల్లో సానుకూల కోణ‌మే ఉంది. ఈ క్ర‌మంలో జ‌నంలోకి వెళ్లినా.. అప్పులు ఎందుకు చేస్తున్నార‌నే విష‌యంలో పూర్తిగా ప్ర‌జ‌ల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నం చేయ‌లేని ప‌రిస్థితి మీకు సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేసి.. వేల కొద్దీ నిధులు మీకు ఇస్తున్నందున రాష్ట్రం అప్పుల పాల‌వుతోంద‌ని బాబు చెప్పే సాహ‌సం చేయ‌లేరు.

అయితే.. రాజ‌ధాని అమ‌రావ‌తి.. పోల‌వ‌రం.. అభివృద్ది ఈ మూడు అంశాల‌నే అజెండా చేసుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్తే మాత్రం ఆయ‌న స‌క్సెస్ అయ్యే అవ‌కాశం ఉంది. దీనికి కూడా నిన్న మొన్న‌టి వ‌ర‌కు అంటే రెండున్న‌రేళ్ల వ‌ర‌కు మీరే అధికారంలో ఉన్నారు.. అప్పుడు చేయ‌ని అభివృద్ధిపై ఇప్పుడు మాట్లాడినా.. ప్ర‌యోజ‌నం ఉంటుందా? అనేది కూడా ప్ర‌శ్నే. ఇక‌, పార్టీ ప‌రంగా చూసుకుంటే.. యాత్ర‌కు పెద్ద ఎత్తున నిధుల స‌మీక‌ర‌ణ ఈ ద‌ఫా క‌ష్ట‌మేన‌ని తెలుస్తోంది. ఈ కార‌ణాల‌తో బాబు చేప‌ట్టే ప్ర‌జాయాత్ర ఏమేర‌కు స‌క్సెస్ అవుతుంద‌నేది చ‌ర్చ‌కు దారితీస్తోంది. చూడాలి ఏం చేస్తారో!!