Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ జోష్ లెక్క తేల్చాలంటే బాబును సీన్లోకి తేవాల్సిందేనా?

By:  Tupaki Desk   |   9 July 2021 3:30 PM GMT
కాంగ్రెస్ జోష్ లెక్క తేల్చాలంటే బాబును సీన్లోకి తేవాల్సిందేనా?
X
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అధినేతలైన వారిని అంత త్వరగా టచ్ చేయటానికి.. టార్గెట్ చేసేందుకు కాస్త జంకటం కనిపిస్తుంది. అందుకు భిన్నంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పరిస్థితి ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్ని చూస్తే.. ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఎలా అయితే.. సోషల్ మీడియాలో పంచ్ ఎవరికి వేయాలన్నా.. వాడేందుకు బ్రహ్మానందం ఫోటో ఇట్టే సూట్ అవుతుందో.. అదే తీరులో తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు ఏ సందర్భంలో అయినా ఇరికించే వీలుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకునే ఏ రాజకీయ పరిణామంలో అయినా ఆయన్ను ఇట్టే ముగ్గులోకి తీసుకొచ్చేయొచ్చు. ఆయన మీద ఎన్ని అభాండాలు వేసినా.. నిజమే అన్నట్లుగా ఉండటమే కాదు.. ప్రజలు కూడా నమ్మేసే వీలు ఉంటుంది.

2018 ఎన్నికల్నే తీసుకుంటే.. తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న కేసీఆర్.. చంద్రబాబును బూచిగా చూపించి తెలంగాణ సెంటిమెంట్ ను రాజేయటం.. అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. ఇలా బాబును నమ్ముకున్న ఏ రాజకీయ ప్రత్యర్థి కూడా చెడిపోయింది కనిపించదు. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ఎవరు తిట్టిపోసినా కూడా.. నిజమే కదా.. ఇన్ని తప్పులు చేయగలిగింది చంద్రబాబే అన్న నమ్మకం కలుగక మానదు. మొత్తంగా చూస్తే.. పద్నాలుగున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పదవీ బాద్యతలు చేపట్టినా.. ఆయన్ను తిట్టినంత తీవ్రంగా ఇప్పటివరకు మరే రాజకీయ అధినేత తిట్టించుకోలేదని చెప్పాలి.

ఇవాల్టి రోజున తెలంగాణ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. తెలంగాణ ద్రోహి అన్నంతనే చంద్రబాబు బూచి చూపిస్తారు. కానీ.. ఇదే చంద్రబాబు కానీ తెలంగాణకు తాను అనుకూలమని లేఖ ఇచ్చిన తర్వాత మాత్రమే తెలంగాణ రాష్ట్ర సాధన కీలక మలుపు తిరగటమే కాదు.. కాంగ్రెస్ సైతం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఒకవేళ.. చంద్రబాబు కానీ లేఖ రాసి ఉండకపోతే.. తెలంగాణ వచ్చేది కాదన్నది మర్చిపోకూడదు. ఇదెంత నిజమన్నది గుర్తుకు తెచ్చుకోవాలంటే ఇవాల్టి రోజున పొడుగు మాటలు మాట్లాడే మంత్రి హరీశ్ రావు.. అప్పట్లో ఒక సవాలు కూడా విసిరారు.

చంద్రబాబు కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాస్తే.. తాను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నాలుగో తరగతి ఉద్యోగిగా పని చేయటానికైనా సిద్ధమేనని చెప్పటం మర్చిపోకూడదు. అయితే.. ఈ మాటలన్ని కూడా చంద్రబాబు లేఖ ఇచ్చినంత వరకే. ఒకసారి లేఖ ఇచ్చిన తర్వాత ఆయన నోటి మాటలన్ని మారిపోవటమే కాదు.. ఇప్పుడు పాత విషయాల్ని ప్రస్తావిస్తే.. సమాధానం కూడా చెప్పరేమో? ఇలా అందరి చేత తిట్టించుకోవటం బాబుకు మాత్రమే సాధ్యమేమో. తాజాగా రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా ఎంపిక చేసిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ ఒక్కసారిగా పెరిగిపోవటం మర్చిపోకూడదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పొన్నాల లక్ష్మయ్య.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరిని పీసీసీ చీఫ్ లుగా ఎంపిక చేసినప్పుడు కూడా ఇలాంటి ఉత్తేజం పార్టీలో లేదు. ఆయన పార్టీ రథసారధిగా చేసిన పదవీ ప్రమాణస్వీకారం తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. గతంలో ఎప్పుడూ లేని ఈ ఊపు కాంగ్రెస్ నేతల్లో కొత్త ఆశలు చిగురించేలా చేస్తే.. అంత పెద్ద గులాబీ పార్టీకి ఇబ్బందికరంగా మారిందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. టీఆర్ఎస్ నేతలకు అక్కరకు వచ్చిన పేరు.. చంద్రబాబే. నిన్నటికి నిన్న మంత్రి కేటీఆర్ కావొచ్చు.. ఈ రోజున మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. బాబు భుజాల మీద గన్ పెట్టి కాంగ్రెస్ ను టార్గెట్ చేయాలన్న ఆలోచనలో కారు పార్టీ నేతలు ఉన్నట్లుగా చెప్పక తప్పదు.

కాంగ్రెస్ ముసుగులో చంద్ర‌బాబు మ‌ళ్లీ తెలంగాణ‌లోకి వ‌స్తున్నార‌ని.. టీడీపీ ముఖం పెట్టుకుని వ‌స్తే తెలంగాణ ప్ర‌జ‌లు రానివ్వ‌ర‌న్న మాటను చూస్తే.. అసలు విషయం ఇట్టే అర్థం కాక మానదు. అంతేకాదు.. తన మనుషులను కాంగ్రెస్ లోకి పంపి రాష్ట్రంలో చంద్రబాబు అడుగు పెడుతున్నారన్న హరీశ్.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలవాలని ప్రయత్నించిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పట్లో తెలంగాణ ప్రజలు చంద్రబాబును తరిమేశారన్నారు. కాంగ్రెస్ పార్టీలో తన వాళ్లకు చంద్రబాబు పదవులు ఇప్పించుకుంటున్నారని.. ఓటుకు నోటు కేసులో నిందితుడైన రేవంత్ కు చంద్రబాబు అత్యంత సన్నిహితుడన్న ఆయన వ్యాఖ్యను చూస్తే.. బాబు బూచిని చూపించి తెలంగాణ కాంగ్రెస్ ను మరోసారి దెబ్బేయాలన్న ఆలోచనలో ఉన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. మరి.. ఈ ఎత్తులకు తెలంగాణ ప్రజలు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.