Begin typing your search above and press return to search.

బాబు బుర్రే బుర్ర... ఒక్క దెబ్బకు ఇద్దరికి చెక్...?

By:  Tupaki Desk   |   20 Dec 2021 5:30 PM GMT
బాబు బుర్రే బుర్ర... ఒక్క దెబ్బకు ఇద్దరికి చెక్...?
X
చంద్రబాబుది మాస్ట‌ర్ మైండ్ అని అందుకే అన్నది. ఆయనకు తెలిసిన రాజకీయం ఎవరికీ తెలియదు. బాబు మంత్రదండం పట్టుకోవాలే కానీ ప్రత్యర్ధులు చిత్తు కావాల్సిందే. ఆయనకు ఏపీ రాజకీయాల మీద పూర్తి పట్టుంది. ఏ నియోజకవర్గం కధేంటో, దాని సంగతేంటో బాబుకు ఉన్న అవగాహనకు శభాష్ అని తీరాల్సిందే. ఇదంతా ఎందుకంటే టీడీపీకి ఆయువు పట్టు లాంటి క్రిష్ణా జిల్లాలో బాబు అనుసరించబోతున్న మహత్తరమైన రాజకీయం గురించి చెప్పుకునేందుకే.

చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో విజయం అవసరం. అది కూడా అలాంటిది ఇలాంటిది కాదు, ప్రత్యర్ధి వర్గాలకు హడల్ పుట్టించేలా. అదే సమయంలో తనను నానా మాటలూ అంటూ తనతో పెట్టుకున్న వారందరి లెక్కలు తేల్చి చుక్కలు చూపించాల్సిందే. ఇదీ బాబు మార్క్ పాలిటిక్స్. అందుకే ఆయన ఇపుడు క్రిష్ణా జిల్లా రాజకీయాలను దగ్గర పెట్టుకుని మరీ కధ మొత్తం తనకు అనుకూలంగా తిప్పేయబోతున్నారు.

క్రిష్ణా జిల్లా టీడీపీకి కంచుకోట. ఒక బలమైన సామాజికవర్గం టీడీపీనే దశాబ్దాలుగా అట్టిపెట్టుకుని సైకిలెక్కి స్వారీ చేసిన జిల్లా. అలాంటి జిల్లాలో 2019 ఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చాయి. అమరావతి రాజధాని నడిబొడ్డున్న ఉన్న ఈ జిల్లా సైకిల్ పార్టీకి హ్యాండ్ ఇచ్చేసింది. అంతే కాదు, టీడీపీ తరఫున గెలిచిన వల్లభనేని వంశీ లాంటి వారు ఏకంగా చంద్రబాబునే సవాల్ చేస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీ వైసీపీలో చేరి బాబు పుట్టు పూర్వోత్తరాలను పూర్తిగా చెప్పాలని చూస్తున్నారు.

మరి చంద్రబాబు లాంటి ఉద్ధండ రాజకీయ పండితుడి విషయంలో వారు చేసేది కచ్చితంగా దుస్సాహసమే. మరి దానికి తగిన ఫలితం చూపించాలని కోరిక బాబు లాంటి వారికి ఉండడంతో తప్పే లేదు కదా. అందుకే చంద్రబాబు నాడు అభిమన్యుడిని మట్టుపెట్టడానికి ద్రోణాచార్యుడు పన్నిన పద్మవ్యూహాన్నే మరపించే తీరున గట్టి వ్యూహాన్ని పన్నుతున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా గన్నవరంలో టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసలు గెలవకూడదు. ఆయన ఓడి వాడిపోవాల్సిందే.

దాని కోసం బాబు వేస్తున్న స్కెచ్ అదుర్స్ అనకతప్పదు. ప్రస్తుతం విజయవాడ తూర్పు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గద్దే రామ్మోహన్ ని వల్లభనేని వంశీని ఓడించడానికి బాబు ఏరి కోరి మరీ అక్కడికి పంపుతున్నారు. ఇంతకీ రామ్మోహన్ కి గన్నవరంలో పట్టు గుట్టూ ఏంటి అంటే దానికి కూడా ఒక కధ ఉంది. ఆయన 1994లోనే ఎన్టీయార్ వేవ్ ని కూడా తట్టుకుని ఇండిపెండెంట్ గా గన్నవరంలో గెలిచి తన సత్తా చాటారు. పైగా ఆయన పట్ల అక్కడ జనంలో మంచి అభిప్రాయం ఉంది.

మాజీ ఎమ్మెల్యేగా చేతల మనిషిగా సౌమ్యుడిగా జనాలు గుర్తించి గౌరవిస్తారు. ఇపుడున్న పరిస్థితుల్లో రామ్మోహన్ కనుక గన్నవరానికి షిఫ్ట్ అయితే కచ్చితంగా వల్లభనేని వంశీ మీద గెలిచి తీరుతారు అన్న లెక్కలు కూడా బాబు దగ్గర ఉన్నాయట. ఇక ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ తూర్పు నియోజకవర్గం సంగతేంటి అన్న చర్చ రావడమే కాదు అక్కడ చోటు చేసుకోబోయే పరిణామాలు కూడా ఆసక్తికరం అని చెప్పాలి.

విజయవాడ తూర్పు నుంచి వంగవీటి రంగా వారసుడు, మాజీ ఎమ్మెల్యే రాధాక్రిష్ణను చంద్రబాబు బరిలో నిలపనున్నారు. తూర్పు నియోజకవర్గం నుంచే రంగా ఒకసారి, రాధా తల్లి రత్నకుమారి రెండు సార్లు, రాధా ఒకసారి ఎమ్మెల్యేలుగా గెలిచి సొంత సీటుని చేసేసుకున్నారు. అక్కడ పట్టున్నా కూడా వైసీపీ, టీడీపీ గతంలో రాధాకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన పొలిటికల్ గా చాలా ఫీల్ అవుతున్నారు. ఇపుడు ఆయన చిరకాల కోరికను తీర్చే పనికి బాబు రెడీ అయ్యారు.

ఒక్కసారి తూర్పులో కనుక రంగాని దింపితే సీటు గెలిచి రావడమే అన్న ధీమా కూడా ఆయనకు ఉందిట. ఇక తూర్పులో గత రెండు ఎన్నికల్లోనూ టీడీపీయే విజయం సాధించింది. దాంతో రంగా సరైన అభ్యర్ధి, పైగా రంగా కుమారుడికి కోరిన చోట సీటు ఇస్తే ఆయన వెనక ఉన్న బలమైన సామాజిక వర్గం కూడా పూర్తి స్థాయిలో టీడీపీ వైపు టర్న్ అవుతుంది అన్న లెక్కలు కూడా బాబుకు ఉన్నాయట. ఇదే తూర్పులో మరో పెద్ద ట్విస్ట్ ఉంది

ఇక్కడ నుంచి దేవినేని అవినాష్ వైసీపీ తరఫున ఈసారి పోటీ చేయబోతున్నారు. ఆయన మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కొడుకు. గత ఎన్నికల్లో ఆయన్ని గుడివాడ నుంచి టీడీపీ తరఫున బాబు దింపారు, కానీ ఓడిపోయారు. ఆ వెంటనే ఆయన వైసీపీలోకి జంప్ అయ్యారు. దాంతో తాను రాజకీయంగా చాన్స్ ఇస్తే తననే ధిక్కరించిన అవినాష్ కి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని బాబుకు ఉందిట. ఆ పనిని ఆయన రాధా ద్వారా నెరవేర్చబోతున్నారు అంటున్నారు. మొత్తంగా చూస్తే చంద్రబాబు రాజకీయానికి ఇటు తూర్పు, అటు గన్నవ‌రం సీట్లు దక్కడమే కాదు, ప్రత్యర్ధులుగా ఉన్న‌ వంశీ, అవినాష్ ల ఓటమి కూడా జరిగిపోతుంది. అదీ బాబు మార్క్ లెక్క అంటే అంటున్నారు. సో ఈ మార్పు కోసం అంతా వేచి చూడాల్సిందే మరి.