Begin typing your search above and press return to search.

కాషాయం వద్దు... కామ్రెడ్స్ ముద్దు... ?

By:  Tupaki Desk   |   8 March 2022 11:30 PM GMT
కాషాయం వద్దు... కామ్రెడ్స్  ముద్దు... ?
X
ఏపీలో తెలుగు రాజకీయం మారుతోందా. అంటే కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కొన్ని వ్యవస్థలను గౌరవిస్తుంది. ఆ పార్టీది సుదీర్ఘ చరిత్ర. అయితే ఎపుడూ సభా సంప్రదాయలను కాదని ముందుకు సాగింది లేదు. అలాంటి టీడీపీ ఒక్కసారిగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మీద బడ్జెట్ కాపీలను విసిరింది. గో బ్యాక్ గవర్నర్ అంటూ సభను హోరెత్తించింది.

గవర్నర్ అంటే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అని అందరికీ తెలిసిందే. పైగా ఆయన ఒడిషాకు చెందిన సీనియర్ బీజేపీ నేత. ఆరెస్సెస్ నేపధ్యం ఉన్నవారు. దాదాపుగా తొమ్మిది పదులకు చేరువలో ఉన్న పెద్దాయన బిశ్వభూషణ్ ఏపీకి రెండేళ్ల క్రితం గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మధ్య దాకా జగన్ సర్కార్ కి సంబంధించి ప్రతీ విషయం మీద ఆయనకు ఫిర్యాదులు చేస్తూ వచ్చిన టీడీపీ ఒక్కసారిగా స్టాండ్ మార్చేసి గవర్నర్ కి రెడ్ సిగ్నల్ చూపించడం అంటే ఏపీలో రాజకీయాన్ని మార్చే గేమ్ ప్లాన్ అని అంటున్నారు.

గవర్నర్ ని అంటే కచ్చితంగా మోడీకి కన్నెర్ర అవుతారు. అమిత్ షా మూడవ కన్ను తెరుస్తారు. ఇప్పటికే తెలంగాణాలో కేసీయార్ గవర్నర్ తమిళ్ సై ని బడ్జెట్ సమావేశాలకు పిలవకుండా అవమానించారు. సరిగ్గా అదే టైమ్ లో ఏపీలో టీడీపీ చంద్రుడు కూడా ఇలా చేయడం అంటే యాంటీ బీజేపీ స్టాండేనా అన్న చర్చ అయితే వస్తోంది.

ఇదిలా ఉంటే తాను ఎంత తగ్గినా గ్రీన్ సిగ్నల్స్ పంపుతున్నా కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదని చంద్రబాబుకు బాధ ఉందని అంటున్నారు. పైగా జగన్ కి మద్దతుగా కేంద్రం ఉందన్న అనుమానాలూ ఉన్నాయి. దాంతో ఎటూ మోడీ క్రేజ్ తగ్గుతున్న వేళ 2019 నాటి ఫార్ములానే 2024 ఎన్నికలకు ఏపీలో ఎందుకు అమలు చేయకూడదు అని బాబు చాలా గట్టిగానే థింక్ చేస్తున్నారు అని అంటున్నారు.

దాంతోనే ఆయన గో బ్యాక్ గవర్నర్ అని తన ఎమ్మెల్యేల చేత అసెంబ్లీలో అనిపించగలిగారు అని చెబుతున్నారు. ఇక బాబు ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా క్లారిటీగా ఉందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పాటు కామ్రేడ్స్ తో కలసి ఒక కూటమిగా ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని బాబు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. పైగా ఏపీలో కాషాయం పార్టీ కంటే కూడా ఎర్రన్నలే బెటర్ అని కూడా బాబు అంచనాగా ఉందిట. నియోజకవర్గానికి వేయికి తక్కువ లేకుండా ఓట్లు వారికి కార్మిక సంఘాల ద్వారా ఉన్నాయని లెక్కలేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఎటు చూసుకున్నా కూడా టఫ్ ఫైట్ జరుగుతుందని, అలాగైతే వేయి లోపు సీట్లు పోయే ప్రతీ చోట కామ్రెడ్స్ తమ భుజం కాస్తే విజయం తమ సొంతం అవుతుంది అని కూడా బాబు మాస్టర్ స్కెచ్ వేస్తున్నారు అని తెలుస్తోంది. సో బీజేపీకి బాబు రాం రాం అంటారా. చూడాలి మరి.