Begin typing your search above and press return to search.

దుష్ట చతుష్టయం...బాబుని లైట్ తీస్కో...?

By:  Tupaki Desk   |   29 April 2022 6:00 AM IST
దుష్ట చతుష్టయం...బాబుని లైట్ తీస్కో...?
X
ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితం బీహార్ కి లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన జనం నుంచి వచ్చిన నాయకుడు. లోక్ నాయక్ జయ ప్రకాష్, రాం మనోహర్ లోహియా లాంటి వారి శిష్య రికంలో 1977 జనతా పార్టీలో చేరి ఎమర్జెన్సీ రోజుల్లో నాటి ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎదిరించిన అనాటి యువ నేత. ఆయన 1990 ప్రాంతంలో బీహార్ కి సీఎం అయ్యారు. ఆయన ఒక సందర్భంగా ఎందుకో కానీ బాబు మీద హాట్ హట్ గా కామెంట్స్ చేశారు. నాడు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబును ఉద్దేశించి ఆయన మీడియా బేబీ అని ఘాటు మాట ఒకటి వాడేశారు. అంటే బాబు మీడియా క్రియేట్ చేసిన నాయకుడు తప్ప జన బలం ఉన్న వారు కాదు అన్నది ఈ బీహారీ బాబు ఆ రోజులలో చేసిన ఆరోపణ అన్న మాట.

ఇపుడు అదే విధంగా అవే మాటలను కొత్త కొత్త పదాలతో జనాల ముందు పెడుతున్నారు ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ఆయన చంద్రబాబు ని లైట్ తీస్కో అంటున్నారు. ఎంతలా అంటే అసలు ఆయనకు ఏ మాత్రం రాజకీయ బలం లేదన్నట్లుగా క్యాడర్ కి చెబుతున్నారు. తాజాగా జరిగిన పార్టీ నేతల సమావేశంలో కూడా చంద్రబాబుని ఏ కోశానా ఏ రూపేణా కూడా పట్టించుకోవద్దు అనేస్తున్నారు.

అయితే బాబు వెనక ఉన్న మీడియా మోతుబరులను మాత్రం టార్గెట్ చేయాల్సిందే అని హెచ్చరిస్తున్నారు. వారితోనే అసలైన ముప్పు అని జగన్ గుర్తు చేస్తున్నారు. వారికి బాబు సీఎం కావాలి, జగన్ గద్దె దిగిపోవాలి. అందుకోసం వారు ఎన్ని అయినా చేస్తారు, ఏమైనా రాతలు వారి మీడియాలో రాస్తారు, టీవీలలో చూపిస్తారు. కనుక వారితోనే కడు ప్రమాదం కాబట్టి బహు పరాఖ్ అని జగన్ వైసీపీ లీడర్లకు జాగ్రత్తలు చెబుతున్నారు.

లోతుగా ఆలోచిస్తే ఇందులో బహుముఖమైన రాజకీయం దాగుతుంది. అదెలా అంటే చంద్రబాబు జనం నుంచి వచ్చిన నేత కాదు, ప్రజల మెచ్చుకోలు అందుకున్న నాయకుడు కాదు అని చెప్పాలన్నది జగన్ అసలు ఉద్దేశ్యం. ఆయన గెలవడం అంతా మీడియా మేంజేమ్మెంట్ లోనే ఉందని లోగుట్టు విప్పడం. ఆ విధంగా చెప్పడం ద్వారా బాబు రాజకీయంగా కడు బలహీనుడు అన్న సందేశం ఇటు పార్టీ క్యాడర్ కి పంపడం ద్వారా వారిని తగినంత బూస్టింగ్ ఇవ్వడం.

అదే టైమ్ లో ప్రజలకు కూడా చంద్రబాబుకు అసలైన రాజకీయ బలం ఏమీ లేదని, అది ఎక్కడా పెరగలేదని, కేవలం ఆయన అనుకూల మీడియాలో మాత్రమే తన కొరకు వీలుగా వాలుగా రాతలు రాయించుకుంటున్నాడు అని చెప్పడం అన్న మాట. అంటే ఇండైరెక్ట్ గా ఏపీలో వైసీపీ మాత్రమే బలంగా ఉంది. జనంలో ఉన్న పార్టీ తమదే అని చెప్పుకోవడం, ఇక తాను జనం నేతగా ఆవిష్కరించుకోవడం. అదే టైంలో ఎన్నడూ లేని విధంగా మీడియా ముసుగు తొలగించి వారికి పూర్తిగా బట్టబయలు చేయడం.

ఇంతకాలం చంద్రబాబునే విమర్శిస్తున్న వైసీపీ శ్రేణులు ఇక మీదట గడప గడపకూ వైసీపీ కార్యక్రమం ద్వారా తిరుగుతూ బాబు, ఆయన అనుకూల మీడియా మీద కూడా గురి పెడతారు అన్న మాట. అలా చేయడం ద్వారా న్యూట్రల్ గా వారు ఏ మాత్రం ఉండడం లేదని చాటింపు వేస్తారు అన్న మాట. దాంతో ఆ మీడియా మోతుబరులు ముందు తమ గురించి తాము పోరాడేలా చేస్తారు అన్న మాట.

అపుడు వారే ఇబ్బందుల్లో పడి నేరుగానే రాజకీయ సమరం చేయాల్సిన పరిస్థితిని తేవడం ఇంకో అజెండా. మొత్తానికి మీడియా బేబీస్ ని ఏపీలో జనాల ముందు నిలబెట్టాలని, తాను మాత్రమే సిసలైన ప్రజా నాయకుడిని అని చెప్పుకోవడానికి ఈ దుష్ట చతుష్టయం పదాన్ని జగన్ ప్రయోగిస్తున్నారు. మరి సమాస భూయిష్టమైన ఈ పద ప్రయోగం జనాలకు ఎంత వరకూ రీచ్ అవుతుంది. వైసీపీ శ్రేణులు చేస్తున్న ఈ కొత్త పోరాటం ఏ రకమైన ఫలితాన్ని సాధిస్తుంది అన్నది రాజకీయ తెర మీద చూడాల్సిందే.