Begin typing your search above and press return to search.

పెట్రోల్ బాదుడులో రాష్ట్రం ముందు: చంద్ర‌బాబు ఫైర్‌

By:  Tupaki Desk   |   23 May 2022 11:48 AM GMT
పెట్రోల్ బాదుడులో రాష్ట్రం ముందు:  చంద్ర‌బాబు ఫైర్‌
X
రాష్ట్రంలో ప్రజలకు భారంగా మారిన పెట్రో ధరలు తగ్గించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ తగ్గించినప్పటికీ.. రాష్ట్ర సర్కార్ పెట్రో బాదుడు నుంచి ఉపశమనం కలిగించలే దని చంద్రబాబు మండిపడ్డారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలపై కేంద్రం నిర్ణయం అభినందనీయమ న్నారు.రాష్ట్రంలో భారంగా మారిన పెట్రో ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం.. అదనపు పన్నులతో మరింత బాదేస్తోందని మండిపడ్డారు.

పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల నుంచి దేశ ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. అదే సమయంలో ఆయా రాష్ట్రాలను కూడా పన్నులు తగ్గించుకుని ప్రజలకు మేలు చేయమంటూ కేంద్రం పిలుపునివ్వడం ప్రశంసనీయం అన్నారు. తెలుగుదేశం హయాంలో అభివృద్ధిలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం.. ఇప్పుడు పెట్రో బాదుడులో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు.

'పెట్రో ధరల బాదుడుతో సామాన్యుడి జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుంది. నిత్యావసర వస్తువుల ధరల భారానికి ఇది కారణం అవుతుంది. ఎన్ని విజ్ఞప్తులు చేసినా.. ప్రజలు భారం మోయలేక పోతున్నా.. ప్రభుత్వం మాత్రం పెట్రో బాదుడు నుంచి ఉపశమనం కలిగించలేదు. గతేడాది చివరిలో దేశంలో అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సొంత పన్నులు తగ్గించుకున్నాయి. ఏపీలో ఇప్పటికీ పైసా తగ్గించకపోగా.. అదనపు పన్నులతో మరింత బాదేస్తున్నారు. కేంద్రం పెట్రోల్‌పై రూ.8లు, డీజిల్‌పై రూ.6లు పన్ను తగ్గించుకుంది. ఇప్పటికే రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో పన్నులు తగ్గించాయి. మరి ఏపీ ప్రజలు ఏం పాపం చేశారు. వైసీపీ ప్రభుత్వం వెంటనే పన్ను తగ్గించుకుని రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించాలి`` అని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు.

ఐదు ల‌క్ష‌ల సాయం

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి తెలుగుదేశం పార్టీ రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. బాధిత కుటుంబానికి పార్టీ తరపున ఈ సాయం అందజేస్తున్నట్లు అధినేత చంద్రబాబు తెలిపారు. ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ను ఇప్పటికీ అరెస్టు చేయకపోవ డంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు బహిరంగంగా తిరుగుతున్నా.. అరెస్టు చేయకపోవడంతో బాధితుల అనుమానాలకు బలం చేకూర్చేలా ఉందని చంద్రబాబు అన్నారు. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుల అరెస్టు కోసం దళిత సంఘాలతో కలిసి టీడీపీ తదుపరి కార్యాచరణకు సిద్దం అవుతుందన్నారు.