Begin typing your search above and press return to search.

బాబు తో గేమ్స్ : ఎవరూ కోరని కోరికతో పవన్ ..?

By:  Tupaki Desk   |   5 Jun 2022 10:50 AM GMT
బాబు తో గేమ్స్ :  ఎవరూ కోరని కోరికతో పవన్ ..?
X
చంద్రబాబును అందుకే అపర చాణక్యుడు అని పిలిచేది. ఆయన రాజకీయ జీవితం చూసిన వారు ఎవరైనా ఆయన నుంచి ఏది ఆశించకూడదు అన్నది పూర్తిగా తెలుసుకుంటారు. చంద్రబాబు అనబడే నాయకుడు అధికారం కోసం ఎంతైనా చేస్తాడు, ఏమైనా చేస్తాడు అన్నది చరిత్ర పుటలలో పదిలంగా ఉన్న కఠిన వాస్తవం.

అందుకు 1995 ఎన్టీయార్ వెన్నుపోటు ఎపిసోడ్ ఒక్కసారిగా తిరగేసి చదువుకుంటే చాలు. చంద్రబాబు 1978లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి కేవలం రెండేళ్ల వ్యవధిలో మంత్రి అయ్యారూ అంటేనే ఆయన రాజకీయ చాకచక్యం అర్ధం చేసుకోవాలి కదా. ఇక టీడీపీలో లేటుగా చేరినా కేవలం పదేళ్ల వ్యవధిలో అదే పార్టీకి ప్రెసిడెంట్ గా మారారు. ముఖ్యమంత్రి పదవిని కూడా అందుకున్నారు.

ఈ మధ్యలో చంద్రబాబు చేతులలో చేతలలో పడి ఒక దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఒక నందమూరి హరిక్రిష్ణ, కళ్ళ ముందు బావమరిది కమ్ వియ్యంకుడుగా ఉన్న బాలక్రిష్ణ వీరంతా ఏమయ్యారు అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ఇక బాబుతో పొత్తులు పెట్టుకున్న పార్టీలు కలిశానికైనా మిగిలాయా అన్నది కూడా చూస్తే చరిత్ర చెప్పే పాఠాలు ఎన్నో కనిపిస్తాయి.

అన్నీ తెలిసి కూడా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ బాబుని ఎవరూ కోరని కోరిక కోరారు. అదే అధికారంలో వాటా. భాగస్వామ్యం అని దానికి అందమైన పేరు. చంద్రబాబు ఏమైనా చేస్తారు, దేనినైనా ఇస్తారు కానీ పవర్ షేర్ కి ఆయన ఒప్పుకుంటారా అంటే ఎవరిని అడిగినా సమాధానం ఇట్టే చెప్పేస్తారు. అలాంటిది పవన్ ఎందుకు ఈ ప్రతిపాదన పెట్టారు, బంతిని ఎందుకు చంద్రబాబు కోర్టులో వేశారు. అంటే పవన్ మీద ఉన్న వత్తిడి అలాంటిది.

ఆయన అలా చేసినా బాబు తగ్గుతారా. ఈసారి కిరీటం పవన్ కి అప్పగించి ఆయన చేతులు కట్టుకుని కూర్చుంటారా. అసలు అది అయ్యే పని కాదు కదా. ఇక ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న రాజకీయ అంతా తన కుమారుడు లోకేష్ కోసం. చంద్రబాబు పద్నాలుగేళ్ల పాటు సీఎం గా ఉన్న నాయకుడు. ఆయనకు ఈ పదవి కొత్త కాదు, ఆయన మీటింగులలో పదే పదే ఇదే చెప్పుకొస్తారు కూడా.

మరి ఎవరికి కొత్త అంటే లోకేష్ కి. ఆయన్ని వెనక్కి పెట్టి బాబు రాజకీయం చేస్తున్నారు. బాబు ఫేస్ తో అధికారం వచ్చినా లేక పోత్తులతో అది చిక్కినా కూడా అది లోకేష్ బంగారు భవిష్యత్తు కోసమే కదా. కావాలంటే ఎవరైనా ఏ రకమైన డౌట్లు ఉంటే ఒంగోలులో రీసెంట్ గా జరిగిన మహానాడు స్టేజ్ మీద ఫ్లెక్సీలను చూస్తే క్లారిటీ వస్తుంది.

ఒక వైపు ఎన్టీయార్ మరో వైపు చంద్రబాబు, ఇంకో వైపు లోకేష్ బాబు. అంటే టీడీపీలో బాబుకు వయసు అయిపోయింది. ఆయన తరువాత అధికారం మనదే అని ఏ మూడవ రాజకీయ పక్షం అనుకున్నా అది తప్పు అని చెప్పేందుకే ఆ ఫ్లెక్సీ. ఇక బాబుతో అధికారంలో వాటా కోరుతున్న జనసేన వ్యూహమేంటి అంటే ఇపుడున్న పరిస్థితులలో ఒంటరిగా టీడీపీ ఎన్నికలకు వెళ్లలేదని.

ఆ విధంగా బాబుని వత్తిడిలో పెట్టి తాము కోరుకున్నది సాధించవచ్చునని ఒక ఎత్తుగడ అయితే జనసేన వేయవచ్చు కాక. కానీ బాబు తో గేమ్స్ అసలు కుదరవు ఆయన రాజకీయ గండరగండడు. అలాగని జనసేనతో పొత్తు వద్దు అంటారా. అది కూడా కాదు, మరి ఎలా ఇది సాకారం అవుతుంది. అక్కడే బాబు చాణక్యాన్ని అర్ధం చేసుకోవాలి. దానికి ఇంకా చాలా టైమ్ ఉంది. ఇప్పటికైతే చెప్పడానికి విప్పడానికీ టూ ఎర్లీ కూడా. ప్రస్తుతానికి గుప్పిట విప్పేసి జనసేన బోల్డ్ గా ప్రకటన చేసేసింది. ఇక ఇపుడు చంద్రబాబు కోర్టులో బంతి ఉంది. ఆయన దాంతో సిక్సర్ కొడతారో బౌండరీస్ దాటిస్తారో వెయిట్ అండ్ సీ.