Begin typing your search above and press return to search.

ఏపీ డీజీపీకి బాబు ప్రశ్న... మీ చేతనవుతుందా? లేదా?

By:  Tupaki Desk   |   12 Jun 2022 4:31 PM GMT
ఏపీ డీజీపీకి బాబు ప్రశ్న... మీ చేతనవుతుందా? లేదా?
X
రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ సర్కారు పనితీరును ప్రశ్నిస్తే.. దాడులు చేసి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి సర్కారు వైఫల్యాలను ప్రశ్నిస్తే.. దాడులు, హత్యలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వెంకాయమ్మ కుటుంబంపై మరోసారి దాడి జరగడంపై.. డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై వైసీపీ నేతలు ఇష్టానుసారం దాడులు చేస్తున్నారని అన్నారు. కొందరు పోలీసు అధికారుల సహకారంతోనే.. ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు.

వెంకాయమ్మ, ఆమె కుమారుడు వంశీపై జరిగిన దాడి.. ఈ వరుస ఘటనల్లో భాగమేనని లేఖలో పేర్కొన్నారు. వెంకాయమ్మపై దాడి చేసిన వారిపై ఇంకా చర్యలు తీసుకోలేదన్న చంద్రబాబు.. ఆమె కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని కోరారు. దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు లేఖతోపాటు పలు వీడియోలు జతచేసి డీజీపీ పంపించారు.

ఏం జ‌రిగిందంటే..

గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో.. గతంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన వెంకాయమ్మపై మరోసారి అధికార పార్టీ నాయకులు దాడి చేశారు. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... వైసీపీకి చెందిన నల్లపు సునీత వర్గీయులు.. పాత గొడవలను మనసులో పెట్టుకొని వెంకాయమ్మను నిత్యం దూషిస్తున్నారు. ఈ క్రమంలో.. వారి దుషణలను ఫోన్లో రికార్డు చేయాలని వెంకాయమ్మ తన కుమారుడికి సూచించింది.

దీంతో.. ఆమె కుమారుడు ఫోన్లో రికార్డు చేస్తుండగా.. నల్లపు సునీత గమనించి వెంబడించింది. ఇది గమనించిన వెంకాయమ్మ కుమారుడు పరిగెత్తుకుంటూ వెళ్లి తల్లికి విషయం చెప్పాడు. ఈ క్రమంలో కంతేరు గ్రామ వాటర్ ట్యాంక్ వద్ద.. ఇరువర్గాలు గొడవపడ్డారు. ఈ ఘర్షణలో వెంకాయమ్మ, ఆమె కుమారుడు వంశీపై నల్లపు సునీత వర్గీయులు కర్రలతో దాడిచేశారని బాధితులు తెలిపారు. ఈ గొడవపై ఇరు వర్గాలూ పోలీసులను ఆశ్రయించాయి. దీనిపైనే చంద్ర‌బాబు ఫైర‌య్యారు. మ‌రి ఈ లేఖ‌పై డీజీపీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.